ప్రధాని, హోం శాఖ మంత్రికి లేఖ రాస్తా
విశాఖ భూమాఫియా గురించి కేంద్ర హోం శాఖ మంత్రి ప్రస్తావించిన మరుసటి రోజే ఎంపీ కుటుంబ సభ్యుల, ఆడిటర్ కిడ్నాప్
కిడ్నాప్ వ్యవహారం పై అనుమానాలెన్నో…
విశాఖ భూ కుంభకోణంలో చేతులు మారుతున్న వందల కోట్లు… అయినా ఈ డి, ఇన్కమ్ టాక్స్ ఏమి చేస్తున్నట్లు?
రివ్యూలు నిర్వహించి టిడ్కో ఇళ్లను కట్టించింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు… కానీ తానే టిడ్కో ఇల్లు పూర్తి చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి బిల్డప్
ధర్మారెడ్డి… అధర్మ పనులను చేయకండి
దిక్కుమాలిన జీవోలతో 1000 కోట్ల పైచిలుకు మార్గదర్శి ఆస్తుల జప్తుకు ప్రభుత్వ ఆదేశం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
విశాఖ పట్నం ఎంపీ ఎం వివి సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై అనుమానాలు ఎన్నో ఉన్నాయి. ఎంపీ తనయుడు, భార్యను కిడ్నాప్ చేసిన నిందితులు, ఎంపీని డబ్బులు తీసుకొని రమ్మనకుండా ఆయన ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వర్ రావు ( జీ వీ )ను డబ్బులు తీసుకురమ్మని పిలుస్తారా? ఈ చిన్న లాజిక్ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎలా మిస్ అయ్యారన్నది అంతుచిక్కడం లేదంటూ నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రఘు రామ కృష్ణంరాజు అపహాస్యం చేశారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఇంట్లో ఉండాల్సిన భార్య, కుమారుడు కనిపించకుండా పోతే… ఎంపీకి 48 గంటల తర్వాత తెలిసిందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఎంపీ భార్య పిలవగానే ప్రముఖ బిల్డర్, కాంట్రాక్టర్, ఆడిటర్ అయినటువంటి జీవి సొంతంగా కారును నడుపుకుంటూ వెళ్తారా?, ఎంపీ భార్య సూచించిన ప్రదేశంలో విడిచి పెట్టమని తన వాహన డ్రైవర్ ను ఎందుకు కోరలేదు ? నగరంలోని ప్రముఖ కాంట్రాక్టర్, బిల్డర్ అయిన జీవి, 48 గంటలు కనిపించకుండా పోతే ఎవరికి తెలియకుండా ఉంటుందా? అని ప్రశ్నించారు.
ఇది కడప, కర్నూల్ గ్యాంగ్ పని అయి ఉండవచ్చు. ఇందులో నిందితుడిగా పేర్కొన్న హేమంత్ కు సంబంధం లేదు. పోలీసులు అల్లిన కట్టు కథ ఇది. హేమంత్ అనేవాడు ఆకు రౌడీ మాత్రమే. అటువంటి వారు చిల్లర డబ్బుల కోసం హత్యలు చేస్తారు. ఆస్తి తగాదాల లో భాగంగానే ఈ కిడ్నాప్ జరిగి ఉండవచ్చు..
క్రిస్టియన్ ఆస్తుల లావాదేవీలలో, మరికొన్ని ఆస్తి లావాదేవీలలో ఒక పెద్ద మనిషి తాలూకాకు చెందిన వాళ్లు కొట్టి , సంతకాలను పెట్టించుకున్నట్లు ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు . జీవీ ని చితక బాదడంతో ఆయన ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత ఆయన చేత కావలసిన అబద్ధాన్ని చెప్పిస్తారు. ఇది ఆస్తి తగాదాల కోసం కాదు… కేవలం డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ అని గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లుగా పోలీసులు కథనం వినిపించడం విస్మయాన్ని కలిగిస్తోంది.
ఈ పూర్తి సంఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ఎన్ఐఏ చేత చేత జరిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలకు లేఖ రాస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. విశాఖలో భూమాఫియా గురించి కేంద్ర హోం శాఖ మంత్రి ప్రస్తావించిన మరుసటి రోజు ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. అయితే ఈ వ్యవహారం బయటకొస్తుందని కిడ్నాప్ చేసిన వ్యక్తులు అనుకొని ఉండకపోవచ్చు.
ఈ వ్యవహారం బయటపడడంతో పాత రౌడీషీటర్ ను పిక్చర్ లో పెట్టి, కహాని అల్లారనేది ఊర్లో వాళ్లు అనుకుంటున్నారు. నా అనుమానం కూడా అదే. నా అనుమానాలను ప్రధానమంత్రికి రాసే లేఖలో వివరిస్తాను. నాలుగు గంటల్లోనే కిడ్నాప్ చేసిన వ్యక్తులను పట్టుకున్నారని సాక్షి దినపత్రికలో ఫ్రంట్ పేజీలో పెద్ద ఎత్తున కథనం రాయడం విడ్డూరంగా ఉంది. విశాఖలో జరిగినన్ని భూదందాలు రాష్ట్రంలో మరెక్కడా జరగడం లేదు. ఈ భూ దందాలలో కొంతమంది పోలీసు అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దొంగలతో సదరు పోలీసు అధికారులు మిలాఖత్ అయ్యారు.
అది అటు తిరిగి ఇటు తిరిగి మా పార్టీ పెద్దల పైకే వస్తుంది కాబట్టి, కచ్చితంగా ఎన్ ఐ ఏ చేత విచారణ జరిపించాలి. విశాఖలో ఎవరిని పడితే వారిని కిడ్నాప్ చేస్తున్నారని అపోహలు నెలకొంటే, విశాఖపట్నంలో పెట్టు బడులను పెట్టేందుకు ఎవరు ముందుకు రారు. సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతారు .
ఇద్దరు పెద్ద మనుషుల మధ్య జరిగిన ఆస్తి తగాదా గొడవలు అంటే, అది పెద్దగా జనజీవనం పై ప్రభావం చూపించదు. డబ్బుల కోసం ఎవరినైనా ఎవరైనా ఎత్తుకు వెళ్ళవచ్చునని అపోహ ప్రజల్లో ఏర్పడితే, అది ఎంతో ప్రమాదకరం. అయినా కోటి రూపాయల కోసం కిడ్నాప్ చేయడానికి విశాఖపట్నంలో ఎవరూ లేరా?, ఎంపీ కుటుంబ సభ్యులను ఆయన ఆడిటర్ ను కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుతారా? అంటూ ప్రశ్నించారు. ఈ కిడ్నాప్ వ్యవహారంతో విశాఖ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ దెబ్బ తిన్నది. ఎన్ఐఏ చేత విచారణ జరిపించి అసలు నిజాలను వెలుగులోకి తీసుకురావాలని రఘురామకృష్ణం రాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఫలహారంగా వందల కోట్ల విలువైన భూములు…
విశాఖపట్నంలో వందల కోట్ల రూపాయల విలువైన భూములను ఫలహారంగా బుక్కెస్తున్నారు. విశాఖపట్నంలో రెండు రకాల భూ అక్రమాలు జరుగుతున్నాయని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ప్రభుత్వ భూములలో పాగా వేస్తున్న వారు, ఆ భూములకు సంబంధించిన పత్రాలు ఉన్నవారికి, 1 శాతం డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇస్తున్నారు. ఈ భూములకు సంబంధించి తాతల కాలంలోనే క్రయవిక్రయాలు జరిగినట్టుగా నకిలీ పత్రాలను సృష్టించి, కలెక్టర్ ద్వారా అనుమతులను పొంది , ప్రభుత్వ స్థలాలను కాజేస్తున్నారు.
ఇక వందల కోట్ల విలువైన స్థలానికి చెందిన యజమానులకు నేరుగా భూమి విలువను చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కబ్జా చేస్తున్నారు. స్థల విలువను మొత్తం నగదు రూపంలో తీసుకుంటున్న యజమానులు, డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో 2 శాతం ఇవ్వమని కోరుతున్నారు. ఈ లెక్కన 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగినట్లే లెక్క. అలాగే ప్రభుత్వానికి రావలసిన స్టాంపు డ్యూటీ ఫీజును ఎగ్గొడుతున్నారు.
డాక్యుమెంటేషన్ ఆధారంగా స్థల యజమానికి బిల్డర్, కేవలం రెండు శాతం డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎందుకు చేశారని, దానికి స్థల యజమాని ఎందుకు ఒప్పుకున్నారన్నదానిపై ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈ డీ ), ఇన్కమ్ టాక్స్ అధికారులు ప్రశ్నించకుండా ఏమి చేస్తున్నారు? ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యుడు, మా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి గతంలో చెప్పారని రఘు రామకృష్ణంరాజు గుర్తు చేశారు.
విశాఖలోని దసపల్లా భూములది పెద్ద కుంభకోణం. ఒక ఆర్డర్ ను సాకుగా చూపెట్టి సుప్రీంకోర్టుకు వెళ్లకుండా?, వెళ్లాలా? వద్దా? అన్న మీ మాంసతో సుప్రీం కోర్టు చెప్పిందని ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించింది. ఒకవేళ సుప్రీంకోర్టు చెప్పిన ఐదు మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయవచ్చు. దసపల్లా భూములలో విజయసాయిరెడ్డి అల్లుడు, ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక నిందితుడైన శరత్ చంద్రారెడ్డి సోదరుడి కంపెనీకి భూయజమానులు అగ్రిమెంట్ చేశారు.
తన అల్లుడి కంపెనీ పెద్దదని, ఆయన వ్యాపారం చేస్తే తనని ప్రశ్నిస్తారా? అని గతంలో విజయసాయిరెడ్డి నిలదీశారు . ప్రభుత్వ పెద్ద కు అల్లుడైతే మాత్రం, ఆయన ఎటువంటి భరోసా ఇవ్వకుండానే భూ యజమానులు అగ్రిమెంట్ చేస్తారా?, ఇది క్విడ్ ప్రో కో కిందకు రాదా? వీటన్నింటిపై విచారణ జరిపించాలి.
ఢిల్లీలో 100 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగితేనే కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని స్పందించింది. విశాఖపట్నంలో వందలాది కోట్ల రూపాయల భూములను పలహారంగా బొక్కేస్తుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా?
విశాఖలో విలువైన భూములను చెర పట్టిన ప్రభుత్వ పెద్దలు, రాష్ట్ర రాజధాని విశాఖ నేనని పదే, పదే చెబుతున్నారు. విశాఖలో భూ కుంభకోణం పై నేను చేస్తున్నవి కేవలం అభియోగాలని విచారణ జరిపి నిరూపిస్తే నేను నా తప్పును సరి చేసుకుంటాను. విశాఖ భూ కుంభకోణంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని, ఆయన స్వాతిముత్యం చిత్రంలో కమలహాసన్ కంటే అమాయకుడని తేలితే, మా పార్టీకి మంచిదేనని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
మార్గదర్శిపై సిఐడి నమోదు చేసిన కేసుకు డిపాజిటర్ల చట్టం 5 వర్తించదు
మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కసితీరినట్లు లేదు. ఇప్పటికే 730 కోట్ల నుంచి 740 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్మెంట్ చేస్తూ, జీవో జారీ చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం… తాజాగా మరో రెండు వందల కోట్ల రూపాయల పైచిలుకు ఆస్తులను అటాచ్మెంట్ చేస్తూ జీవో జారీ చేసింది. దాదాపు 1000 కోట్ల రూపాయలపైగా ఆస్తులను డిపాజిటర్ల యాక్ట్ 5 ప్రకారం జప్తు చేయాలని నిర్ణయించారు.
