ఐక్య పోరాటాలు లేకుండా పొత్తులతో ప్రయోజనం శూన్యం
స్పష్టత ఇవ్వకపోతే అధికార పార్టీకే లబ్ది
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య
ఎన్నికలు ముంచుకొస్తున్నా, ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఇప్పటికీ పొత్తులపై రాజకీయ గందరగోళంతోనే ఉన్నాయని, ఎవరు ఎవరితో కలుస్తారో తెలియని అయోమయంలోనే ఉన్నారని, పొత్తులపై స్పష్టత ఇవ్వకుండా ప్రజలను కూడా గందరగోళానికి గురిచేస్తున్నాయని, ఇలాంటి వైఖరి అధికార వైసీపీకి లబ్ధి చేస్తుందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార వైసీపీని గద్దె దించాలన్న ఏకైక లక్ష్యం గూర్చి విపక్ష పార్టీలు చెప్తున్నా, పొత్తులపై కాలయాపన ఎందుకు చేస్తున్నాయి అని ప్రశ్నించారు. గత మూడేళ్ళుగా రాష్ట్రంలోని రాజధాని అమరావతి, పోలవరం, ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కుతోపాటు దళితులపై దాడులు, మహిళల అత్యాచారాలు, నిరుద్యోగం, దోపిడీ, అప్పులు, రాజ్యహింస వంటి అన్ని అంశాలపై పోరాడుతున్న పోరాట శక్తులు ప్రతిపక్షాల మధ్య ఐక్య పోరాటాలను కోరుకున్నాయని, ఐక్య కార్యాచరణ లేకుండా పొత్తులకు వెళితే, ప్రజలలో విశ్వసనీయత కొరవడుతుందని పదే పదే హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రెండు రోజుల క్రితం బిజెపి నాయకులు అమీత్ షా, నడ్డా వంటి వారు వైకాపా అవినీతిపై ధ్వజం ఎత్తటంతో ఎవరు ఎవరితో కలుస్తున్నారు? అనే అంశం పీటముడిగా మారిందని, రాజకీయ ఉప్పెనకు దారి తీసిందన్నారు. పొత్తులను గుప్పిట్లో దాచటం వలన ప్రయోజనం ఉండదన్నారు. ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి లేమితో రోజురోజుకూ కుదేలు అవుతుందని, మరో పక్క ప్రక్క రాష్ట్రంలోని మంత్రులు ఏపీపై జోకులు వేసుకుంటున్నారని పేర్కొన్నారు.
ముందుగా టిడిపి, జనసేన, బిజెపి వంటి ప్రధాన పార్టీలు పొత్తులపై స్పష్టత ఇవ్వాలని, ఇతర రాజకీయ పార్టీలు వారి వైఖరులను ప్రజల ముందు ఉంచేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.ఆలస్యమైతే అమృతం కూడా విషమవుతుందన్న సంగతి అన్ని విపక్షాలు గుర్తించాలని అంటూ, స్పష్టత లేని రాజకీయ గందరగోళంతో అవకాశాలను నేలపాలు చేసుకునే ప్రమాదం కూడా ఉంటుందని బాలకోటయ్య ప్రధాన విపక్షాలను.