Suryaa.co.in

Telangana

బ్రహ్మకుమారీస్ కల్పతరువు-2 కార్యక్రమాన్ని ప్రారంభించిన జోగినిపల్లి సంతోష్ కుమార్

యోగా, ఆధ్యాత్మీకతను ప్రజలకు చేరువ చేస్తున్న బ్రహ్మకుమారీ సమాజం ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమం కల్పతరువు రెండవ సీజన్ ను ఇవ్వాల గచ్చిబౌలి లోని బ్రహ్మకుమారీస్ శాంతిసరోవర్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా మేం మొక్కలు నాటే కార్యక్రమం విస్తృతంగా చేస్తుంటే.. మరోవైపు బ్రహ్మకుమారీలు కూడా కల్వతరువు పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం.. దాని మొదటి దశ కల్వతరువును నేనే ప్రారంభించడం.. రెండవ దశకూడా నేనే ప్రారంభించడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది.

భిన్న రంగాల్లో ఉన్నప్పటికి సమాజం బావుండాలనే ఆశయం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా మేము, కల్పతరువు ద్వారా బ్రహ్మకుమారీలు చేస్తుండటం భగవంతుడి సంకల్పంగా భావిస్తున్నాను. కల్పతరువు-1లో వారు 16 లక్షల మొక్కలు నాటడం వారి సంకల్పశక్తికి నిదర్శనం. కల్పతరువు-2లో వారు అంతకు మించి మొక్కలు నాటాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

అనంతరం మాట్లాడిన బ్రహ్మకుమారీస్ మాత కుల్దీప్ దీదీ.. జోగినిపల్లి సంతోష్ కుమార్, మా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావడం వారి మంచి మనసుకు నిదర్శనం. ఆయన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా మొక్కలు నాటడం, ప్లాస్టిక్ నిర్మూలనకు పాటుపడటం, మొక్కలు నాటే అరుదైన వ్యక్తులను గుర్తించి అండగా నిలవడం వంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలు కార్యనిష్టతో నిర్వహిస్తున్నారు.

ఒక ఋషిలా నిరంతరం ప్రకృతి పరిరక్షణ కోసం పరితపిస్తున్నారు. అందుకే వారి మంచి ఆశయాలు చూసి బ్రహ్మకుమారీ సమాజంలో ఐదు సంవత్సరాల సేవ తర్వాత అందించే బ్యాడ్జీని ఈ రోజే సంతోష్ కుమార్ గారికి అందిస్తున్నట్లు కరతాళధ్వనుల మధ్య ఆమే ప్రకటించారు. వారు చేస్తున్న నిరంతర కృషికి భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ కుటుంబసభ్యులు, రాజయోగులతో పాటు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఫౌండర్ మెంబెర్స్ కరుణాకర్ రెడ్డి మరియు రాఘవ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE