– ప్రతి ఇంట్లో రెండేసి మొక్కలు నాటండి
– వనమహోత్సవం-2025 ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు
హైదరాబాద్: వనమే మనం… మనమే వనం అని పెద్దలు చెప్పారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని ప్రధాని పిలుపునిచ్చారు.. అమ్మలు కూడా పిల్లల పేరుతో మొక్కను నాటండి. ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటండి. మీ పిల్లల్లాగే వాటిని సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండిపోతుందని వనమహోత్సవం-2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే..
మహిళలను ప్రోత్సహిస్తూ మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను ఆడబిడ్డలకు అప్పగించాం. ఆర్టీసీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదు.. ఆర్టీసీకి వెయ్యి బస్సులను అద్దెకు ఇచ్చేలా ప్రోత్సహించి వారిని బస్సులకు యజమానులను చేశాం. హైటెక్ సిటీలో విప్రో, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఉండేచోట మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పించాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పట్టణ ప్రాంతాల్లో మహిళలు కూడాను మహిళా సంఘాల్లో చేరండి.
ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్లు రుణాలు అందించాం. అన్ని రంగాల్లో ఆడబిడ్డలను ముందు భాగాన నిలపాలని ప్రయత్నిస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా రిజర్వేషన్ రాబోతోంది. వచ్చే ఎన్నికల్లో మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేబాధ్యత నేను తీసుకుంటా.