ఆయన అధికార వైసీపీ సర్పంచ్. అంటే ఆ గ్రామానికి పెదరాయుడు లాంటోడు. పైగా గ్రామ ప్రథమ పౌరుడు. అసలే వర్షం, దానికితోడు వాన అన్నట్లు.. అందులోనూ వైసీపీ నేత. మరి పెదరాయుడి గారి బర్త్‌డే ఏ రేంజ్‌లో చేయాలి? చుట్టు పక్కల వంద ఊళ్లు, కనీసం వందేళ్లు చెప్పుకునేలా చేయాలి కదా? ఆయన అనుచరులు సరిగ్గా అదే చేశారు.
ఎప్పుడూ సన్మానాలు, మందు, బిర్యానీ పార్టీలయితే ఏం బాగుంటుందనుకున్నారు. అందుకే రొటీన్‌కు భిన్నంగా.. డాన్సు పాపలను పిలిచి, వేదిక ఏర్పాటుచేసి, దానిపై మందేసి చిందేయించి, చూడచక్కని సీన్లు గ్రామప్రజలకు చూపించి వారి జన్మ, ధన్యం చేయించారు. ఇంకొంచెం లోతుగా వెళితే…
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం యర్రవరంలో, సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు జన్మ దినం సందర్భంగా మందేసి చిందేసిన అధికార పార్టీ నేతలు అందరినీ అలరించారు. రికార్డింగ్ డాన్సు పాపలతో మందేసి, చిందేసి తమ అభిమాన నాయకుడి కళ్లలో మెరుపులు చూశారు. ఈ డాన్స్ ల్లో పాల్గొన్న ఏలేశ్వరం జెడ్పీటీసీ నీరుకొండ రామకుమారి భర్త సత్యనారాయణ,యర్రవరం సర్పంచ్ బేసెట్టి అప్పలరాజు, యర్రవరం ఆంజనేయస్వామి గుడి చైర్మన్ గుల్లంపూడి గంగాధర్ పాల్గొని పురప్రజలను ఖుషీ చేశారు.
సామాన్యులకు రికార్డింగ్ డాన్స్ లకు పర్మిషన్ లేదంటున్న పోలీసులు .. అధికార పార్టీ నిర్వహించిన డాన్సుపాపల డాన్సులకు మాత్రం బేఫర్వాగా అనుమతి ఇచ్చేశారు. ఎంతైనా అధికార పార్టీ కదా? ఆ మాత్రం మినహాయింపులివ్వకపోతే ఏం బావుంటుంది అనుకున్నారేమో మరి?!