Suryaa.co.in

Andhra Pradesh

అర్హులకు దీపావళి నుండి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు!

•ఎల్.పి.జి కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు అర్హతగా ఈ పథకం అమలు
• ప్రతి ఏడాది రూ.2,684.75 కోట్ల మేర ప్రభుత్వం పై భారం
•అయిల్ కంపెనీలకు అడ్వాన్సుగా రూ.894.92 కోట్లను 29 న చెక్కు రూపేణా చెల్లింపు
* 29 నుండి గ్యాస్ బుకింగ్ ప్రారంభం, 31 న ప్రతి ఇంటికీ తొలి సిలిండర్ డెలివరీ
•గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, 48 గంటల్లో గ్రామీణా ప్రాంతాల్లో డెలివరీ
* డెలివరీ చేసిన 48 గంటల్లోనే లబ్దిదారుల ఖాతాలోకి నేరుగా రాయితీ సొమ్ము జమ
•మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబరు 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చు
•టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు
•ఈ పథకం అమలుకై విధి విదానాలను నిర్థేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
• రాష్ట్ర ఆహార & పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

అమరావతి: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఈ దీపావళి నుండే మూడు ఉచిత గ్యాస్ సిలిండ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, మార్గదర్శకాలను, విధి విధానాలను నిర్దేశిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేస్తున్నట్టు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నాల్గోబ్లాక్ ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. ఈ నెల 31 న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, తదుపరి వెంటనే ప్రతి ఇంటికీ మొదటి గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుందన్నారు.

ఎల్.పి.జి.కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు అర్హతగా ఈ పథకం అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయని, వీరిలో అర్హులు అందరికీ ఈ పథకం వర్తింప చేస్తామన్నారు. ఈ పథకం అమలుకై ప్రతి ఏడాది ప్రభుత్వం పై రూ.2,684.75 కోట్ల మేర భారం పడుతుందన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కుంటున్నా సరే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఈ పథకం అమల్లో భాగంగా ఈ నెల 29 నుండి గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం అవుతుందని, గ్యాస్ బుకింగ్ చేసుకోగానే ఒక ఎస్.ఎం.ఎస్. సంబంధిత లబ్దిదారుని ఫోన్ నెంబరుకు వెళుతుందని, గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, 48 గంటల్లో గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండ్లను డెలివరీ ఉంటుందన్నారు. అదే విధంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోనే డి.బి.టి. విధానం ద్వారా లబ్దిదారుల ఖాతాలోని నేరుగా రాయితీ సొమ్ము జమవుతుందని తెలిపారు.

ప్రభుత్వం అందజేసే మూడు ఉచిత సిలిండర్లలో మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబరు 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ పథకం అమలుకై ఏడాదిని మూడు బ్లాక్ పీడియడ్లుగా పరిగణించడం జరుగుతుందని, మొదటి బ్లాక్ పీడియడ్ ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు, రెండో బ్లాక్ పీడియడ్ ను ఆగస్టు 1 నుండి నవంబరు 31 వరకు, మూడో బ్లాక్ పీడియడ్ ను డిసెంబరు 1 నుండి మార్చి 31 వరకు పరిగణిస్తామని చెప్పారు. ఈ పథకం అమల్లో లబ్ధిదారులకు ఏమన్నా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు.

ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే మూడు ఆయిల్ కంపెనీలతో మాట్లాడామని, ఆయిల్ కంపెనీల వద్ద, ప్రభుత్వం వద్ద ఉన్న డాటాను అనుసంధాపరుస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు వివరించారు. ఈ పథకం అమలుకు ఆయిల్ కంపెనీలకు అడ్వాన్పుగా రూ.894.92 కోట్లను ఈ నెల 29 న చెక్కు రూపేణా చెల్లిస్తామని చెప్పారు.

అనంతరం పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెపుతూ రాష్ట్రంలో ఉన్న 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లలో కేవలం 9.65 లక్షల గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే ప్రధాన మంత్రి ఉజ్వల యోజనా పథకం వర్తింపు అవుతుందన్నారు. కాకినాడలో 52 వేల మెట్రిక్ టన్నుల్లో 27 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పి.డి.ఎస్. రైస్ గా గుర్తించామని, 11 మందిపై కేసులు పెట్టామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నామని, ఇప్పటి వరకూ 147 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేసి 24 గంటల్లోపే దాదాపు రూ.34 లక్షలను చెల్లించామని చెప్పారు.

రాష్ట్రంలోనే తొలిసారిగా ధరల స్థిరీకరణకై ఒక కమిటీని ముఖ్యమంత్రి వేశారని, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఆ కమిటీకి చైర్మన్ ఆర్థికం, ఆరోగ్య, వ్యవసాయ శాఖల మంత్రులు సభ్యులుగా ఈ కమిటీలో ఉన్నారన్నారు. ఈ కమిటీ ఏర్పాటు అయిన తదుపరి కందిపప్పు రేటును రూ.180/- నుండి రూ.160/-కి తదుపరి రూ.150/-తగ్గించే విధంగా హాల్ సేల్ డీలర్లతో చర్చలు జరిపినట్టు తెలిపారు. ఎవరూ ఊహించని విధంగా రేషన్ డిపోల ద్వారా కేజీ కందిపప్పు కేవలం రూ.67/- లకే సరఫరా చేస్తున్నామని తెలిపారు. పామాయిల్ పై ఉన్న కస్టం డ్యూటీని కేంద్రం 7 శాతం నుండి 27 శాతానికి పెంచిన నేపథ్యంలో రూ.92/-ల ఉన్న దాని ధర దాదాపు రూ.130/- లకు పెరిగిందన్నారు. అయితే తమ కమిటీ చొరవతో దాని ధర రూ.110/- లకు తగ్గించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,300 అవుట్ లెట్స్ ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.

ఉల్లిపాయి, టొమాటా ధరలను నియంత్రించేందుకు మార్కుఫెడ్ సహకారంతో రాయితీపై తక్కువ ధరలకే అన్ని కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచామని, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హులైన వారందిరికీ 2029 వరకూ ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసే విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే రాష్ట్రంలోనున్న తెల్ల కార్డుల్లో 60 శాతం కార్డులకు మాత్రమే ఈ పథకం వర్తింపు అవుతోందని, మిగిలిన 40 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నట్టు మంత్రి తెలిపారు.

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్, కార్యదర్శి వీరపాండ్యన్, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE