– పేదరిక నిర్మూలన సంస్థ ఓరుగల్లు మహా సమాఖ్యకు మంత్రి ఎర్రబెల్లి అభినందన
హన్మకొండ జిల్లా : తెలంగాణ మహిళా డ్వాక్రా సంఘాల పనితీరు, అనుభవాన్ని ఇతర రాష్ట్రాల మహిళ సంఘాలకు శిక్షణ ఇచ్చి తీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశంసించారు.
ఇటీవల లడక్ వెళ్లి అక్కడ శిక్షణ ముగించి వచ్చిన హనుమకొండకు చెందిన పేదరిక నిర్మూలన సంస్థ ఓరుగల్లు మహా సమాఖ్యకు చెందిన 15 మంది మహిళలు శనివారం హన్మకొండ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. అక్కడి శిక్షణ ఇచ్చిన తీరును వివరించగా శభాష్ అంటూ వారిని మెచ్చుకున్నారు.
దేశానికే ఆదర్శంగా నిలిచిన మహిళలకు అభినందనలు తెలిపారు. ఏండ్లుగా వారు నిర్వహిస్తున్న శిక్షణ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన 10 ఉత్తమ ప్రగతి సాధించిన ఆదర్శ సంఘాలతో కలిపి ఓరుగల్లు పరస్పర సహాయక సహకార సంఘాలు మహా సమాఖ్యగా ఏర్పడి 18 ఏండ్లుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాదుల ఏర్పాటు ద్వారా పేదరిక నిర్మూలన, మహిళల ఆర్థికాభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. 2015లో ఈ సమాఖ్య తెలంగాణలో ఏకైక జాతీయ స్థాయి మానవ వనరుల సంస్థగా జాతీయ గుర్తింపును పొందింది. ఈ సంస్థలోని దాదాపు 460 మంది రిసోర్స్ పర్సన్స్ తగు శిక్షణ పొంది, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తమ అనుభవాలను రంగరించి శిక్షణ ఇస్తున్నారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలను సీఎం కేసీఆర్ బలోపేతం చేశారని వెల్లడించారు. పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 4,35,364 స్వయం సహాయక సంఘాలలో 45,60,518 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారన్నారు. దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున సంఘటితమైన మహిళలు తెలంగాణలో తప్ప ఎక్కడా లేరన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జడ్పీ ఇన్‌చార్జి సీఈవో, వరంగల్ డీఆర్‌డీవో సంపత్ రావు, సెర్ప్‌నకు చెందిన తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, ఓరుగల్లు మహా సమాఖ్య కు చెందిన మహిళలు, రిసోర్స్ పర్సన్స్, సీనియర్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.