Suryaa.co.in

Andhra Pradesh

చేనేతలకు 365 రోజుల పనే లక్ష్యం

* రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
*చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం
* త్వరలో మరిన్ని చేనేత ఎగ్జిబిషన్లు
* ఎగ్జిబిషన్ల ఏర్పాటుతో చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగాయన్న మంత్రి
* మంత్రి సవితకు నేతన్నల ధన్యవాదాలు
* ఎగ్జిబిషన్ల నిర్వహణతో రోజూ మాకు పని దొరుకుతోందని వెల్లడి

విజయవాడ : నేతన్నలకు 365 రోజుల పాటు పని కల్పించడంతో పాటు చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం మరిన్ని ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. నగరంలోని ఓ కల్యాణమండపంలో చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాల స్టాళ్లను మంగళవారం మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. చేనేత వస్త్రాల అమ్మకాల కోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రాబోయే ఉగాది సంబరాల నేపథ్యంలో విజయవాడలో చేనేత ఎగ్జిబిషన్ ను ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ ఎగ్జిబిషన్ లో రాష్ట్రానికి చెందిన పొందూరు, ఉప్పాడ, అంగర, పులగర్త, బందరు, మంగళగిరిచీరలు మరియు డ్రెస్ మెటీరియల్స్ చీరాల చీరలు మరియు డ్రెస్ మెటీరియల్స్ వెంకటగిరి,ధర్మవరం మదనపల్లి ఏమిగనూరు, గద్వాల్, కంచిపురం, పోచంపల్లి శారీల స్టాళ్లతో పాటు తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, జమ్మూ కశ్మీర్, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన నేతన్నలు 89 స్టాళ్లు ఏర్పాటు చేశారన్నారు. ఎగ్జిబిషన్ లో పాల్గొన్న నేతన్నలందరికీ ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు.

నేతన్నలకు ఇచ్చిన హామీల అమలు

నేతన్నలకు 365 రోజుల పాటు పని కల్పించాలన్న లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేనేతలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చిన విధంగా మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తున్నామన్నారు.
నూలుపై 15 శాతం సబ్సిడీ అందజేస్తున్నామన్నారు. ఆధునిక పని ముట్లను 90 శాతం సబ్సిడీ చేనేతలకు సరఫరా చేస్తున్నామన్నారు. ముడి సరకులు కూడా సబ్సిడీపై అందజేస్తున్నామన్నారు. త్రిఫ్ట్ పథకంలో ప్రభుత్వం వాటాను 8 నుంచి 16 శాతానికి పెంచామన్నారు. గత ఏడాది 10 క్లస్టర్లు ఏర్పాటు చేశామన్నారు. జగన్ ప్రభుత్వం తొమ్మిది పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచి, చేనేతలపై అధిక భారం మోపిందని మండిపడ్డారు.

త్వరలో మరిన్ని ఎగ్జిబిషనన్లు

చేనేత వస్త్రాలకు మరింత మార్కెట్ సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా రానున్న రోజుల్లో మరిన్ని ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయనున్నామని మంత్రి సవిత తెలిపారు. రాబోయే తెలుగు సంవత్సర పండగను దృష్ట్యా ప్రజలందరూ సంప్రదాయానికి ప్రాధాన్యమిస్తూ చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.

రోజూ మాకు పని దొరుకుతోంది : నేతన్నల హర్షం

అనంతరం చేనేత వస్త్రాలు, హ్యాండీ క్రాఫ్ట్ స్టాళ్లను సందర్శించారు. ఏ రాష్ట్రం నుంచి వచ్చారు…ఏయే వస్త్రాలు అమ్మకాలకు పెట్టారు..? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులు… మంత్రి సవితతో మాట్లాడుతూ, తరుచూ ఎగ్జిబిషన్లు నిర్వహించడంపై ధన్యవాదాలు తెలిపారు. ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం వల్ల చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగాయని, రోజూ పని దొరుకుతోందని, దీంతో తమకు ఆదాయం పెరిగిందని స్టాళ్లు నిర్వాహాకులు ఆనందం వెలిబుచ్చారు.

సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తమకు మంచి రోజులు ప్రారంభమయ్యాయని నేతన్నలు ఆనందం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, అబద్ధయ్య, పలువురు డైరెక్టర్లు, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, జాయింట్ డైరెక్టర్ కన్నబాబు, ఆప్కో జీఎం రాజారావు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE