– సేవలతో బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలి
– ఐఏఎస్ టాపర్లను అభినందించిన మంత్రి గంగుల కమలాకర్
యావత్ జాతి గర్వించేలా తెలంగాణ అణిముత్యాలు సివిల్స్ లో మెరుగైన ర్యాంకులు సాధించడం పట్ల రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు. నేడు డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా తనను కలిసిన ఐఏఎస్ ర్యాంకర్లు నిధిఫై 110వ ర్యాంకు, ఆర్.నవిన్ 550, దీప్తీ చౌహన్ 630, సాయినాథ్ 742, అక్షయ్ 759లను ప్రత్యేకంగా పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ సందర్భంగా వారి అనుభవాలను అడిగి తెలుసుకున్న మంత్రి, మంచి ర్యాంకులు సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచారని అన్నారు.
ఎంత పట్టుదలతో చదివి లక్ష్యం సాధించారో అంతే అకుంఠిత దీక్షతో సమాజానికి సేవ చేయాలని, బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ర్యాంకర్ల తల్లిదండ్రులను సైతం మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో టాపర్లు, వారి తల్లిదండ్రులతో పాటు శిక్షణ అందించిన సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.