-ఎవరి భాష వాళ్లకు ఉంటుంది, కానీ ఒకరిపై ఒకరు పెత్తనం చేసుకునే అవసరం లేదు
– సాహితీ ప్రేమికులుగా హిందీ భాషలో ఉన్న సాహిత్యాన్ని ఆరాదిస్తామని, కానీ ఇదే మాట్లాడాలని రూల్స్ పెడితే మాత్రం తప్పకుండా రూల్స్ బ్రేక్ చేస్తాము
– తెలంగాణ అనే పరిమిత దృక్పథం నుంచి భారతీయత అనే విశాల దృక్పథం వైపు మనం ప్రయాణించాల్సిన అవసరం ఉంది
– ఎమ్మెల్సీ కవిత
-ఆచార్య ఎన్ గోపికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారం ప్రదానం
హైదరాబాద్ అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన తెలంగాణ సాహిత్య సభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆచార్య ఎన్ గోపికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారం-2023ను ఎమ్మెల్సీ కవిత అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నందిని సిధారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ గోరేటి వెంకన్న, డాక్టర్ తిరునగరి దేవకిదేవి, డాక్టర్ గోగు శ్యామల, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, డాక్టర్ ఏనుగు నరసింహ రెడ్డి, టి యస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, భారత్ జాగృతి జనరల్ సెక్రెటరీ నవీన్ ఆచారి, పలువురు ప్రముఖ కవులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ సాధించుకోవడం ఎంత ముఖ్యమో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవడం అంతే ముఖ్యమన్న నినాదంతో ఉద్యమం చేసహామన్నారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత సాహిత్య వికాసాన్ని, సాహితీ పుత్రులను నిరంతరం స్మరించుకోవడంతో పాటు తెలుగు సాహిత్యాన్ని తెలంగాణ వాళ్ళు మరింత పరిపుష్టం చేయాలన్న ఉద్దేశంతో భారత్ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సాహితీ సభలను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఇకపై ప్రతీ ఏటా తెలంగాణ సాహిత్య సభలు జరుపుతామని ప్రకటించారు.
రెండు రోజులపాటు జరగనున్న సాహిత్య సభల్లో పలు అంశాలపై సాహిత్య చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో వచన కవిత్వం ఆవీర్భావ వికాసాలు, తెలంగాణ పద్య కవిత వికాసం, తెలంగాణ ఉద్యమ పాట- ప్రధాన భావనలు, తెలంగాణ సినిమా , తెలంగాణ లలిత గీతా వికాసం, యక్షగాన ప్రదర్శన, ఘనతకెక్కిన తెలంగాణ కథ, తెలంగాణ వాంగ్మయ చరిత్ర, తెలంగాణ నవలా పరిణామాలు, యక్షగాన సాహిత్యం, తెలుగులో అకర గ్రంథాలు, స్త్రీ, దళిత సాహిత్యం, తెలంగాణ భాషా చరిత్ర వంటి అంశాలపై చర్చా గోష్ఠి జరుగుతుందని వివరించారు. ఈ చర్చలన్నింటిని గ్రంథస్థం చేస్తామని చెప్పారు.
నందిని సిద్ద రెడ్డి తెలంగాణ భాషలో మంచి కవిత్వాన్ని రాశారని, ఉద్యమంలో అందరికీ అండగా నిలబడ్డారని తెలిపారు. నాగేటి సాల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ అంటూ పాట రాశారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాహిత్య అకాడెమీ అధ్యక్షుడిగా సాహిత్య వికాసానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. తెలుగు మహాసభలు కూడా ఆయన ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయని చెప్పారు.
హిందీ చక్కటి భాష అని, తనకు ఇష్టమైనది కూడా అని చెప్పారు. హిందీ పాటల్లో పదాలు అధ్భుతంగా ఉంటాయన్నారు. అయితే, ఎవరి భాష వాళ్లకు ఉంటుందని, కానీ ఒకరిపై ఒకరు పెత్తనం చేసుకునే అవసరం లేదని స్పష్టం చేశారు. సాహితీ ప్రేమికులుగా హిందీ భాషలో ఉన్న సాహిత్యాన్ని ఆరాడిస్తామని, కానీ ఇదే మాట్లాడాలని రూల్స్ పెడితే మాత్రం తప్పకుండా రూల్స్ బ్రేక్ చేస్తామని తేల్చిచెప్పారు.
ఇటువంటి విచిత్రమైన పరిణామాలు దేశంలో జరుగుతున్న సందర్భంలో తెలంగాణ అనే పరిమిత దృక్పథం నుంచి భారతీయత అనే విశాల దృక్పథం వైపు మనం ప్రయాణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి భారత్ జాగృతి గా రూపాంతరం చెందిందని చెప్పారు.
దేశంలో తెలంగాణ మినహా ఏ రాష్ట్రం కూడా వేతనాలు చెల్లిస్తూ కళాకారులను గౌరవించడం లేదని అన్నారు. కళా సారథి అనే సంస్థను ఏర్పాటు చేసి 530 పైగా కళాకారులకు జీతం ఇస్తూ గౌరవించుకుంటున్నామని గుర్తు చేశారు.
సమానత్వం కోసం డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ ఉద్యమాన్ని మొదలుపెట్టే ముందే తెలంగాణకు చెందిన భాగ్యరెడ్డి వర్మ గొంతు వినిపించారని తెలిపారు. ఈనాడే ఆదిహిందు అనే సంస్థను స్థాపించిన భాగ్యరెడ్డి వర్మ సమానత్వం కోసం పాటుపడడం మనకు గర్వకారమన్నారు. తెలంగాణకు అటువంటి చైతన్యం ఉంది కాబట్టి మన గొంతుకను వినిపించాలని, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ కోరితే నమస్తే తెలంగాణ సంస్థ పుట్టిందని తెలియజేశారు. నమస్తే తెలంగాణ పెట్టకముందు తెలంగాణ ఉద్యమంపై అనేక అబద్ధాలు ప్రచారం అయ్యేవని, వాటిని చెల్లాచెదురు చేస్తూ మనకు నమస్తే తెలంగాణ గొంతుకగా నిలిచిందని పేర్కొన్నారు.
సీఎం కేసిఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్పూర్తితో అప్పట్లో తెలంగాణ జాగృతిని ప్రారంభించామని తెలియజేశారు. రాసేవాళ్లకు మద్దతివ్వాలని జయశంకర్ ఎప్పుడూ చెప్పేవారని, వంద మాటలు మాట్లాడడం ఒకెత్తు ఒక పదం రాయడం ఒకెత్తు, కాబట్టి రాయడానికి అంతటి శక్తి ఉందని కెసిఆర్ అనేవారని వివరించారు. ఆ దిశగా జాగృతి అనేక కార్యక్రమాలు చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా
ఆచార్య ఎన్ గోపికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విశిష్ట సాహితీ పురస్కారం-2023 కింద స్వర్ణ కంకణంతో పాటు ₹ 1,0,1116 అందజేశారు
ప్రొఫెసర్ జయశంకర్ కు నివాళి..
జీవితాంతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు ఎమ్మెల్సీ కవిత. జయశంకర్ వర్థంతి సందర్భంగా ఆమె ఘన నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అనునిత్యం ప్రజలను జాగరూక పరుస్తూ సీఎం కేసీఆర్ వెంట నిలిచిన ఉద్యమ స్పూర్తి ప్రదాత జయశంకర్ అని అన్నారు కవిత.