Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో 8 కోట్ల మంది మొబైల్‌ వినియోగదారులు

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌లో మొబైల్‌ ఫోన్‌ వినియోగదారుల సంఖ్యం 8.20 కోట్లకు చేరింది. రాష్ట్రంలోని 17328 గ్రామాలకుగాను 15322 గ్రామాల్లో మొబైల్ టెలిఫోన్‌ నెట్‌వర్క్‌ సదుపాయం కల్పించినట్లు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్ సిన్హ్ ఛౌహాన్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ గడిచిన పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ టెలీకాం కనెక్టివిటీ లైసెన్స్ సర్వీస్ ఏరియా గణనీయంగా పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం బేస్ ట్రాన్సీవర్ స్టేషన్ల (బీటీఎస్) సంఖ్య 53,858 నుంచి 2,07,330కు పెరిగిందని తెలిపారు.

అలాగే మొత్తం మొబైల్ సబ్ స్క్రైబర్స్ సంఖ్య 6.71 కోట్ల నుంచి 8.20 కోట్లకు, ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్స్ సంఖ్య 1.76 కోట్ల నుంచి 6.71 కోట్లకు పెరిగిందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,714 బీటీఎస్‌లు 5జీ నెట్‌వర్క్ కనెక్టివిటీని అందిస్తున్నాయి. అలాగే భారత్ నెట్ ప్రాజెక్టు కింద 12,457 గ్రామాల్లో నెటవర్క్ సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

దేశంలో నెట్‌వర్క్ కనెక్టివిటీలేని గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతోందని అన్నారు. నెట్‌వర్క్ కనెక్టివిటీలేని ప్రాంతాల్లో 41,331 కోట్ల వ్యయంతో 41,160 మొబైల్ టవర్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశంలోని 54,000 గ్రామాలకు నెట్‌వర్క్ సదుపాయం కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు భావిస్తోందని. టెలికాం టవర్స్ ఏర్పాటు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ విస్తరణ వంటి టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను త్వరితగతిన విస్తరించేందుకు రైట్ ఆఫ్ వే (ఆర్‌ఏడబ్ల్యు) ఆమోదం క్రమబద్ధీకరించి వేగవంతం చేసేందుకు 2022 మే 14న గతిశక్తి పోర్టల్‌ను ఆవిష్కరించినట్లు తెలిపారు.

గతిశక్తి పోర్టల్‌ దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అనుసంధానం చేయడంతోపాటు, రైల్వే, రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు, రక్షణ శాఖ వంటి మంత్రిత్వ శాఖలతో అనుసంధానం చేస్తుందని అన్నారు. పోర్టల్ ఆవిష్కరణ అనంతరం ఆర్‌ఓడబ్ల్యు ఆమోద సమయం గణనీయంగా తగ్గిందని అన్నారు.

దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 3.99 లక్షల బీటీఎస్‌లు ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5జీ నెట్ వర్క్‌ను విస్తరించే దేశాల సరసన ఇండియా నిలిచిందని అన్నారు. అలాగే దేశంలో 2014 మార్చి నాటికి ఏర్పాటు చేసిన బీటీఎస్‌ల సంఖ్య 6.49 లక్షలు ఉండగా మార్చి, 2023 నాటికి అది 25.42 లక్షలకు చేరిందని మంత్రి తెలిపారు.

