– జానారెడ్డి, పొంగులేటి , మేఘా , మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, సీఎం రమేష్ వర్గీయులకే టెండర్లు వచ్చేలా రేవంత్ సర్కార్ కుట్రలు
– పేదవాడు ఓటేస్తే గెలవలేదా రేవంత్ రెడ్డి?
– పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మేఘా, సీఎం రమేష్ ఓటేస్తేనే గెలిచారా?
– జీవో నెం. 17 వెంటనే రద్దు చేయాలి
– బడా కాంట్రాక్టర్లకు సంపద అందివ్వడానికే జీవో 17
– రేవంత్ రెడ్డి పాలనలో చిరు కాంట్రాక్టర్లకు అన్యాయం
– బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 600 కోట్ల కోడిగుడ్ల కుంభకోణానికి తెరలేపింది. గురుకులాలు ఇతర పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే కోడిగుడ్ల ధరను కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5.50పైసల నుండి 7 రూపాయలకు పెంచింది.
గతంలో ఇచ్చిన కోడిగుడ్ల బరువు 50 నుండి 60 గ్రాములు ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వం కోడిగుడ్ల బరువు 42 నుండి 50 గ్రాములకు తగ్గించింది. గతంలో కోడిగుడ్ల కంట్రాక్టు రావాలంటే ఎలాంటి వార్షిక టర్నోవర్ చూపించాల్సిన అవసరం ఉండేది కాదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం టర్నోవర్ కనీసం 3 కోట్లు ఉన్న వారికే కాంట్రాక్టు ఇచ్చేలా జి వో నెం 17 తీసుకొచ్చింది.
ఫౌల్ట్రీ ఫాం, ఆగ్ మార్క్ కలిగిన వారికే కోడిగుడ్ల కాంట్రాక్టులు దక్కేలా నిబంధనలు మార్చారు. ఇవి పేదలను కాంట్రాక్టర్లకు దూరం చేసే కుట్ర మాత్రమే. గతంలో టెండర్ ఫాం కేవలం 500 నుండి 1000 రూపాయలు ఉండేది. కానీ ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్ ఫాం ధర 25000 కు పెంచింది.
అంతేకాకుండా గతంలో ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు ఇ.ఎమ్.డి లో 40 శాతం రాయితీ ఉండేది. కానీ ప్రస్తుత రేవంత్ సర్కార్ ఆ రాయితీని తొలగించింది. పేద వర్గాలు, చిన్న వ్యాపారులు కాంట్రాక్టర్లుగా ఉండకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది.
అందుకే టెండర్ నిబంధనలు కొత్తగా బడా కాంట్రాక్టర్లతో కలిసి కఠినంగా రూపొందించి, కేవలం ధనికుడు, బడా కాంట్రాక్టర్లకు మాత్రమే కాంట్రాక్టులు వచ్చే విధంగా జీవో నెం.17 తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న జానారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మేఘా కృష్ణ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన సీఎం రమేష్ వర్గీయులకే టెండర్లు వచ్చేలా రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తుంది.
గతంలో స్థానికంగా ఉండే పేదలకు కాంట్రాక్టర్లుగా అవకాశం ఇచ్చేవారు, కానీ ఇపుడు మండలాన్ని ఒక యూనిట్ గా చేసి ఒక్కరికే కాంట్రాక్ట్ ఇచ్చేలాగా నిబంధనలు మార్చారు. జీవో నెం 17 వల్ల సుమారు 20 వేల మంది పేద వర్గాల కాంట్రాక్టర్లు రోడ్డున పడే ప్రమాదం ఉంది. గతంలో క్యాటరింగ్ కాంట్రాక్టుకు కేవలం 75 వేల డిపాజిట్ చేయాల్సి ఉండేది. కానీ ఇపుడు సుమారు 5 లక్షల డిపాజిట్,వార్షిక టర్నోవర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో టెండర్ ఆధారంగా అర్హులైన వారికి కాంట్రాక్ట్ లభించేది, కానీ ఇపుడు వైన్ షాపుల మాదిరిగా లాటరీ తీసే పద్ధతిని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో టెండర్ వెరిఫికేషన్ అధికారం పాఠశాల ప్రిన్సిపల్ చేతిలో ఉండేది. ఇపుడు కలెక్టర్ చేతికి అప్పగించడంతో, కలెక్టర్లు కూడా కమీషన్లు అడుగుతున్నారని తెలుస్తుంది. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఇదే నేర్పుతున్నారా?
