– అసెంబ్లీలో మంత్రి నారాయణ
అమరావతి: అసెంబ్లీ క్వశ్చన్ అవర్ మంత్రి నారాయణ మాట్లాడారు. రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల పరిస్థితిపై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వచ్చే జూన్ నెలాఖరు లోపు 2,61,640 టిడ్కో ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నాం. ఎక్కడైనా పూర్తయిన ఇళ్లను ప్రతి శనివారం లబ్దిదారులకు అప్పగించాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలిచ్చాం. మొత్తం ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతులకు, కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలకు కలిపి 7280 కోట్లు అవసరమన్నారు.
ఈ నిధులను హడ్కో ద్వారా, వివిధ బ్యాంకుల నుంచి లోన్ లు సేకరిస్తున్నాం. 2014-19 లో కేంద్ర ప్రభుత్వం 7,01,481 టిడ్కో ఇళ్లను ఏపీకి కేటాయించింది. వీటిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలనా అనుమతులు తీసుకుని టెండర్లు పిలిచాం అని తెలిపారు. గత ప్రభుత్వం వీటిని 2,61,640 కు తగ్గించడమే కాకుండా…ఇళ్లను కూడా పూర్తి చేయలేదు. అంటే మొత్తంగా 4,39,841 ఇళ్లను రద్దు చేసేసింది. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లలో అనేక అవకతవకలకు పాల్పడింది.. 39,520 మంది లబ్దిదారులకు అర్హత లేదని పక్కన పెట్టేసిందని మంత్రి విమర్శించారు.
ఇళ్లకు పార్టీ రంగులు వేసి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వలేదు. ఇళ్లు ఇవ్వకుండానే లబ్ధిదారుల పేరుమీద బ్యాంకు లోన్ లు తీసుకుంది. ఈ లోన్ లు చెల్లించేందుకు ఈ ప్రభుత్వం 140 కోట్లు బ్యాంకులకు చెల్లించిందని తెలిపారు.