Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీపై పోరాడలేక బీజేపీపై నిందలా ?

-పొత్తు కోసం ప్రయత్నిస్తూ కుట్రలెందుకు ?
– అచ్చెన్నాయుడపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఘాటు విమర్శలు

ఏపీలో శాంతిభద్రతల పరిస్థితులపై బీజేపీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై.. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు.

ఈ అంశంలో సోము వీర్రాజుపై అచ్చెన్నాయుడు విమర్శలు చేయడాన్ని ఖండించారు. ఏపీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నట్లుగా అచ్చెన్నాయుడు వక్రీకరించి మాట్లాడుతూ రాజకీయ తెలివితేటలు ప్రదర్శిస్తున్నారని.. ముందు వైసీపీపై ధైర్యంగా పోరాడాలని అచ్చెన్నాయుడుకు సలహా ఇచ్చారు. ప్రతీ సారి పోరాటం నుంచి పారిపోయి.. ఇప్పుడు బీజేపీ పై నిందలేయాలని ప్రయత్నించడం ఏమిటన్నారు.

ఆడలేక మద్దెల ఓడన్నట్లుగా అచ్చెన్నాయుడు తీరు
అచ్చెన్నాయుడు తీరు ఆడలేక మద్దెల ఓడన్నట్లుగా ఉందని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీపై పోరాడలేక బీజేపీపై నిందలేయడం చేతకాని తనమేనన్నారు. వైసీపీపై పోరాడలేక బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికల్లో పోటీ చేయలేక పారిపోయారు..స్థానిక ఎన్నికల్లో నామినేషన్లలు వేసి మరీ పోటీకి దూరంగా ఉన్నారన్నారు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ వైఫల్యాలపై నిలదీయలేకపోయారు.. ప్రతిపక్ష పార్టీగా అన్ని రకాలుగా వైఫల్యంగా చెందారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ గా ఘోర వైఫల్యం చెందిన విషయాన్ని ప్రజలు గుర్తించారని.. దాన్ని కప్పి పుచ్చుకునేందుకు బీజేపీపై వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

2018-19లో రాష్ట్రపతి పాలన విధించేవాళ్లు కాదా ?
రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యంపై కేంద్రం జోక్యం చేసుకోవాలనుకుంటే 2018-19లోనే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించేవారని విష్ణువర్దన్ రెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో సాక్షాత్తూ నేటి హోంమంత్రి అమిత్ షా పై తిరుపతిలో రాళ్ల దాడి జరిగిందన్నారు. ప్రధాని పర్యటనకు వస్తే ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారని.. నల్లబెలూన్లు ఎగురవేశారన్నారు. ఇలాంటి వాటితో పాటు బెంగాల్, కేరళలో జరుగుతున్న రాజకీయాల్ని బీజేపీ ధైర్యంగా ఎదుర్కొంటున్న విషయాన్ని సోము వీర్రాజు చెబితే దానికి పెడర్థాలు తీసి కుట్రపూరిత వ్యాఖ్యలుచేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు.

అప్పట్లోనే రాజకీయ స్వార్థంతో పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే మీ పార్టీ నుండి నిధులు ఇచ్చి ఆ రాష్ట్రాలకు వెళ్లి బిజెపి వ్యతిరేకంగా ప్రచారం చేశారు . ఎవరికి వ్యతిరేకంగా మీ పార్టీ ప్రారంభించారో అలాంటి అవినీతి కాంగ్రెస్ పార్టీతో సైతం చేతులు కలిపారు. నాడు అలాంటి చర్యలు చేసిన కారణంగా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 2019లో ఓడించారని గుర్తుచేశారు.

బిజెపి రాష్ట్రాల హక్కులను రాజ్యాంగ స్ఫూర్తిని సమైక్యతను గౌరవిస్తుంది దానికి అర్థం కాని మీరు ఎన్ని తప్పులు చేసినా కానీ 2018లో శాంతిభద్రతల అంశంలో జోక్యం చేసుకోవాలనకుంటే అప్పుడే జోక్యం చేసుకుని ఉండేవారన్నారు. అప్పుడే రాష్ట్రపతి పాలన వచ్చి ఉండేదనిగుర్తు చేశారు.

పొత్తు కోసం ప్రయత్నిస్తూ కుట్రలెందుకు ?
ఓ వైపు పొత్తు కోసం ప్రయత్నిస్తూ.. మరో వైపు బీజేపీని దెబ్బతీసే కుట్రలను తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ అమలు చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నేడు సందర్భం లేకుండా ప్రత్యేక హోదా అంశం మాట్లాడడం, రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తే దానిమీద రాజకీయ దుష్ప్రచారం చేయడం , రాష్ట్రంలో కేంద్ర పథకాలు జరుగుతున్న తీరును ఓర్చుకోలేకపోవడం , మరోవైపు కేంద్రం .. ఏపీలో వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని.. ఆ రెండు పార్టీలు ఒకటేనన్న అభిప్రాయం కల్పించేందుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రోజూ అలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు.

యూటర్నులతో ఏ మాత్రం విశ్వాసం లేని రాజకీయాలు చేసే పార్టీ టీడీపీ ! చేతనైతే వైసీపీపై పోరాడాలని ప్రతీదానికి బీజేపీ ప్రస్తావన మానుకోవాలని అచ్చెన్నాయుడును సూచిస్తున్నమన్నారు. ఎలాంటి దుష్ప్రచారాలు చేసినా.. ఏపీలో వైసీపీపై పోరాడుతున్న ఒక్క పార్టీ బీజేపీనేనని ప్రజలందరికీ తెలుసని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE