-నేను చెప్పిన, పవన్ కళ్యాణ్ చెప్పిన తెలంగాణతో పాటే డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలు
-ఒక్కసారి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయాయంటే జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు
-ఆంధ్రప్రదేశ్లో బీదరికమే లేదన్నట్లుగా మద్యం దుకాణాలలో చీఫ్ లిక్కర్ కోసం 2 వేల నోట్లు మార్పిడినా?
-సునీత వేసిన పిటిషన్ లో మనసు మార్చుకొని సీబీఐ ఇంప్లిడ్ అవుతుందేమో చూడాలి?
-వారాహి యాత్ర విజయవంతం కావాలి… కోస్తాలో ప్రవేశించనున్న లోకేష్ యువ గళం మరింత ప్రజాదరణకు నోచుకోవాలి
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
రాష్ట్రంలో నెలకొన్న ఆర్ధిక గడ్డు పరిస్థితులను అధిగమించాలంటే ముందస్తు ఎన్నికలు ఒకటే మార్గం. నేను చెప్పిన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే, రాష్ట్రంలోనూ డిసెంబర్ లోనే ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయం. ఎన్నికలకు ప్రజలు, ప్రతిపక్షాలు సిద్ధంగా ఉండాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు కోరారు.
మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్రంలో అమలు చేస్తున్నది జీరో అభివృద్ధితో కూడిన సంక్షేమం. ఒక్కసారి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయంటే, మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు . గత ఆరు నెలలుగా మంత్రి వేణుగోపాలకృష్ణ వ్యక్తిగత సిబ్బందికి జీతాలు అందకపోవడం తో, వారు ఆయన చాంబర్ కు తాళం వేశారంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ఆగ్రహంతో ఉన్న కేంద్రం, దొంగ అప్పులను నివారిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటన్నది తేలిపోతుందన్నారు.
500 నోటు కూడా రద్దుచేసి…100, 200 నోట్లను యధావిధిగా కొనసాగిస్తూ, డిజిటల్ మనీని ప్రవేశపెట్టాలి
2000 నోట్లను రద్దు చేసినట్టుగా, 500 నోట్లను కూడా ఎన్నికల సమయంలో రద్దు చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ 500 రూపాయల నోట్లను రద్దు చేస్తే మంచి పరిణామమే. ప్రధానమంత్రి తరచూ డిజిటల్ కరెన్సీ అంటున్నారు. 100, 200 నోట్లోని యధావిధిగా కొనసాగిస్తూ డిజిటల్ కరెన్సీని ప్రవేశ పెడితే ఎన్నికలు సజావుగా సాగుతాయి. పెద్దవాళ్లు దాచుకున్న పెద్ద నోట్లు అప్పుడు నిరూపయోగమవుతాయి. ప్రస్తుతం తాము దాచుకున్న పెద్ద నోట్లను పెట్రోల్ బంకులలో, మద్యం దుకాణాలలో మార్పిడి చేయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో బీదరికమే లేదన్నట్టుగా చీఫ్ లిక్కర్ కొనుగోలు కోసం ఏమాత్రం నలగని, ఒకే సిరీస్ నెంబర్ కలిగిన 2000 నోట్లను పేదవారు మార్పిడి చేయిస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆ రెండు వేల నోట్లు మా పార్టీ పెద్దవాళ్ల వద్ద ఉన్న నోట్లు అయి ఉండవచ్చు. వారే ప్రభుత్వం నిర్వహించే మద్యం షాపుల ద్వారా వాటి మార్పిడికి ప్రయత్నం చేస్తున్నారు. బీదవారు మద్యం కోసం చెల్లించే మొత్తం డబ్బులలో సగాన్ని తమ వద్ద జమ చేసుకొని, తాము దాచుకున్న 2000 నోట్లను మద్యం డబ్బులలో కలిపి వేస్తున్నారు.
