Suryaa.co.in

Andhra Pradesh

సర్పంచ్ ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి

-సర్పంచ్ లకు ఇవ్వలసిన నిధులను, బకాయిలను వెంటనే విడుదల చేయాలి
-భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి
-బిజేపి, జనసేన ఆధ్వర్యములో కలక్టరేట్ వద్ద మహా ధర్నా
-వేలాదిగా తరలివచ్చిన ఇరు పార్టీల కార్యకర్తలు ఆరోపించారు

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని అపహాస్యం పాలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తీరు, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సర్పంచి వ్యవస్థను నీరుగారిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి చోద్యం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, మిత్రపక్షమైన జనసేనతో కలిసి సర్పంచులకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై పోరు కొనసాగిస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు.

సర్పంచుల అధికారాలను నిర్వీర్యం చేసి గ్రామాల అభివృద్ధిని కాలరాస్తూ పంచాయితీ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర వైసీపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ, జనసేన ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ప్రధాన కేంద్రాలు కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వానిలో భాగంగా గురువారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్ “ప్రకాశం భవనం” ధర్నాస్థలి వద్ద భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి నేతృత్వంలో జరిగిన ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి మాట్లాడుతూ… గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు, జీవనాడులు, దేశ సమగ్రతను సజీవంగా ఉంచుతూ దాదాపుగా 80 శాతం ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారని, అక్కడి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి రాజ్యాంగం స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

ఆ వ్యవస్థకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పడే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నా ప్రస్తుతం రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారి పాలన పంచాయతీరాజ్ వ్యవస్థను శూన్యం చేస్తున్నారని, సర్పంచ్ లకు ప్రత్యేకమైన ఖాతాలు ఏర్పాటు చేసి నిధులు పంపించాల్సి ఉన్నది.

కేంద్ర ప్రభుత్వం నిధులను పంపిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను సర్పంచుల ప్రమేయం లేకుండానే దారి మళ్ళిస్తుందని, నిధుల లేమితో సర్పంచులు తాము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి బయట నుండి అప్పు, సొప్పు చేసి ఆ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వాని తాలూకు బిల్స్ కూడా సరైన సమయానికి పాస్ చేయకుండా వారిని రాష్ట్ర ప్రభుత్వం అభద్రత భావంలోకి నెట్టేసిందని, సర్పంచులను ఆత్మహత్యలకు పాల్పడేలా రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉన్నదని విమర్శించారు.

మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ గ్యారెంటీ యాక్ట్ ద్వారా 8629 కోట్ల రూపాయలు వస్తే వానిని సంపద సృష్టికి ఖర్చు చేయకుండా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి ఉపయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధిపై సీత కన్ను వేసిందని, రాజ్యాంగబద్ధమైన సర్పంచ్ వ్యవస్థను అవమాన పరుస్తూ అవస్థలు పాలు చేస్తుందని, మహా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీర్యం చేస్తూ గాంధీని అవమాన పరుస్తున్నారని విమర్శించారు.

సర్పంచ్ గా ఎన్నికై కూడా గ్రామాభివృద్ధి సాధించలేక, చేసిన పనుల బిల్ల్స్ ప్రభుత్వం అందించకపోవడం వల్ల దర్శిలో బాదం ధనలక్ష్మి, పల్నాడులో వెంకటేశ్వర్లు విజయనగరం తదితర జిల్లాల్లో ఒకటి రెండు ఆత్మహత్యలు పత్రిక కథనాల్లో మనం చూస్తున్నామని తెలిపారు. వీరి మరణాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు?

వైసిపి అధికారిక ట్విట్టర్ అకౌంట్లో 85% సర్పంచులు మా వైసీపీ వారే ఉన్నారని మరి మా సర్పంచులకు అన్యాయం ఎలా చేస్తామని పోస్ట్ పెట్టుకున్నారని, మరి మరణించిన వైసీపీ సర్పంచుల కు ఎలాంటి, ఎవరు సమాధానం చెప్తారని, వారికి న్యాయం ఎవరు చేస్తారని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా (1) ఆర్థిక సంఘం సిఫారసు చేసిన నిధులు నేరుగా కేంద్ర ప్రభుత్వం నుండి గ్రామ పంచాయితీల ఖాతాలకు జమ అయ్యేవిధంగా చూడాలి. (2) మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు బదిలీ చేసుకోకుండా చర్యలు అవసరం. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న కేంద్ర ప్రభుత్వ నిధులను బకాయిలుగా భావించి పంచాయితీలకు తక్షణం చెల్లించాలి. (3) రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను పంచాయితీలకు సకాలంలో చెల్లించాలి. (4) ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయితీలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు తక్షణం చెల్లించాలి. (5) సర్పంచ్ లు అప్పులు చేసి పంచాయితీల అభివృద్ధి కోసం పెట్టిన వ్యయం వెంటనే విడుదల చెయ్యాలి. (6) గ్రామా పంచాయతీలు ఆధీనంలోనే వాలంటీర్లు మరియు గ్రామసచివాలయాలు కార్యకలాపాలు నిర్వర్తించాలి. (7) ఇప్పటివరకు పంచాయితీల కోసం ఖర్చుచేసిన కాంట్రాక్టర్ల బిల్లులు తక్షణం చెల్లించాలి అనే డిమాండ్లతో జాయింట్ కలెక్టర్ కు విజ్ఞాపనపత్రం అందించారు.

లంక దినకర్, బిజెపి జిల్లా అధ్యక్షులు శివారెడ్డి, మాజీ శాసనసభ్యులు దారా సాంబయ్య, ఈదర హరిబాబు , జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పీవీ కృష్ణారెడ్డి, రాయపాటి అజయ్ , నాగేంద్ర యాదవ్, ఎస్సీ మోర్చా జోనల్ ఇంచార్జ్ పేముల మోజీ, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పేముల ఉమారాణి, బిజెపి నాయకులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE