– రూ.85 కోట్ల వరకు వ్యయం
– మరో నెలలో తిరుమల, విశాఖలో కార్యకలాపాలు ప్రారంభం
– మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి: ప్రజల ఆరోగ్యదాయక జీవనానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో సుమారు రూ.86 కోట్లతో 5 ఆహార నాణ్యతా పరీక్షా కేంద్రాల్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు సుమారు రూ. 20 కోట్ల వరకు ఖర్చుపెడుతున్నామని చెప్పారు. ఈ కేంద్రాల్లో సమకూరే అత్యాధునిక యంత్ర పరికరాల ద్వారా ఆహార పదార్ధాల నమూనాలను పరీక్షిస్తారని చెప్పారు. వీటిల్లో తిరుమల, విశాఖలలోని ల్యాబొరేటరీ నమూనాల పరీక్షలు మరో నెల రోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్. ఎస్ ఎస్ ఎ.ఐ) తో కుదిరిన ఒప్పందం మేరకు ఈ కేంద్రాల ఏర్పాటు జరుగుతోందన్నారు.
తిరుమల భక్తుల కోసం ప్రత్యేక రాష్ట్ర స్థాయి ల్యాబొరేటరీ
శ్రీవారి భక్తుల ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఏర్పాటు పనులు తుది దశకు చేరుకున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వచ్చే నెలాఖరునాటికి ఈ ల్యాబొరెటరీని వినియోగానికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి ఘటన వల్ల భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి ల్యాబొరేటరీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. ఎఫ్ ఎస్ఎస్ఎఐతో కుదిరిన ఒప్పందాన్ని అనుసరించి తిరుమలలో ల్యాబొరేటరీ ఏర్పాట్ల పనుల్ని గత ఏప్రిల్ నుంచి ప్రారంభించినట్టు చెప్పారు.
తిరుమలలోని పిండి మిల్లు వద్ద అక్కడి అధికారులు అందజేసిన భవనాన్ని(12,000 చదరపు అడుగులు) ల్యాబొరేటరీ ఏర్పాటుకు అనుగుణంగా మారుస్తున్నట్లు తెలిపారు. సుమారు రూ.19 కోట్ల వ్యయం చేసే ఆహార నమూల పరీక్షలు చేసేందుకు గాను యంత్రపరికరాలను ల్యాబొరెటరీలో సమకూరుస్తున్నామని చెప్పారు. ఈ ల్యాబొరెటరీలో అన్ని రకాల ఆహార పదార్థాల నమూనాలను పరీక్షిస్తారన్నారు. 24గంటల పాటు ఈ ల్యాబబొరెటరీ పనిచేసేలా అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉంటారని వెల్లడించారు. దేశవిదేశాల నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా ఈ కేంద్రం పనిచేస్తుందని మంత్రి తెలిపారు.
ఇప్పటి వరకు ఆహార పదార్థాల నాణ్యతా పరీక్షల నిమిత్తం పొరుగు రాష్ట్రాలకు నమూనాలు పంపిస్తున్నారన్నారు. సిబ్బందికి నమూనాల పరీక్షలపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. తిరుమల ఆహార పదార్థాల తయారీకి దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చే నిత్యావసర వస్తువుల(పాలు, పెరుగు వగైరా) నమూనాలను ఈ కేంద్రంలో పరీక్షించి నాణ్యత ఉన్నట్లు నిర్ధారణ జరిగిన తర్వాతే వాటిని వినియోగిస్తారని చెప్పారు.
విశాఖపట్నంలోని రాష్ట్ర స్థాయి ఫుడ్ ల్యాబొరెటరీ కూడా వచ్చే నెలలో ప్రారంభం కానుందని, ఇందులో అవసరమైన అన్ని రకాల యంత్రపరికరాల్ని అందుబాటులోకి తీసుకొచ్చే పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు.
గుంటూరు, తిరుపతి, కర్నూలులోనూ…
గుంటూరు జీజీహెచ్లో అలాగే తిరుపతిలో రాష్ట్ర స్థాయి ఫుడ్ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కర్నూలులో ఇప్పటికే ప్రాంతీయ ఫుడ్ ల్యాబొరెటరీ ఉందన్నారు. దీని స్థాయిని పెంచి కొత్తగా భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. దీనికోసం స్థలాన్వేషణ జరుగుతోందన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే కాంట్రాక్టర్లు పనులు మొదలు పెడతారని చెప్పారు.
రూ.13 కోట్లతో ఒంగోలు, ఏలూరు ల్యాబ్ల ఉన్నతీకరణ
ఒంగోలు, ఏలూరులో ఉన్న పబ్లిక్ హెల్త్ ల్యాబొరెటరీలను ఉన్నతీకరణిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఇప్పటికే నడుస్తున్న ల్యాబుల్లో సుమారు రూ.13 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరికరాల్ని సమకూరుస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి పరికరాల కొనుగోలుకు పర్చేజింగ్ ఆర్డర్ కూడా ఇచ్చామని మంత్రి చెప్పారు