Suryaa.co.in

Andhra Pradesh

స్మార్ట్‌ పోలీసింగ్‌ కింద ఏపీకి 43 కోట్ల నిధులు

న్యూఢిల్లీ, మార్చి 16: పోలీసు వ్యవస్థలో సమూలమైన సంస్కరణలు తీసుకురావడానికి ప్రవేశపెట్టి స్మార్ట్‌ పోలీసింగ్‌ విధానం కింద 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్‌కు 43 కోట్ల 68 లక్షల రూపాయల నిధులు విడుదల చేసినట్లు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ వెల్లడించారు.

రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2014 నవంబర్‌లో జరిగిన డీజీపీ, ఐజీ 49వ వార్షిక సమావేశంలో పోలీసు వ్యవస్థలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ప్రధానమంత్రి స్మార్ట్‌ పోలీసింగ్‌ విధానాన్ని అమలులోనికి తీసుకువచ్చారని తెలిపారు.

శిక్షణ ద్వారా పోలీసుల సామర్ధ్యం పెంపు, అధునాతన టెక్నాలజీ వినియోగం, ప్రజల విశ్వాసం చూరగొనడం, పోలీసింగ్‌లో అధునాతన, వినూత్న పద్దతులను ప్రవేశపెట్టడం, సైంటిఫిక్‌ పరికరాలు, అప్లికేషన్ల ద్వారా విచారణను పక్కాగా నిర్వహించడం వంటి అంశాలు స్మార్ట్‌ పోలీసింగ్‌లో భాగమని ఆయన తెలిపారు. పోలీసు వ్యవస్థను ఆధునీకరించే అంశంలో ఆయా రాష్ట్రాలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. సంస్కరణల అజెండా లక్ష్యాలను ఆయా రాష్ట్రాలు ఏ విధంగా అందుకుంటున్నాయో పరిశీలించి ప్రోత్సాహకాల కింద వాటికి నిధులను విడుదల చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

2018-19లో స్మార్ట్‌ పోలీసింగ్‌ విధానాల అమలు కోసం ఆంధ్రప్రదేశ్‌తోపాటు పది రాష్ట్రాలను ఎంపిక చేసి వాటన్నింటికీ కలిపి 76.90 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది. అలాగే 2019-20లో ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఆరు రాష్ట్రాలకు మొత్తం 158.26 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ నిధులను ఆయా రాష్ట్రాలు పూర్తిగా వినియోగించని కారణంగా 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలలో రాష్ట్రాలకు ఎలాంటి ప్రోత్సాహకాలను విడుదల చేయలేదని మంత్రి తెలిపారు.

LEAVE A RESPONSE