గతంలో 2 నెలలకు ఒకసారి కాంట్రాక్టర్లకు బిల్లులు వచ్చేవి. కానీ, ఇపుడు రేవంత్ సర్కార్ 4 నెలలు దాటినా బిల్లులు ఇవ్వడంలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ ఎస్సీ ఎస్టీ బిసి పేద వర్గాలకు చెందిన కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు రాకుండా అడ్డుకుంటున్నారు. చేవెళ్ల డిక్లరేషన్ లో ఎస్సీ ఎస్టీలకు 25 శాతం ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తామన్నారు, ఎందుకివ్వడం లేదు?
మల్లి ఖార్జున ఖర్గే ఏం చేస్తున్నారు? ఎందుకు రేవంత్ రెడ్డిని నిలదీయడం లేదు? భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ఎందుకు పేద వర్గాలకు న్యాయం చేయడం లేదు? ఈయనేమో బంగళాలో కూర్చున్నారు,పేద కాంట్రాక్టర్లేమో రోడ్ల మీద పడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ లో బిసిలకు ప్రభుత్వ కాంట్రాక్టులల్లో వాటా ఇస్తామని హామీ ఇచ్చి ఎందుకు మోసం చేస్తున్నారు?
పేదవాడు ఓటేస్తే గెలవలేదా రేవంత్ రెడ్డి? కేవలం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మేఘా ,సిఎం రమేష్ ఓటేస్తేనే గెలిచారా? గతంలో కేసిఆర్ ప్రభుత్వం పేదలను ధనవంతులుగా చేయాలని కాంట్రాక్టులు ఇచ్చి,రాయితీలు ఇచ్చి,టర్నోవర్ సర్టిఫికెట్ అడగకుండా అన్ని అవకాశాలు ఇచ్చింది.
దళిత బంధు,బిసి బంధు వంటి పథకాలు పెట్టి లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి పారిశ్రామికవేత్తలుగా చేసే ప్రయత్నం చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను విస్మరించి, కేవలం ధనికులనే ఇంకా ధనవంతులుగా చేసే ప్రయత్నం చేస్తుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 103 మంది విద్యార్థులు మరణించారు. చాలా చోట్ల వందల సంఖ్యలో విషాహార ఘటనలు జరిగాయి. బడా కాంట్రాక్టర్లు వస్తే విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ చేతిలో అధికారం ఉండదు.
బడా కాంట్రాక్టర్లు నచ్చింది తెచ్చి, పడేసి వెళ్తారు. నాణ్యత, తాజా కూరగాయల గురించి పట్టించుకోరు. కోడిగుడ్లతో పాటు, నూనె, కూరగాయలు, వంట సామాగ్రి, చికెన్, మటన్ వంటి కాంట్రాక్టులలో వేల కోట్ల కుంభకోణం జరిగే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ అంటేనే కుంభకోణం,కమీషన్లు,కేసులు.
20 వేల మంది పేద కాంట్రాక్టర్ల నోట్లో మట్టి కొడుతుంది రేవంత్ సర్కార్. వెంటనే జి వో నెం 17 ను రద్దు చేయాలి. లేదంటే అన్ని కలెక్టరేట్ ఆఫీసుల ముందు ధర్నాలు చేపడుతాం. కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు అడిగే కలెక్టర్లపై ఛీఫ్ సెక్రటరీ, ఎసిబి, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తాం. జీవో నెం 17 రద్దు కోసం కోర్టును కూడా ఆశ్రయిస్తాం.
పేదలను కాంట్రాక్టుల నుండి దూరం చేయడం రాజ్యాంగ విరుద్ధం… ఆర్టికల్ 14 కు వ్యతిరేకం. 45 పేజీల జీవో 17 ను కేవలం ఆంగ్లంలోనే విడుదల చేశారు. తెలుగులో కూడా ప్రజలందరికీ అర్థమయ్యేలా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వం.. అందుకే మళ్లీ కెసిఆర్ సర్కార్ రావాలి.