Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు పాలన చారిత్రక అవసరం

-వచ్చేది క్లాస్ వార్ కాదు … క్యాష్ వార్
– జగన్ మాయమాటలు నమ్మొద్దు
తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు

రాజమహేంద్రవరం, మే 28: రాష్ట్రంలో అన్ని వనరులు దోచుకోవడమే కాకుండా అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన జగన్ ఇప్పుడు అమాయకంగా చెబుతున్న మాయ మాటలను నమ్మొద్దని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు అన్నారు. రాజమహేంద్రవరం వేమగిరిలోని మహానాడు సభలో ఆయన ప్రసంగిస్తూ, జగన్ చెబుతున్నట్లు ఇది క్లాస్ వార్ కాదని, క్యాష్ వార్ అని వ్యాఖ్యానించారు.

ఈ దేశంలో అందరి ముఖ్యమంత్రులకన్నా అత్యంత ధనవంతుడైన జగన్ పేదవాడు ఎలా అవుతాడని ఆయన ప్రశ్నించారు. పేదవాడైతే ఎనిమిది ప్యాలెస్ లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం అన్ని వర్గాలు దెబ్బతిని, అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయిన నేపథ్యంలో చంద్రబాబు అవసరం ఎంతో ఉందన్నారు. జగన్ దుర్మార్గ పాలనను సాగనంపడానికి ఇది చారిత్రిక అవసరమన్నారు.

సైకో పాలనలో ఐదు కోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పేద వాళ్ళను జగన్, వైసిపి వాళ్ళు ఏవిధంగా దోచుకున్నారో వాటిని చంద్రన్న వచ్చాక వెలికి తీసి, వాళ్లపై ఉక్కుపాదం మోపి, ఆ సొమ్ముని మళ్ళీ పేదలకు పంచుతారని అచ్చెన్నాయుడు అన్నారు. ఈరోజు వర్షం కురిసినప్పటికీ సభ ఆగలేదని, ఎందుకంటే అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు ఏ కార్యక్రమం తలపెట్టినా ఆగకుండా ముందుకు సాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE