– పదినెలలు దాటినా ఎత్తివేయని రాజాసింగ్ సస్పెన్షన్
– సంజయ్ ప్రయత్నించినా ఫలించని వైనం
– మహ్మద్ ప్రవక్తపై వీడియోతో బీజేపీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్
– పార్టీ నిర్ణయాన్ని నిరసించిన వేలాదిమంది కార్యకర్తలు
– నాయకత్వ నిర్ణయంపై బీజేపీకి దూరమైన హిందువులు
– పాతబస్తీలో హిందువులకు దన్నుగా నిలిచిన రాజాసింగ్
– హిందువుల కోసం పోరాడేనేతను సస్పెండ్ చేయడంపై వ్యతిరేకత
– ఇదేం సెక్యులరిజమని హిందువుల ప్రశ్నాస్ర్తాలు
– రాజాసింగ్ జైల్లో ఉన్నా పరామర్శించని బీజేపీ నాయకులు
– సస్పెన్షన్ వెనుక కిషన్‌రెడ్డి హస్తం ఉందంటూ అప్పట్లో అనుమానాలు
– తొలి నుంచీ కిషన్-రాజాసింగ్‌కు సరపడని వైనం
– ఇప్పుడు కిషన్రాకతో రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత అనుమానమే
– తెలంగాణకు ముగ్గురు ఇన్చార్జిలు ఉన్నా సస్పెన్షన్‌ను పట్టించుకోని వైనం
– పట్టించుకోని తెలంగాణ జాతీయ నేతలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
మైనారిటీలకు తిరుగులేని స్థావరమైన పాతబస్తీలో ఆయన పిలుపే ప్రభజంనం. హిందువులకు రక్షకుడన్న పేరు. ఎవరికీ భయపడని గుండెధైర్యం. పాతబస్తీలో ఒకప్పుడు నరేంద్ర భాయ్‌సాబ్. ఇప్పుడు ఆయన! హిందుత్వమే ఆయనకు శ్వాస, ఆశ, ధ్యాస. రాజధాని నగరంలో ఒక ఫైర్‌బ్రాండ్. పార్టీ వల్ల ఆయన పెరిగిందేమీ లేదు. కానీ పార్టీ మాత్రం ఆయన వల్ల అక్కడ పెరిగింది. అక్కడ ఆయనే పార్టీ. పార్టీనే ఆయన.
అలాంటి ఇమేజ్ ఉన్న నేత.. మహ్మద్ ప్రవక్తపై విడుదల చేసిన ఓ వీడియో ఆయనను పార్టీ నుంచి సస్పెండయ్యేలా చేసింది. నిరంతరం హిందూజపం చేసే ఆయన పార్టీ.. ముస్లిం ప్రవక్తపై చేసిన వీడియోకు ఆగ్రహించి సస్పెండ్ చేయడమే ఆశ్చర్యం. ఆయన పేరు రాజాసింగ్. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే!
ఒకప్పుడు హైదరాబాద్ నగరం బీజేపీకి పెట్టనికోట. ఎమ్మెల్యేల సంఖ్య అంతగా లేకపోయినా బలమైన నేతలు, అంకితభావం ఉన్న క్యాడర్ పుష్కలం. నరేంద్ర, బాల్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, జిఆర్ కరుణాకర్ లాంటి ఇమేజ్ ఉన్న నేతల వల్లే.. రాజధాని నగరంలో బీజేపీ ఉనికి కొనసాగుతోందన్నది నిష్ఠుర సత్యం. వీరిలో దత్తాత్రేయకు గవర్నర్ పదవి రాగా, నరేంద్ర మృతి చెందారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావాలన్న తన చిరకాలవాంఛ తీరకుండానే, భాయ్‌సాబ్ మృతి చెందడం పార్టీ క్యాడర్‌ను బాధించింది.
ఇక ఇంద్రసేనారెడ్డి ప్రస్థానం రాష్ట్ర అధ్యక్షుడితో ముగిసిపోగా, నగర అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీలో పనిచేసిన ఫైర్‌బ్రాండ్ జీఆర్ కరుణాకర్‌ను పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు. పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయాలను బహిరంగంగా ప్రశ్నించడం, సంఘ్ సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవహరించే అగ్రనేతల వైఖరిని ప్రశ్నించడమే, ఆయన వెనుకబాటుతనానికి కారణం.
తర్వాత తరంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నగరంలో పార్టీకి ఏకైక రక్షకుడిగా నిలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి.. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్ సహా అందరూ ఓడిపోగా.. ఒక్క రాజాసింగ్ మాత్రమే పార్టీ నుంచి విజయం సాధించి, ఫ్లోర్‌లీడర్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ విజయం సాధించారు. దానితో అసెంబ్లీలో బీజేపీ సంఖ్య ఒకటి నుంచి మూడుకు పెరిగింది.
కాగా మహ్మద్ ప్రవక్తపై అనుచిత వీడియో విడుదల చేసినందుకు.. రాజాసింగ్‌ను పార్టీ నాయకత్వం, గత ఆగస్టు 22న సస్పెండ్ చేసింది. పార్టీ ఆదేశం ప్రకారం ఆయన వివరణ కూడా ఇచ్చారు. అయినా ఇప్పటిదాకా రాజాసింగ్‌పై సస్పెన్షన్ తొలగించలేదు. ఆగస్టు 23న రాజాసింగ్‌ను పిడియాక్టు కింద అరెస్టు చేశారు. రాజాసింగ్ జైల్లో ఉన్నప్పుడు బీజేపీ నాయకులు కనీసం ఆయనను పరామర్శించకపోవడం, సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంపై బీజేపీ శ్రేణులు, హిందూ సంస్ధలు బీజేపీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తమయింది.
ముస్లింలను మెప్పించేందుకు.. పార్టీ నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హిందువులు, కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మజ్లిస్ నేతలను గుండెధైర్యంతో ఎదిరించే రాజాసింగ్‌ను.. సస్పెండ్ చేయడం తెలివితక్కువ నిర్ణయం తీసుకుందని, హిందూ సంస్ధలు అప్పట్లో వ్యాఖ్యానించాయి.
మజ్లిస్ పార్టీని ధైర్యంగా ఎదుర్కొనే ఒక హిందూ సేనాధిపతికి, నాయకత్వం ఇచ్చే బహుమానం ఇవేనా అని నిలదీశారు. హిందువులకు ప్రతినిధి అని చెప్పుకునే పార్టీ.. అదే హిందుత్వం కోసం పోరాడిన రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో, బీజేపీని అభిమానించే హిందువులు, తటస్థులు పార్టీకి దూరమైన పరిస్థితి ఏర్పడింది.
రాజాసింగ్‌ను సస్పెండ్ చేసి 11 నెలలవుతున్నా, ఇప్పటిదాకా తొలగించ పోవడంపై పార్టీ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరం నుంచి కిషన్‌రెడ్డి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. లక్ష్మణ్ ఓబీసీ జాతీయ అధ్యక్షుడితోపాటు, కీలకమైన పార్టీ పార్లమెంటరీబోర్డు సభ్యుడిగా ఉన్నారు. రాష్ర్టానికి ముగ్గురు ఇన్చార్జిలుగా ఉన్నారు.
డికె అరుణ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, ఈటల రాజేందర్, వివేక్ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. అయినప్పటికీ ఒక్కరు కూడా రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని నాయకత్వంపై, ఒత్తిడి తీసుకురాకపోవడంపై పార్టీవర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బండి సంజయ్ రాష్ర్ట అధ్యక్షుడిగా ఉన్నప్ప్పడు, సస్పెన్షన్ తొలగింపు కోసం కృషి చేసినప్పటికీ అది ఫలించలేదు.
అయితే రాజాసింగ్-కిషన్‌రెడ్డి మధ్య ఉన్న విభేదాల కారణంగా.. రాజాసింగ్‌ను కిషన్‌రెడ్డే సస్పెన్షన్ చేయించారన్న ప్రచారం, అప్పట్లో పార్టీ వర్గాల్లో జరిగింది. కిషన్‌రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. బేగంబజార్‌లో ఐదువేల గజాల స్థలానికి సంబంధించిన వ్యవహారంలో, ఇద్దరి మధ్య దూరం పెరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆరెస్సెస్ సానుభూతి పరుడి స్థలం అపార్టుమెంట్ నిర్మాణంలో.. దివంగత మాజీ మంత్రి ముఖేష్, మరో కార్పొరేటర్ కలసి చేసిన డీల్‌లో.. రాజాసింగ్ తలదూర్చడాన్ని సంఘ్ పెద్దలు సీరియస్‌గా తీసుకున్నారు. దానిని సెటిల్‌చేసే బాధ్యతను కిషన్‌రెడ్డికి అప్పగించారని చెబుతున్నారు.
దానితో రాజాసింగ్‌పై కిషన్ సీరియస్ అయ్యారని, అప్పటినుంచే వారిద్దరి మధ్య దూరం పెరిగిందంటారు. కాగా సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజాసింగ్ అనేకసార్లు, కిషన్‌రెడ్డిపై పరోక్ష విమర్శలు చేసిన వైనం మీడియాలో హల్చల్ చేసింది. ఇప్పుడు కిషన్‌రెడ్డి మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో, ఇక రాజాసింగ్‌పై సస్పెన్షన్ తొలగించడం కష్టమేనన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ ప్రభుత్వం కామన్సివిల్కోడ్ బిల్లు తీసుకురానున్న నేపథ్యంలో, దేశంలోని ముస్లిం సంస్థలన్నీ దానిని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కూడా..పార్టీ నాయకత్వం రాజాసింగ్‌పై, సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంపై పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.