చందాదారుల వద్ద నుంచి డిపాజిట్లను సేకరించి, తిరిగి చందాదారులకు చెల్లించడం లేదన్నది మార్గదర్శి సంస్థపై సిఐడి మోపుతున్న అభియోగం. ఈ మేరకు చిట్టి ల రిజిస్ట్రార్లు రాష్ట్రవ్యాప్తంగా ఏడు చోట్ల కేసులను నమోదు చేయాలని సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు. చిట్టిల రిజిస్ట్రార్ ల ఫిర్యాదు మేరకు మార్గదర్శి కార్యాలయ సిబ్బందిని కొంతమందిని అదుపులోకి తీవ్ర వేధింపులకు గురి చేశారు.
పోలీసుల వేధింపులు తాళలేని ఆడిటర్ ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్నారు. మార్గదర్శి కేసును నిత్యం ప్రజల్లో నానడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సిఐడి చీఫ్ సంజయ్, ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణలు ప్రయత్నిస్తూ, శునకానందాన్ని పొందుతున్నారు. డిపాజిట్ చట్టం 5 ప్రకారం మార్గదర్శిపై కేసులు నమోదు చేయడానికి వీలు లేదు. ఎందుకంటే మార్గదర్శి సంస్థ చందాదారుల నుంచి డిపాజిట్లను సేకరించడం లేదు.
గతంలో మార్గదర్శి ఫైనాన్స్ పేరిట డిపాజిట్లను సేకరించారన్నది రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, సాక్షి దినపత్రికలు చేస్తున్న అభియోగం. మార్గదర్శి సంస్థ తరపున నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే… రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దారుణాలు… అన్యాయాలు… అకృత్యాలను నా లాగానే నాకంటే ఎక్కువగానే ఆంధ్రజ్యోతి మాదిరిగా ఈనాడు దినపత్రిక ప్రజల్లోకి తీసుకు వెళ్తుంది. తమ ప్రభుత్వ అక్రమాలను ఈనాడు దినపత్రిక ప్రజల్లోకి తీసుకు వెళ్లడాన్ని జగన్మోహన్ రెడ్డి సహించలేకపోతున్నారు.
ఈనాడు సంస్థలకు చెందిన వ్యాపార సామ్రాజ్యాన్ని కూల్చివేయాలని కుట్ర చేస్తున్నారు. గతంలో నన్ను హైదరాబాదు నుంచి అపహరించి సిఐడి కేంద్ర కార్యాలయంలో చిత్రహింసలకు గురి చేసినట్లుగానే, ఈనాడు సంస్థ అధినేత రామోజీరావును కూడా అపహరించాలని ప్రయత్నించారు. కానీ న్యాయస్థానాలు అడ్డుపడ్డాయి.
మా వెధవలు ఎంతకైనా దిగజారుతారు. మార్గదర్శి సంస్థపై, సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసులకు డిపాజిటర్ల చట్టం వర్తించదు. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం. ఎవరికైనా అవసరం ఉందని అనుకుంటే, జ్ఞానం కావాలనుకుంటే నా దగ్గరకు రావచ్చు. లెటర్ రాసి రమ్మంటే నేను రాను. నేను ఢిల్లీలో ఎల్లవేళలా అందుబాటులోనే ఉంటానని రఘురామకృష్ణం రాజు బహిరంగ సవాల్ చేశారు.
తలకిందులుగా తపస్సు చేసిన ఒక్క చందాదారుడి నుంచి ఫిర్యాదు స్వీకరించలేకపోయారు
మార్గదర్శి సంస్థపై అక్రమ కేసులను నమోదు చేస్తున్న సిఐడి పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తలకిందులుగా తపస్సు చేసిన ఒక్క చందాదారుడి నుంచి కూడా ఆ సంస్థపై ఫిర్యాదును స్వీకరించలేకపోయారు. మార్గదర్శి సంస్థ చిట్టి లను నిర్వహిస్తుంది. చిట్టి లను నిర్వహించినందుకు ఐదు శాతం కమీషన్ తీసుకుని, తన వ్యాపార కార్యకలాపాలను చేపడుతుంది. చిట్టీల నిర్వహణలో చందాదారుల నుంచి డిపాజిట్లను స్వీకరించే అవకాశమే లేదు.
ఎవరైనా చిట్టిని ఎత్తుకొని గ్యారెంటీలుగా ఇద్దరు వ్యక్తులను సమకూర్చుకోలేక పోతే, సెక్యూరిటీ డిపాజిట్ గా కొంత మొత్తాన్ని కంపెనీ వద్ద జమ చేస్తారు. చిట్టి గడువు తీరిన తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ ను వారికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. డిపాజిట్ కు, సెక్యూరిటీ డిపాజిట్ కు తేడా తెలియకపోతే చేయగలిగింది ఏమీ లేదు. మార్గదర్శి ఆస్తులను జప్తు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, తాము తీసుకున్న ముందస్తు చర్యల వల్లే 400 కోట్ల రూపాయల మార్గదర్శి టర్నోవర్ నిలిచిపోయిందని గొప్పగా ప్రకటించుకోవడం సిగ్గుచేటు.
కొత్త చిట్టీల నిర్వహణకు మార్గదర్శికి అనుమతించడం లేదు. దీనితో మార్గదర్శి టర్నోవర్ నిలిచిపోయింది. పాత చందాదారులు అడిగితే మార్గదర్శి సంస్థ డబ్బులు చెల్లించ లేదేమోనని జగన్మోహన్ రెడ్డి, సంజయ్, రామకృష్ణలు, ఆ సంస్థ కు చెందిన వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసి సేఫ్ గార్డ్ కింద పెట్టినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం . మార్గదర్శిపై సిఐడి నమోదు చేసిన కేసులు మెట్రోపాలిటన్ కోర్టులోనే కొట్టివేస్తారు. మెట్రోపాలిటన్ కోర్టులో ప్రభుత్వం ఎంత మేనేజ్ చేసినా, హైకోర్టులో ఈ కేసులు నిలిచే అవకాశం లేదన్నారు.
రామోజీరావు తెలుగువాడైనందుకు గర్వించాలి
ఈనాడు సంస్థల అధినేత, రామోజీ ఫిలిం సిటీ సృష్టికర్త, దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న రామోజీరావు తెలుగువాడు అయినందుకు గర్వించాలి. 60 ఏళ్ల పాటు మార్గదర్శి సంస్థను నిర్విఘ్నంగా నిర్వహించడమే కాకుండా, సృష్టికి ప్రతి సృష్టి అన్నట్లుగా రామోజీ ఫిలిం సిటీని ఎటువంటి లాభా పేక్ష లేకుండా అద్భుతంగా నిర్మించారు. ఈనాడు దినపత్రిక ద్వారా తెలుగు భాషను సుసంపన్నం చేశారు. అటువంటి రామోజీరావును అభినందించాల్సింది పోయి, పైకి చిరునవ్వులు చిందిస్తూ లోపల విషయాన్ని నింపుకొని వేధించడం దుర్మార్గమని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.
మంగళగిరి స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయండి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజా సంక్షేమం కంటే ఇటీవల క్రికెట్ పై మోజు పెరిగింది. మంగళగిరిలో మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు స్టేడియం నిర్మాణాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఆ స్టేడియం నిర్మాణాన్ని పూర్తిచేసి ఇటీవల క్రికెట్ నుంచి సన్యాసం తీసుకుని , త్వరలోనే మా పార్టీలో చేరనున్న అంబటి రాయుడికి క్రికెట్ శిక్షణ ఇచ్చే బాధ్యతలు అప్పగించాలి. అలాగే ఐపీఎల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున టీం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి భావించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఐపీఎల్ లో టీములన్నీ ప్రైవేటు ఫ్రాంచైజీలవే. ఇటీవల గుజరాత్ టీం ను కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ మూడు వేల కోట్ల రూపాయలను వెచ్చించిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రికి అంత ఆసక్తి ఉంటే భారతి సిమెంట్స్ పేరిట, ప్రైవేట్ ఫ్రాంచైజీ గా క్రికెట్ టీం ను కొనుగోలు చేయవచ్చునని రఘురామకృష్ణం రాజు సూచించారు .
టిడ్కో ఇళ్లను దాదాపుగా గత ప్రభుత్వమే నిర్మాణం పూర్తి చేసింది
ముఖ్యమంత్రిగా మూడుసార్లు పదవి బాధ్యతలను చేపట్టిన చంద్రబాబు నాయుడు హయాంలో టిడ్కో ఇళ్లను నిర్మించారా? అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం సిగ్గుచేటు. ఈ నాలుగేళ్లలో కొత్త గా టిడ్కో ఇళ్లను కట్టిందే లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా 5 ఇండ్లను మాత్రమే నిర్మించిందని పార్లమెంటు సాక్షిగా కేంద్రమంత్రి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మూడు లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేశారు.
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్విరామంగా సమీక్ష సమావేశాలను నిర్వహిస్తూ టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఆహార్నిశలు కృషి చేశారు. 2019లోనే నేనే స్వయంగా నా నియోజకవర్గ పరిధిలోని ఒక గ్రామంలో ఒక బ్లాక్ ని ప్రారంభించాను. ఇప్పటికీ ఆ బ్లాక్ ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
దేవుడి ఏజెంటుగా భావిస్తున్నారు … మీరేమో దానవుడి ఏజెంటుగా పనిచేస్తున్నారు
టీటీడీ ఇంచార్జ్ ఈవో ధర్మారెడ్డిని న్యాయవ్యవస్థలోని వ్యక్తులంతా , దేవుడు ఏజెంట్ గా భావిస్తూ ఆయన ఇచ్చే ప్రసాదాలను తీసుకుంటున్నారు. కానీ ధర్మారెడ్డి దానవుడు ఏజెంట్ గా పని చేస్తున్నారు. ధర్మారెడ్డి పేరులోనే ధర్మం ఉంది. ఆ పేరు ప్రాశస్ధాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. బ్రోకర్ పనులు చేయవద్దు. వివేక హత్య కేసు విచారణకు వచ్చినప్పుడల్లా దేవుడి ప్రసాదాలను పట్టుకొని ఢిల్లీకి వచ్చి , న్యాయవ్యవస్థలోని వ్యక్తులను మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో పేరు లేకుండా వార్తా కథనాన్ని రాశారు.
అయితే గతంలో మిలిటరీ ఆసుపత్రిలో తనకు వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు ఇదే ధర్మారెడ్డి, అక్కడ ఉన్న కృష్ణారెడ్డి అనే వ్యక్తి ద్వారా మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక పరోక్షంగా ప్రస్తావించింది.
నేను గతంలోనూ ఈ విషయాన్ని చెప్పాను.. భగవంతుడి సేవ చేసే అవకాశం అందరికీ రాదు. ప్రత్యేకించి మీరున్న సర్వీసులలో అసలు రాదు.
కానీ, మీకు ఆ అవకాశం భగవంతుడు కల్పించాడు. తన తండ్రి ఎలా చనిపోయారో తెలుసుకోవాలని న్యాయ పోరాటం చేస్తున్న సునీత కు వ్యతిరేకంగా, ప్రసాదాలను పట్టుకొని న్యాయవ్యవస్థలోని వ్యక్తులను ప్రభావితం చేసే పనులను చేయవద్దు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి లకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఇదే. ఒకవేళ పైరవీలే చేయాలని ధర్మారెడ్డి అనుకుంటే, ఆంధ్ర భవన్ కు బదిలీ అయి వెళితే సరిపోతుందని రఘురామకృష్ణంరాజు సూచించారు.