– నగరంలో 373 కొత్త కాలనీ రూట్లకు బస్సు సర్వీసులు
– దాదాపు 7 లక్షల మందికి సౌకర్యం
– రాజధాని నుండి గ్రామాల వరకు ఆర్టీసీని మరింత విస్తరిస్తాం
– ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్నాం
– ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ : నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని తెలంగాణ ఆర్టీసీ మరింత విసృతం చేస్తోంది. అందులో భాగంగా బుధవారం నగరంలో రాణిగంజ్ డిపో వేదికగా 65 ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.హైదరాబాద్ లోనే 2800 ఎలక్ట్రిక్ బస్సులు నడిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఆర్టీసీ దశల వారీగా బస్సులు ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం టీజీఎస్ ఆర్టీసీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 810 ఈవీ బస్సులను నడుపుతోంది. వీటిలో 300 బస్సులు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో తిరుగుతున్నాయి.
ఈరోజు 65 ఈ-మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల ప్రవేశంతో పాటు, జనవరి చివరి నాటికి మరో 175 ఈవీ బస్సులు అందనున్నాయి. దీంతో నగరంలో మొత్తం 540 ఈవీ బస్సులు అందుబాటులోకి వస్తాయి.ఒక వైపు ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించుకుంటూనే అంతే వేగంతో వాటి మౌలిక సదుపాయాలు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు జరుగుతుంది. ఈ 65 ఎలక్ట్రిక్ బస్సులు ప్రజల సౌలభ్యం కోసం సికింద్రాబాద్ – కొండాపూర్ – 14 బస్సులు, సికింద్రాబాద్ – ఇస్నాపూర్ – 25 బస్సులు, సికింద్రాబాద్ – బోరబండ – 8 బస్సులు, సికింద్రాబాద్ – రామాయంపేట – 6 బస్సులు, సికింద్రాబాద్ – గచ్చిబౌలి – 8 బస్సులు, సికింద్రాబాద్ – మీడియాపూర్ × రోడ్డు – 4 బస్సులు నడవనున్నాయి
ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టడంలో తెలంగాణ రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. పర్యావరణ నిర్వహణ, కార్యాచరణ సామర్థ్యం, ఆధునిక ప్రజా రవాణాలో కార్పొరేషన్ ప్రమాణాలను నిర్దేశిస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలతో, రియల్ టైమ్‌లో అమర్చబడి ఉంటాయి.ట్రాకింగ్, విశాలమైన సీటింగ్ మరియు మెరుగైన యాక్సెసిబిలిటీ ఫీచర్లు, మెరుగైన ప్రయాణ అనుభవాన్ని నిర్ధారిస్తాయి.
రాణిగంజ్ డిపోలో ప్రారంభోత్సవం కేవలం కొత్త వాహనాల చేరికను మాత్రమే కాకుండా, తెలంగాణ పౌరుల పరిశుభ్రమైన భవిష్యత్తు వైపు అడుగును సూచిస్తుంది.ఈ అదనపు 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వలన నగరంలో శబ్ద స్థాయిలను తగ్గించడం, కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చు. అధిక శక్తి సామర్థ్యం కారణంగా సంస్థపై తక్కువ నిర్వహణ ఖర్చులు అవుతాయి. శబ్ద రహిత, సున్నితమైన ప్రయాణంతో ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరచవచ్చు.
ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో రియల్ టైమ్ ట్రాకింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ ఐటీఎస్ (ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్) ఉంటుంది.అగ్ని ప్రమాదాల గుర్తింపు, నిరోధక వ్యవస్థ (ఎఫ్డీఎస్ఎస్) ఏర్పాటు చేశారు. 36 సీట్లతో సౌకర్యవంతమైన సీటింగ్ సామర్థ్యం ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యాలైన అనౌన్స్మెంట్ సిస్టమ్, రియల్-టైమ్ ట్రాకింగ్, డిజిటల్‌గా ప్రదర్శించబడిన గమ్యస్థాన బోర్డులు, యుఎస్బీ ఛార్జింగ్, వృద్ధులు, వికలాంగుల కోసం మోకాలి/ర్యాంప్‌లు అందుబాటులో ఉన్నాయి.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రవాణా శాఖ తరుపున ఆర్టీసీ రాణిగంజ్ నుండి 65 బస్సులు ప్రారంభం చేసుకున్నామని తెలిపారు. బుధవారం నుండి నగరంలో 373 కొత్త కాలని రూట్లకు ఆర్టీసీ బస్సులు నడుపుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకోసం గత మూడు నెలలుగా కొత్త రూట్లపై సర్వే జరిగింది. దీని ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో దాదాపు 7 లక్షల మందికి అదనంగా ప్రజా రవాణా సౌకర్యం ఏర్పడిందని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ అవసరమున్నాయో స్థానిక ఆర్టీసీ అధికారులకు తెలియజేయాలని సూచించారు.
ఐటీ కారిడార్ లో ఐటీ ఉద్యోగులకు అవసరమైన బస్సులు నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని సొంత వాహనాలు , క్యాబ్ లకు దూరంగా ఉంచడం వల్ల ట్రాఫిక్ ను తగ్గించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రాజధాని నుండి గ్రామాల వరకు ఆర్టీసీ మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తున్నామని, ఉద్యోగ నియామకాలు పోలీస్ రిక్యూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తున్నామని వెల్లడించారు.
ప్రమాదాలను తగ్గించడానికి రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తున్నాయని తెలిపారు.దేశంలో ఎక్కడ లేని విధంగా ఈవి పాలసీ స్క్రాప్ పాలసీ తీసుకొచ్చింది. ఆర్టీసీ యాత్రదానం కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని సూచించారు. ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట లలో ఈవీ బస్సులు నడుస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రజా పాలన ప్రభుత్వం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహా లక్ష్మీ పథకం ప్రారంభం చేసుకొని 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని, ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం ప్రారంభించుకున్నామని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ ఇతర సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారని వారందరికీ అభినందనలు తెలిపారు. ఇప్పటికీ 251 కోట్ల మంది మహిళలు ఉచితంగా, 8,500 కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని చేశారని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ళలో ఇప్పుడున్న 40 శాతం బస్సులు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఆర్టీసీ లో కొత్తగా డ్రైవర్లు, కండక్టర్ లు, శ్రామిక లు వస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆర్టీసీ బస్సులను మహిళను యజమానులను చేసిందనీ కొనియాడారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల భద్రత అంశాలుగా పని చేస్తుంది. ఆర్టీసీ నూతన బస్ డిపో ల ఏర్పాటు, బస్ స్టేషన్ ల అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు.
65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభం వల్ల నగరంలో ఆర్టీసీ మరింత విస్తృత సేవలు అందిస్తుందని ఎండీ నాగిరెడ్డి తెలిపారు.ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల్లో 2400 కొత్త బస్సులు వచ్చాయని తెలిపారు. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ప్రతి రోజు ఒక టన్ను కార్బన్ డై ఆక్సైడ్ తగ్గిస్తుందని నగరంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం వల్ల కాలుష్యాన్ని నియంత్రించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సుచరిత రెడ్డి, ఈడి లు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.