Suryaa.co.in

Andhra Pradesh

ఆరు నెలల వ్యవధి లోనే 50 వేల కోట్ల అప్పులు

-ఐదేళ్ల టిడిపి ప్రభుత్వ హయాంలో సగటున 30 వేల కోట్ల అప్పు చేస్తే…
-గందరగోళ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాష్ట్ర ప్రజలపై కొత్త పన్నులు పెరిగాయని, గతంలో కంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు కూడా తక్కువేనని… అయినా ప్రజలకు డబ్బులు పంచేస్తున్నామని అంటున్నారని, కానీ ఆ డబ్బులు ఎక్కడకు వెళ్తున్నాయో అర్థం కావడం లేదని… రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అయోమయంగా, గందరగోళంగా తయారయిందని నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు. ఐదేళ్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో సగటున ఏడాదికి 30 వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తే, తమ ప్రభుత్వ హయాంలో గత ఆరు నెలల వ్యవధిలోని 50 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారని చెప్పారు.

గట్టిగా అరిచి అబద్ధం చెప్పినంత మాత్రాన 50 వేల కోట్ల రూపాయల అప్పు తక్కువ కాదు… 30 వేల కోట్ల రూపాయల అప్పులు ఎక్కువైపోవని అన్నారు. ఈ ఆరు నెలల వ్యవధిలోనే లిక్కర్ బాండ్ల ద్వారా తెచ్చిన అప్పులతో కలిపి, 49 వేల ఆరు వందల కోట్ల రూపాయల అప్పులు చేసింది నిజం కాదా?అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అబద్ధాలు చెబుతూ పోతే, ప్రజలు నమ్ముతూ పోతారని అనుకుంటే పొరపాటు జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఒకసారి కుదిరింది ప్రజలు మన అబద్దాలను నమ్మారని, ప్రజల బలహీనత మీదనే మేడలు కట్టుకుంటామంటే, అవి పేక మేడల్లా కూలిపోవడం ఖాయమని హెచ్చరించారు.

హస్తినలో అప్పుల వేటలో బుగ్గన
రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన బృందం వేటగాడు అడవిలోకి వేటకు వెళ్లినట్లుగా, హస్తినాలో అప్పుల వేటను కొనసాగిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరు నెలల వ్యవధిలో, 49,600 కోట్ల రూపాయల అప్పులను చేసిందని చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని దారి మళ్లించి, కార్పొరేషన్ ఆదాయంగా చూపించి, కార్పొరేషన్ కు వచ్చే ఆదాయం ద్వారా ఏటా కొంత మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని చెప్పి లిక్కర్ బాండ్ల రూపంలో 8000 కోట్ల రూపాయల అప్పులను చేశారన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని దారి మళ్లించి, అప్పులు చేయడం తప్పని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. ఈ ఏడాది కాల వ్యవధికి రాష్ట్ర ప్రభుత్వానికి 48 వేల కోట్ల రూపాయల అప్పులను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న ఆయన, లిక్కర్ బాండ్ల రూపంలో చేసిన అప్పులను కలుపుకుంటే ఇప్పటికే రుణపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం దాటిపోయిందన్నారు.

8 వేల కోట్ల రూపాయల అప్పులను రాష్ట్ర ప్రభుత్వ అప్పులలో కలుపుతారో లేదా అన్నది చూడాలని చెప్పారు. ఢిల్లీలో అప్పుల వేటను కొనసాగిస్తున్న బుగ్గన బృందం ఎలాగైనా 20వేల కోట్ల రూపాయల అప్పులను చేయాలని, పడరాని పాట్లు పడుతుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. వారికి అప్పులు పుడతాయని తనకైతే నమ్మకం లేదని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పుల వేటలో జరగని అక్రమాలు అంటూ లేవని ఆయన వ్యాఖ్యానించారు. కరెంటు బిల్లులు చెల్లించాలన్న సాకుతో పంచాయితీ నిధులను స్వాహా చేశారని, ఆ బిల్లులైనా కట్టారా లేదా అన్నది అనుమానమేనని పేర్కొన్నారు.

మెడికల్ యూనివర్సిటీ నిధులతో పాటు, ఉద్యోగుల పిఎఫ్ డబ్బులను, టీడీఎస్ కట్టకుండా డబ్బులను లాగేశారన్నారు. సిఐజి వాళ్లేమో తమకు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని పేర్కొంటుండగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు . గత ప్రభుత్వం కంటే, తమ ప్రభుత్వం తక్కువగా అప్పులు చేసిందని నిస్సిగ్గుగా చెప్పుకున్నారని విమర్శించారు.

ఆరోగ్యశ్రీ జబ్బులు పెంచారు… కానీ డబ్బులు తగ్గించారు
ఆరోగ్యశ్రీ పథకం లో అధికంగా జబ్బులను చేర్చామని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, సగటున ఏడాదికి వెయ్యి 50 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేసిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అదే టిడిపి ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ వైద్య సేవ కోసం 1300 నుంచి 1450 కోట్ల రూపాయల మేర ఖర్చు చేసిందని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం లో మూడు రెట్లు అదనంగా జబ్బులను చేర్చి, కరోనా లాంటి ఉపద్రవం వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకం అమలు కోసం ఖర్చు చేసింది నామమాత్రమేనని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కంటే తక్కువ నిధులను ఖర్చు చేసి 300% జబ్బులను పెంచామని పచ్చి అబద్దాలను చెబితే విశ్వసనీయత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలను అందకుండా చేశారని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏవి కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు.

అప్పులు తగ్గించి ఆదాయాన్ని పెంచుకోవాలి
ఢిల్లీలో అప్పుల వేటను తగ్గించి, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే దిశగా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.. సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం జెన్యూన్ గా ఖర్చు చేయాలన్న ఆయన, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎక్కడా డబ్బులు ఖర్చు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులను చేసి, కొద్ది మందికి నాలుగు రూపాయలను పంచితే, ఆ డబ్బులు తిరిగి ప్రభుత్వ పెద్దల ఖాతాలకే వెళుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రజల ఎవరికి కూడా వాస్తవంగా లబ్ధి చేకూరడం లేదని పేర్కొన్నారు. ఓవరాల్ గా చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా దిశగా వెళుతుందన్న రఘురామకృష్ణంరాజు, శ్రీలంక మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తయారయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంక జనాభా కేవలం మూడు కోట్లేనని, మన రాష్ట్ర జనాభా ఐదు కోట్లని, శ్రీలంక చేసిన అప్పులను వారి పర్ క్యాపిటా తో పోలిస్తే, మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల కంటే తక్కువేనని, అయినా శ్రీలంక దేశం ఆర్థికంగా మునిగిపోయిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పెద్దల పరిస్థితి సాగినంత కాలం లాగుదామని తరువాత సంగతి తర్వాత అన్నట్లుగా వ్యవహరిస్తూ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా దిశగా తీసుకువెళ్తున్నారన్న ఆయన, మనకెందుకులే అని రాష్ట్ర ప్రజలు అనుకుంటే… భవిష్యత్తు తరాలు సర్వనాశనం అయిపోవడం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రం ఉంటేనే మనం ఉంటామన్న రఘురామకృష్ణం రాజు, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావడం అంటే… మన తలలని తాకట్టు పెట్టి అప్పుడు తీసుకురావడమేనని అన్నారు. అప్పులు తీసుకువచ్చి నలుగురికి నాలుగు చిన్న చిన్న సహాయాలను చేస్తూ, ఏదో తామే అంతా చేశామన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారని, ప్రజలే భస్మాసురున్ని భస్మం చేసిన విష్ణుమూర్తి అవతారాన్ని ఎత్తాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు.
సీఎం రోడ్లపైకి రాకుంటేనే మంచిదని అన్ని వర్గాల ప్రజలు అనుకుంటున్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటిని దాటి రోడ్లపైకి రాకుంటే నే మంచిదని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ముఖ్యమంత్రి రోడ్డుపైకి వస్తే మూడు గంటల ముందుగానే రోడ్లను మూసి వేస్తున్నారని, దీనితో వ్యాపారులకు వ్యాపారం ఉండడం లేదని… విద్యార్థులకు చదువు ఉండడం లేదని, ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటుందని వ్యాఖ్యానించారు. తిరుపతి పట్టణ పురవీధుల్లో గోడలపై గతంలో భారత, భాగవత, రామాయణ ఇతిహాసాలకు చెందిన ఘట్టాలను ప్రముఖ కళాకారుల చేత చిత్రించారని, అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన సందర్భంగా, గోడలపై తమ పార్టీ రంగులను వేయడం విడ్డూరంగా ఉందన్నారు.