మత్స్యకారుల కోసం ఏపీకి 4484 ట్రాన్స్‌పాండర్స్

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: నేషనల్ రోల్‌అవుట్‌ ప్లాన్ కింద ఆంధ్రప్రదేశ్‌కు 4844 ట్రాన్స్‌పాండర్స్ కేటాయించినట్లు కేంద్ర మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ, డైరీయింగ్ శాఖ మంత్రి పర్షోత్తం రూపాల వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టం (ఆర్‌ఎఎస్‌), బయోఫ్లాక్, రిజర్వాయర్ కేజెస్, సీ కేజెస్, వాల్యూ యాడెడ్‌ ఎంటర్‌ప్రైజెస్ ఆమోదం వంటి టెక్నాలజీ జోడించడం ద్వారా భూమి, నీటి వనరులు సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకుని, నీటి నాణ్యత నిర్వహణ మెరుగుపడడం, వ్యాధులు అదుపులోకి రావడం తద్వారా రాష్ట్రంలో చేపల ఉత్పత్తి, ఉత్పాదకత గణనీయంగా పెంపునకు సాధ్యపడిందని ఏపీ కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొందని అన్నారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం (పీఎంఎంఎస్‌వై) కింద టెక్నాలజీ ఇన్ఫ్యూజన్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్లలో 1292 ప్రధానమైన కార్యక్రమాలు ఆమోదించినట్లు మంత్రి తెలిపారు.

దేశంలో మత్స్యకారుల సమగ్రాభివృద్ధికి, అలాగే ఆక్వా రంగ అభివృద్ధికి కేంద్ర మత్స్య శాఖ, పశుసంవర్ధక, డైరీయింగ్ మంత్రిత్వ శాఖ పీఎంఎంఎస్‌వై పథకం కింద ఆధునిక సాంకేతికతను జోడించడంతో పాటు అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. పీఎంఎంఎస్ వై పథకంలో భాగంగా స్కాంపి, కామన్ కార్ప్, ట్రౌట్, పెన్యూసిండికస్ వంటి చేప జాతులు జన్యు అభివృద్ది కార్యక్రమం, రిజర్వాయర్లలో 44,408 కేజెస్, 543.7 హెక్టార్ పెన్స్ ఏర్పాటు చేయడం ద్వారా చేపల ఉత్పత్తి పెంచడం, 1518 సముద్ర కేజెస్ ఏర్పాటు, 11940 రీ సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టం యూనిట్లు ఏర్పాటు, ఫిష్ కల్చర్ కొరకు 3995 బయోఫ్లాక్ యూనిట్లు ఏర్పాటు, 463 డీప్ సీ ఫిషింగ్ వెసల్స్ ఏర్పాటు చేయడంతో పాటు చేపల వేటను మెరుగు పరిచేందుకు అందుబాటులో ఉన్న 1172 ఫిష్ వెసల్స్ ఉన్నతీకరణ, సీ వీడ్ వ్యవసాయం ద్వారా మత్స్యకారులకు అదనపు, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు ఏర్పాటు, 1487 బై వాల్స్ వ్యవసాయ యూనిట్లు, 46 ట్రౌట్ హెచరీస్ ఏర్పాటు చేయడం ద్వారా శీతల పానీయ మత్స్యకారుల అభివృద్ధి, 5036 రేజ్ వే యూనిట్లు ఏర్పాటు, కోల్డ్‌వాటర్ మత్స్యకారులకు 58 ఆర్‌ఎఎస్‌ యూనిట్లు, సముద్రంలో చేపల స్టాక్ పెంచేందుకు 732 కృత్రిమ రీఫ్స్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వీహెచ్ఎఫ్/డీఏటీ/ఎన్ఏవీఐసీ/ ట్రాన్స్‌పాండర్స్ వంటి సాంప్రదాయ, మోటారైజ్డ్ వెసల్స్ కొరకు కమ్యూనికేషన్/ ఆన్‌ట్రాకింగ్ పరికరాలు అందించేందుకు పీఎంఎంఎస్‌వై పథకం కింద ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. అలాగే ప్రస్తుతం నేషనల్ రోల్‌ఔట్‌లో భాగంగా 9 సముద్రతీర రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో వెసల్ కమ్యూనికేషన్, సపోర్ట్ సిస్టంను ఏర్పాటు చేసేందుకు పీఎంఎంఎస్‌వై కింద లక్ష మెరైన్ ఫిషింగ్ వెసల్స్ ఆమోదించినట్లు తెలిపారు. ఇస్రోకు చెందిన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఇప్లిమెంటింగ్ ఏజెన్సీగా వ్యవహరిస్తోందని మంత్రి తెలిపారు.

LEAVE A RESPONSE