– చంద్రయాన్ -3కు సర్వం సిద్దం
ఇస్రో శాస్త్రవేత్తలు చందమామ దగ్గరకు వెళ్లి ఖనిజాలు, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు అత్యంత శక్తివంతమైన రాకెట్ ప్రయోగానికి సన్నద్దమైయ్యారు.. ఈ నెల 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2.35గంటలకు చంద్రయాన్ -3 ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు రెడీ అయ్యారు.
దీంతో షార్‌లో హై అలెర్ట్, హుషార్ కనిపిస్తుంది.. ఓ పక్క కేం ద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు మరో వైపు సీఐఎస్ఎఫ్ దళాలతో భారీ బందోబస్తు చర్యలు చేపడుతూ కట్టుదిట్టమైన భద్రత నడుమ రాకెట్ ప్రయోగం చేపట్టనున్నారు.. ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాధ్ షార్కు చేరుకుని ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు..
భారతదేశంతో పాటు ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్ -3 ప్రయోగం అన్ని పరీక్షలు పూర్తిచేసుకుని జాబిలమ్మా నీకోసం నేనొస్తున్నామా అంటూ ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 2.35గంటలకు చంద్రుడివైపు అడుగులు వేయనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి బుధవారం ఎంఆర్ఆర్ సమావేశాన్ని శాస్త్రవేత్తలు నిర్వహించి రాకెట్ రిహార్సల్ వివరాలు నిశితంగా పరిశీలించి ప్రయోగానికి గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చారు.
ఈ మేరకు గురువారం మధ్యాహ్నం 2.35 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించి 24 గంటల పాటు నిర్విరామంగా కౌంట్‌డౌన్ కొనసాగిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నం 2.35గంటలకు ఇస్రో బాహుబలిగా పిలువబడే ఎల్వీఎం3-ఎం4 రాకెట్ నారింజరంగు నిప్పులు చిమ్ముకుంటూ నింగికెక్కుపెట్టిన బాణంలా నింగిలోకి దూసుకెళ్లనుంది. భూమికి సుమారు 3.84లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి వరకు మూడు అంచెల్లో ఈ ప్రయోగం సాగనుంది. ముందుగా ఎల్వీఎం3-ఎం4 రాకెట్ భూకక్ష్యలోకి ఉపగ్రహాన్ని చేరవేస్తుంది.
భూమి చుట్టూ 24రోజుల పాటు తిరుగుతూ ఆ తర్వాత చంద్రుని దిశగా గమనం ప్రారంభించి 19 రోజుల పాటు పరిభ్రమిస్తూ ఉంటుంది. చంద్రునికి 30 కిలోమీటర్ల చేరువైన తర్వాత ఉపగ్రహం నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుని దక్షిణ ధృవంలో దిగనుంది.
అయితే చంద్రయాన్ -2 ప్రయోగంలో ల్యాండర్ చంద్రుని ఉపరితలంలో దిగే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తి భూమి నుంచి సంకేతాలు తెగిపోవడంతో చంద్రుని ఉపరితలాన్ని ఢీకొనడంతో ప్రయోగం విఫలమైంది. దీంతో చంద్రుని ఉపరితలంపై ఆశించిన పరిశోధనలు ఇస్రో చేయలేకపోయింది. ఈ వైఫల్యాన్ని నిషితంగా విశ్లేషించిన శాస్త్రవేత్తలు చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ సురక్షితంగా దిగే విధంగా సరికొత్త విధానాన్ని రూపొందించింది.