తమ పార్టీ వారికి ఈ రంగుల పిచ్చి ఏమిటో అర్థం కావడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయవద్దని సుప్రీంకోర్టు అక్షితలు వేసినప్పటికీ, పురవీధుల్లోని గోడలకు పార్టీ రంగులు వేయమని అర్థమా అంటూ అపహాస్యం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో పాటు, పార్టీ దురద అధికంగా ఉన్న వారు, మూడు రంగుల కనిపించే కళ్ళజోళ్లను ధరించి రోడ్డుపైకి రావాలంటూ ఎద్దేవా చేశారు. గతంలో తిరుపతి పట్టణంలోని పురవీధులలో గోడలపై ఉండే ఇతిహాస ఘట్టాలను చూసి భక్తులు ఆనందపడే వారిని, ఇప్పుడు పార్టీ రంగులను చూసి ఆశ్చర్యపోతున్నారన్నారు. తిరుమలకు దేశవ్యాప్తంగా ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులు విచ్చేస్తుంటారని, తిరుపతి పట్టణంలోని గోడలపై పార్టీ రంగులు, చిరునవ్వులు చిందించే జగన్మోహన్ రెడ్డి ఫోటోలను పెట్టడం అవసరమా అంటూ ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి దేవాలయాలకు వెళ్లడం మానివేయాలని, భక్తుల మనోభావాలను దెబ్బతీయవొద్దని కోరారు. రంగుల పిచ్చిని తగ్గించుకొని, గుడి సాంప్రదాయాలను పాటించాలని సూచించారు. తిరుమలలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గుడి సాంప్రదాయాలను విస్మరించారని విమర్శించారు. పుట్టుకతోనే క్రైస్తవ మతానికి చెందిన జగన్మోహన్ రెడ్డి, హిందూ మతాన్ని గౌరవిస్తున్నానని, వెంకటేశ్వర స్వామిపై భక్తి భావాన్ని కలిగి ఉన్నానని అంగీకార పత్రాన్ని ఇవ్వకుండానే, దైవ దర్శనం ఎలా చేసుకుంటారని నిలదీశారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత కనీసం ప్రసాదం కూడా స్వీకరించకుండా జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు .

సెక్యూరిటీ కారణాల రీత్యా ప్రసాదం తీసుకోలేదని పేర్కొనడానికి, టీటీడీ అధికారులంతా మన వారే కదా అని ఎద్దేవా చేశారు . తిరుపతిలో గంగాలమ్మ దేవాలయాన్ని పొద్దున్నే మూసివేస్తే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాయంత్రానికి వెళ్లి దర్శించుకున్నారని అప్పటివరకు భక్తులు ఎన్నో తిప్పలు పడ్డారన్నారు.జీతం తీసుకోకుండానే పనిచేస్తున్నానని చెప్పే జగన్మోహన్ రెడ్డి, ప్రజాధనాన్ని యదేచ్ఛగా దుబారా చేస్తున్నారని మండిపడ్డారు.

దేనికి రాజీనామా చేస్తారో స్పష్టత ఇవ్వాలి
విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్న విషయాన్ని మీడియా ప్రతినిధులు రఘురామ కృష్ణంరాజు దృష్టికి తీసుకురాగా ఆయన దేనికి రాజీనామా చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీకి రాజీనామా చేస్తారా?, జాతీయ కార్యదర్శి పదవికా??, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా అన్నది ముందు తేల్చాలని డిమాండ్ చేశారు. ఇక ఇప్పటివరకు రాజీనామా చేస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు.

సాక్షి దినపత్రికలో మధ్యాహ్నం భోజనం అంటూ వార్తా కథనాన్ని ప్రచురించారని, అయితే అనంతపురం జిల్లాలోని ఒక పాఠశాలలో 600 మంది విద్యార్థులు ఉండగా, అందులో 300 మంది విద్యార్థులు మాత్రమే మధ్యాహ్న భోజనాన్ని భుజిస్తున్నారని ఒక ఉపాధ్యాయుడు తనకు తెలియజేశారని వెల్లడించారు. మిగతా 300 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడానికి సుతారం ఇష్టపడడం లేదని, దానికి కారణం వంటకాలేనని ఆయన పేర్కొన్నారని వివరించారు.. వంటల కాంట్రాక్టు తమ పార్టీకి చెందిన నాయకునికే ఇచ్చారని, విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకపోవడంతో, డిఇఓ ఉపాధ్యాయులకు షోకాజు నోటీసు ఇచ్చి, తన కార్యాలయానికి పిలిపించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వంటల కాంట్రాక్టర్లు మార్చకుండా ఉపాధ్యాయులను వేధించడం ఏమిటంటూ మండిపడ్డారు.

ఇక క్యాటిల్ డాక్టర్ల వంతట?
రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ల విధానాన్ని ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడు పశువుల కోసం క్యాటిల్ డాక్టర్ల విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారట అని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 17 ఆస్పత్రులను నిర్మిస్తున్నామని చెప్పి ఇంతవరకు, ఒక్క ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించలేదని విమర్శించారు. ఇక ఆస్పత్రులలో వైద్యులు, సహాయక సిబ్బంది లేరని సాక్షాత్తు మంత్రి అప్పలరాజు లాంటివారే వాపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైద్య సేవలు అద్వానంగా ఉండగా, సొంత ప్రచారం చేసుకోవడం తప్పితే ప్రజలకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు.

కృష్ణ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి ఇందిరా దేవి గారు మృతి చెందడం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు రఘురామకృష్ణం రాజుగారు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హీరో మహేష్ బాబు తో పాటు, ఆయన కుటుంబ సభ్యులకుసంతాపాన్ని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. లతా మంగేష్కర్ జయంతిని పురస్కరించుకొని ఆమెకు రఘురామకృష్ణం రాజుగారు ఘనంగా నివాళులు అర్పించారు.

LEAVE A RESPONSE