దాచుకున్న డబ్బులను ఈ విధంగా మార్చుకోవచ్చు నన్న ఉద్దేశంతోనే ముందు చూపుతో నే నగదులో మద్యం విక్రయించాలని నిర్ణయించుకున్నారేమో?. గత రెండేళ్లుగా మద్యం విక్రయాల ద్వారా లభించిన 2000 నోట్లు ఎన్ని?… 2000 నోట్ల రద్దు అనంతరం మద్యం విక్రయాల పేరిట లభించిన 2000 నోట్లు ఎన్ని అన్నది కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరిపితే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
హైకోర్టు తీర్పు ఇచ్చి రెండు వారాలైనా అప్పీల్ కు వెళ్ళని సిబిఐ
వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎనిమిదవ నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసి రెండు వారాలైనా సిబిఐ సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్లలేదు. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరీని సవాలు చేస్తూ, డాక్టర్ వైఎస్ సునీత రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా, సిబిఐ ఇంప్లిడ్ కూడా కాలేదు. దీన్నిబట్టి బహుశా సిబిఐ కి ఆసక్తి లేదేమో అనుకోవాలి. లేకపోతే అవినాష్ రెడ్డి సిబిఐకి చక్కగా సహకరిస్తున్నారని భావించాలి.
అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారని అనుకోవచ్చునని, లేకపోతే ఆయన అప్రూవర్ గా మారుతారని భావించవచ్చు. ఎవరైనా నిందితుడు అప్రూవర్ గా మారితే వారి బెయిల్ రద్దును దర్యాప్తు సంస్థలు కోరకపోవచ్చు. అవినాష్ రెడ్డి అప్రూవర్ గా మారుతారని నేనైతే అనుకోవడం లేదు. డాక్టర్ సునీత రెడ్డి పిటిషన్ సుప్రీంకోర్టు విచారించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను కొట్టివేసినప్పటికీ, అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం లేదని సిబిఐ అనుకుంటే అరెస్టు చేయకపోవచ్చు. కోర్టులో సునీత విజయం సాధించినప్పటికీ, ఆపరేషన్ సక్సెస్… పేషంట్ డెడ్ అన్న చందంగా పరిస్థితి తయారవుతుంది.
సునీత దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో మంగళవారం విచారణకు వచ్చింది. అయితే సుప్రీంకోర్టులో సీనియర్లు కాకుండా, జూనియర్లకు వాదించే అవకాశాన్ని కల్పించారు. సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా తన వాదనలను వినిపించలేకపోయారు. తన కేసును డాక్టర్ సునీత తానే వాదించుకున్నారు. ఈ కేసులో సిబిఐ ని ప్రతివాదిగా చేర్చి నోటీసులు జారీ చేయాలని సునీత అభ్యర్థించగా, సిబిఐకి ఆసక్తి ఉంటే వాళ్లే కౌంటర్ దాఖలు చేస్తారు కదా అని రెండవ న్యాయమూర్తి అమానుల్లా ప్రశ్నించారు.
న్యాయమూర్తి అమానుల్లా ప్రశ్న సబబే. మద్యం కుంభకోణంలో మాగుంట రాఘవ రెడ్డికి టెంపరరీ బెయిల్ మంజూరీ చేయగా, ఈడీ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. దానితో మాగుంట రాఘవరెడ్డి తాత్కాలిక బెయిల్ వెంటనే సుప్రీంకోర్టు రద్దు చేసింది. అవినాష్ రెడ్డి విషయంలో సిబిఐ, ఈడి తో పోలిస్తే భిన్నంగా వ్యవహరించడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఈ కేసులో అంతిమంగా ఎనిమిదవ ముద్దాయిగా అవినాష్ రెడ్డిని చేర్చిన సిబిఐ, తొమ్మిదవ, పదవ ముద్దాయిల పేర్లను జోడిస్తుందా?, లేదా?? అన్నది ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మహత్య చేసుకుని చనిపోయారని అనకుంటే చాలు అనే పరిస్థితిలో ప్రస్తుతం మనము ఉన్నామేమో.
ఈ కేసు అంతిమంగా కోర్టులో తేలేది కాదేమోనని అనుమానం వస్తుంది. ఎవరు ఎవర్ని చంపారో ప్రజలకు తెలుసు. ప్రజా కోర్టులోనే న్యాయం చేయమని కోరుకోవలసి వస్తుందేమోనని అనిపిస్తుంది. సునీత పిటిషన్ విచారణకు వచ్చిన రోజే సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించకపోవడం, సిబిఐ ముందుకు రాకపోవడం వంటి పరిణామాలు నన్ను మనస్థాపానికి గురిచేశాయి. ఒక యువతి వ్యవస్థలన్నింటినీ ఎదుర్కొని పోరాటం చేస్తుంటే, విచారణ చేసే వ్యవస్థలు కూడా ఇవ్వాల్సిన సహకారం ఇవ్వకుండా ఉన్నప్పుడు… జరిగినా, జరుగుతున్న, జరగబోతున్న అన్యాయాన్ని తలుచుకుంటే డెఫినిట్ గా బాధనిపిస్తుందని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు తమ ఓట్లను సరిచూసుకోవాలి… ప్రతిపక్షాలు దొంగ ఓట్లు నమోదు కాకుండా జాగ్రత్త పడాలి
తెలంగాణతో పాటే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి డిసెంబర్లో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్న నేపథ్యంలో ప్రజలు ఓటరు జాబితాలోని తమ ఓటు ను సరిచూసుకోవాలి. అలాగే ప్రతిపక్షాలు దొంగ ఓట్లు నమోదు కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అడ్డుకోవాలి. ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు తమ బాధ్యతలను సంపూర్ణంగా నిర్వహించకపోతే, ప్రజా వెల్లువ ఎటువైపు ఉన్నా, ఆ వెల్లువను తమ వైపు మార్చే ట్రిక్కులు డబ్బున్న పెద్దల వద్ద ఉన్నాయి. వారాహి యాత్ర నిర్వాహణకు పోలీసులు అనుమతించడం హర్షనీయం.
గతంలో పోలీస్ సెక్షన్ 30 ని అమలు చేస్తామని చెప్పిన కాకినాడ ఎస్పీ, అంతలోనే మనసు మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ యాత్ర సజావుగా సాగేలా సహకరిస్తానని ఆయన పేర్కొనడం అభినందనీయం. విశాఖలో భూములు కొనుగోలు చేశామని, విశాఖ నుంచే పాలన సాగిస్తామని అధికార పార్టీ నేతలు చెబుతున్న సమయంలో, అమరావతిలో పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఆఫీసు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం, బిజెపి పెద్దలు కూడా రాష్ట్ర రాజధానిగా అమరావతి కే సంపూర్ణ మద్దతని ప్రకటించడంతో… రాష్ట్ర రాజధాని అమరావతేనని మరోసారి స్పష్టం అయ్యింది.
ప్రతి రాష్ట్రం రాజధానిని సీబీఎస్ఈ తమ పాఠ్య పుస్తకాలలో ముద్రించింది . కానీ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ను చేసిన ఇలాంటి ప్రభుత్వం మనుగడలో ఉండడం దురదృష్టకరం. అన్నవరం నుంచి భీమవరం వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్రకు అభిమానుల తాకిడి అధికంగానే ఉంటుంది. అయినా ప్రజా సమస్యల వింటూ వాటి పరిష్కారానికి జనసేనాని కృషి చేస్తూ, చెడు సంహారానికి ఈ వారాహి యాత్ర నాంది పలకాలని ఆకాంక్షిస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
కడప జిల్లా బద్వేల్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువ గళం పాదయాత్రకు అపూర్వ స్పందన లభించింది. రెండు కిలో మీటర్ల పొడవు జనంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. రాయలసీమ జిల్లాల పాదయాత్ర ముగించుకొని, కోస్తాలో అడుగుపెడుతున్న ఆయనకు సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వాగతం పలుకుతూ పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం పరిశీలిస్తే, రాయలసీమలో మాదిరిగా కోస్తాలో కూడా లోకేష్ పాదయాత్రకు అదే స్పందన లభిస్తుందని స్పష్టమవుతుంది.
రాయలసీమ వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకొని, సమగ్ర పరిష్కార ప్రణాళికతో లోకేష్ ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ ప్రజలకు ఎంతో చేరువయ్యింది. నారా లోకేష్ వ్యక్తిగత ఇమేజ్ తో పాటు, మా పార్టీ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, రాయలసీమ జిల్లాలలో టిడిపి శాసనసభ అభ్యర్థులను తిరస్కరించామనే పశ్చాత్తాప భావన తో ప్రజలు యువ గళం పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. యువ గళం పాదయాత్ర మా పార్టీ పట్ల గరలంగా మారింది. ఇప్పటికైనా లోకేష్ చేసిన సూచనలు మా పార్టీ ప్రభుత్వం అమలు చేసే ప్రజల మనసులు దోచుకోవాలి. ప్రజలను దోచుకోవడమే తెలిసిన మా పార్టీ పెద్దలకు, ప్రజల మనసులు దోచుకోవడం కష్టమే.
గతంలో మా పార్టీ అధ్యక్షుడు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజల మధ్య ఉండేందుకు ప్రజలతో మమేకమయ్యేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.