Suryaa.co.in

Andhra Pradesh

సీఎంగా విఫలమైనా ముద్దాయిగా ఉన్న తన తమ్ముడిని కాపాడుకోవటంలో సఫలమయ్యారు

-జగన్.. సీఎంగా విఫలమైనా బాబాయి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న తన తమ్ముడిని కాపాడుకోవటంలో సఫలమయ్యారు
– బెయిల్ పొందినంత మాత్రాన అవినాష్ రెడ్డి నిర్దోషి కాదు
– వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పట్ల సీబీఐ వ్యవహరించిన తీరు సామాన్యులకు కూడా వర్తిస్తుందా?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజా సేవ చేయటంలో విఫలమైనా తన అధికారాన్ని, అవినీతి సొమ్మును వినియోగించి బాబాయి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న తన తమ్ముడు ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడటంలో సక్సెస్ అయినట్టు కన్పిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు.

బుధవారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….సీఎ జగన్ ఎన్ని సార్లు డిల్లీ వెళ్లినా ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వేజోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ గురించి ఏనాడు ప్రస్తావించలేదు. కానీ సొంత బాబాయి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న తన తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుకోవటంలో సఫలీకృతుడయ్యారు. అధికార బలం, అవినీతి సొమ్ము ఉన్న పెద్దలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయంగా ఉన్న నేపధ్యంలో ఐపీసీ 302 (హత్యకేసు) కూడా బెయిలబుల్ గా చేయాలి.

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ జడ్జిమెంట్ లో కొన్ని అప్రస్తుతాలు ప్రస్పుటంగా ఉన్నవి కనుక సుప్రీం కోర్టు వెంటనే జడ్జిమెంట్ ను సమీక్షించాలి. పార్లమెంట్ కూడా కనీసం ఆంధ్రప్రదేశ్ లో జగన్ సీఎంగా ఉన్నంత వరకు ఐపిసి 302 (హత్యకేసు)ను బెయిలిచ్చే కేసుగా 41 నోటిసుతో సరిపెట్టేలా చట్ట సవరణ చేయాలి. వివేకా హత్య కేసులో బెయిల్ వచ్చినంత మాత్రాన అవినాష్ రెడ్డి నిర్దోషి కాదు, విచారణ అనంతరం కోర్టు నిర్ణయించాలి.

వివేకా హత్య కేసులో సీబీఐ అనేక తప్పటడుగులు వేసింది, అవినాష్ రెడ్డిపై సాక్ష్యాలున్నాయి, అరెస్ట్ చేస్తామని పదే పదే కోర్టులకు విన్నవించి అవినాష్ రెడ్డి బెయిల్ తెచ్చుకునే వరకు సహకరించింది. బెయిల్ పొందిన ముద్దాయి అవినాష్ రెడ్డి పులివెందులలో ప్రజా ధర్బార్ నిర్వహించటం హత్య కేసులో ముద్దాయి అహంకారానికి నిదర్శనం.

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పట్ల సీబీఐ వ్యవహరించిన తీరు సామాన్యులకు కూడా వర్తిస్తుందా? సీబీఐ ఎలా దర్యాప్తు చేయాలో ముద్దాయిలే నిర్దేశించటం శోచనీయం, వారి అధికార మదానికి నిదర్శనం. ఈ కేసులో సీబీఐ క్రెడిబులిటీ కోల్పోయింది, సీబీఐ డైరక్టర్ ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తును సమీక్షించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE