– కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చింది
– కొత్త రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ఉండాలి
సూర్యాపేటలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు
సూర్యాపేట: ఈరోజు నా జన్మభూమి అయిన నల్లగొండ జిల్లాలో పర్యటించటం నాకు ఆనందంగా ఉంది. 1985లో యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నేను బాధ్యతలు చేపట్టినప్పుడు, జిల్లాల్లో బీజేపీ సభ్యత్వ సేకరణకు ఇన్చార్జ్గా పని చేశాను. అప్పట్లో కోదాడ నుంచి సైకిళ్లపై కొన్ని గ్రామాలకు వెళ్లి సభ్యత్వ సేకరణ చేశాం.
నేడు సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి లాంటి నియోజకవర్గాల్లో లక్షకు పైగా బీజేపీ సభ్యత్వాలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 3.5 కోట్ల జనాభాలో 40 లక్షల మందికి పైగా బీజేపీ సభ్యత్వం పొందడం గర్వకారణం. బీజేపీకి తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు.
తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలి. కానీ దళారుల ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఈ కార్డులు ఇచ్చే ప్రయత్నం చేస్తే బీజేపీ ఊరుకోదు. కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చింది.
రేషన్ కార్డులు ఉన్న పేదలకు ఉచిత బియ్యం పథకంలో భాగంగా 90 శాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వమేచేస్తోంది. కొత్త రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ఉండాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిధులతో వచ్చిన పథకానికి తమకే క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తోంది.
పీఎం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఒక కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం దేశవ్యాప్తంగా అందిస్తున్నారు. కాని రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదు? కేంద్రం పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల ద్వారా తెలంగాణ ప్రజలకు మేలు చేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలకు తాము ఏమీ ఇవ్వలేదంటూ కేంద్రాన్ని తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎయిమ్స్ (బీబీనగర్), సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వే తయారీ యూనిట్, నిజామాబాద్ పసుపు బోర్డు, వందే భారత్ రైళ్లు, కొత్త రైల్వే లైన్లు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు అందించింది.
విశ్వకర్మ యోజన ద్వారా హస్తకళాకారులు, చేతివృత్తిదారుల కోసం నైపుణ్య శిక్షణ, వ్యాపార మద్దతు, ఆర్థిక సహాయం అందిస్తోంది. ముద్రా లోన్లు, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా పథకాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చెప్పింది చెయ్యడంలో నిబద్ధతతో పనిచేస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయక మోసం చేస్తోంది.
రైతుల రుణమాఫీ చేయలేదు. రైతుబంధును నిలిపివేసింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించక విద్యావ్యవస్థను సంక్షోభంలోకి నెట్టింది. నిరుద్యోగ భృతి విషయంలో కూడా మాట తప్పింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది.
నల్లగొండ జిల్లా రాజకీయ చైతన్యకు నిలయంగా ఉంది. ఇది ఉద్యమాలకు కేంద్రబిందువుగా నిలిచింది. హామీలు నెరవేర్చకుంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని గద్దె దింపుతారు. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమం జరగాలి. రాబోయే రోజుల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావడం ఖాయం.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలను ప్రజలు చూశారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మనమంతా కృషి చేయాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కార్యకర్తలను, ప్రజలను కోరుతున్నాను.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో అసెంబ్లీలో బిల్లు పైన బీజేపీ మద్దతు తెలిపింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ జాబితాలో మతపరమైన రిజర్వేషన్లను చేర్చినట్లయితే బీజేపీ సహించదు. నిజమైన బీసీలకే 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.