Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో 3,246 మురికివాడలు

రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, మార్చి 14: ఆంధ్రప్రదేశ్‌లో నోటిఫై చేసిన మురికివాడలు 3,246 ఉన్నట్లు కేంద్ర పట్టణ, గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి కౌషల్‌ కిషోర్‌ వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మురికివాడల్లో నివసించే జనాభా సంఖ్య 37 లక్షల 93 వేలు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమాచారం పంపిందని తెలిపారు. 2011 -2014 మధ్య కాలంలో విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 4 మురికివాడల ప్రజల పాక్షిక పునరావాసం కోసం 1,205 ఇళ్ళను నిర్మించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ మిషన్‌ (జేఎన్‌ఎంఆర్‌యూ) కింద రాష్ట్రంలోని మురికివాడల్లో నివసించే ప్రజల కోసం 13,706 తక్కువ ధర ఇళ్ళ నిర్మాణం జరిగినట్లు మంత్రి చెప్పారు.

2015 జూన్‌లో ప్రారంభించిన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌) అర్హులైన అన్ని కుటుంబాలు, లబ్ధిదారులకు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలు, నోడల్‌ ఏజెన్సీలకు ఆర్థిక సహాయం ఇందిస్తోందని మంత్రి తెలిపారు. పీఎంఏవై (అర్బన్‌) కింద మురికివాడల్లోని అర్హులైన లబ్ధిదారుల కోసం 20.43 లక్షల ఇళ్ళను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. 2015-16 నుంచి 2021-22 వరకు పీఎంఏవై(అర్బన్‌) కింద కేంద్ర ప్రభఉత్వం ఆంధ్రప్రదేశ్‌కు 31 వేల 88 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇప్పటి వరకు 11,755 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు చెప్పారు.

LEAVE A RESPONSE