– టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీకి పరాజయమే
– లీకయిన ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ సర్వే
– వైసీపీ గెలుపు కష్టమేనన్న పీకే సర్వే
– 16 మంది ఎంపీలకు గెలిచే చాన్సు లేదట
– 3 ఎంపీ స్థానాల్లోనే వైసీపీకి బాగుందన్న సర్వే
– అయినా అక్కడ 4 శాతమే ఆధిక్యం
– పవన్ ప్రభావం 10నుంచి 15 శాతం
– గోదావరి, విశాఖ జిల్లాల్లో జనసేన ప్రభావం
– టీడీపీ-జనసేన కలిస్తే అద్భుత ఫలితాలు
– 25 ఎంపీ స్థానాల్లో టీడీపీకి 40-53 శాతం ఓట్లు
– 35-50 అసెంబ్లీ స్థానాలకే వైసీపీ పరిమితమన్న ఐప్యాక్ సర్వే
– టీడీపీ గెలిచిన ఆ 3 ఎంపీ సీట్లలో వైసీపీకి విజయావకాశాలు లేవట
– టైమ్స్ నౌ సర్వేకు భిన్నంగా ఐ ప్యాక్ సర్వే ఫలితాలు
– టైమ్స్‌నౌ సర్వేలో వైసీపీకి 24-24, టీడీపీకి 1 ఎంపీ
– దానికి భిన్నంగా ప్రశాంత్ కిశోర్ సర్వే ఫలితాలు
– మరి టైమ్స్ నౌ సర్వే ఉత్తిదేనా అంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు
– పీకే టీమ్ సర్వేతో వైసీపీ సిట్టింగులో గుబులు
– సర్వే నివేదిక ఎలా లీక్ అయిదంటూ ఆరాలు
– వైసీపీలో సర్వే ఫీవర్
( మార్తి సుబ్రహ్మణ్యం)
వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి మోగిస్తుందంటూ టైమ్స్ నౌ చేసిన సర్వే ఆనందాన్ని ఆస్వాదిస్తున్న వైసీపీ నేతలకు… ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ చేసిన సర్వే ఫలితాలు, గుండెలో రాయి పడేలా చేస్తున్నాయి. వైసీపీ అధికార సర్వే సంస్థ అయిన ఐప్యాక్ నిర్వహించిన సర్వేలో .. వైసీపీకి ఎదురుగాలి వీస్తుందన్న నివేదిక రావటం, వైసీపీ సిట్టింగులను కలవరపరుస్తోంది.
ప్రధానంగా పార్లమెంటు స్థానాల వారీగా నిర్వహించిన సర్వేలో.. టీడీపీ ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు 40-53 శాతం సీటు సాధిస్తుందన్న నివేదిక గుబులు పుట్టిస్తోంది. ఇది చాలదన్నట్లు.. జనసేన 10-15 శాతం ఓట్ల శాతంతో, పుట్టిముంచుతుందన్న నివేదిక కూడా కలవరపరుస్తోంది. టీడీపీ-జనసేన కలిస్తే గత పార్లమెంటు ఎన్నికల ఫలితాలు తిరగబడతాయని ఐప్యాక్ చెప్పకనే చెప్పింది.
కొద్దిరోజుల క్రితం ప్రతిష్టాత్మక టైమ్స్‌నౌ నిర్వహించిన సర్వే ఫలితాలు వైసీపీ నేతల పెదవులపై చిరునువ్వులు పూయించాయి. తిరిగి అధికారం జగనన్నదే అని దాని ఫలితం సారాంశం. వైసీపీకి 24 నుంచి 25 పార్లమెంటు సీట్లు వస్తాయని, టీడీపీకి కేవలం ఒకే ఒక్క ఎంపీ స్థానం వస్తుందని టైమ్స్ నౌ వెల్లడించింది. అంటే టీడీపీకి జగన్ ప్రభంజనంలో కూడా వచ్చిన ఆ మూడు సీట్లు, ఈసారి రావని తేల్చింనదన్న మాట. దానితో వైసీపీ సిట్టింగులు, నేతలు సంబరపడ్డారు.
అయితే తాజాగా వైసీపీ అధికార సర్వే సంస్థ అయిన ఐప్యాక్ మాత్రం, వచ్చే ఎన్నికల్లో తన పార్టీ చతికిలపడుతుందని వెల్లడించింది. ఆ మేరకు జగనన్నకు అత్యంత సన్నిహితుడైన ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ సంస్థ సర్వే నివేదక ఒకటి, సోషల్‌మీడియాలో విష్ణుచక్రంలా గిర్రున తిరుగుతోంది.
అది ఇప్పుడు వైసీపీ సిట్టింగు, సీనియర్ నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. లీకయిన ఆ సర్వే ఫలితాలు సహజంగానే టీడీపీ-జనసేనకు ఆనందం కలిగించగా..అంతకుముందు టైమ్స్‌నౌ మిగిల్సిన ఆనందం వైసీపీ నేతల్లో ఆవిరయిపోయింది.
ప్రధానంగా ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ సర్వేలో.. గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన 22 లోక్‌సభ స్థానాల్లో, ఈసారి 16 మందికి గెలిచే అవకాశాలు లేవని కుండబద్దలు కొట్టడాన్ని వైసీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. జగనన్న సొంత జిల్లా అయిన కడప, రాజంపేట, అరకు లోక్‌సభ స్థానాల్లోనే వైసీపీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అయితే అక్కడ ప్రత్యర్ధి పార్టీపై, వైసీపీ కేవలం 4 శాతం మాత్రమే ఆధిక్యంలో ఉందని పేర్కొనడం ఇబ్బందికర పరిణామమేనంటున్నారు.
ఈసారి ఎన్నికల బరిలోకి సీరియస్‌గా దిగేందుకు సిద్ధమవుతున్న జనసేనకూ, ఆశావహ పరిస్థితి ఉందని ఐ ప్యాక్ స్పష్టం చేసింది. ఆ పార్టీ కనీసం 10 నుంచి 15 శాతం ఓటు బ్యాంకు సాధిస్తుందని ఐప్యాక్ వెల్లడించింది. ఆ ప్రకారంగా కాపుల ప్రభావం విపరీతంగా ఉండే.. తూర్పు-పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో ‘గ్లాసు’ మెరుస్తుందని ఐప్యాక్ విస్పష్టంగా పేర్కొనడం, వైసీపీ వర్గాలకు మింగుడుపడని అంశమే.
ఇక ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి, ఐప్యాక్ సర్వే మంచి మార్కులు వేయటం విశేషం. ఆ పార్టీ ఒక్కో
నియోజకవర్గంలో ..కనీసం 40 నుంచి 53 శాతం ఓట్లు దక్కించుకుంటుందని, ఐప్యాక్ స్పష్టం చేసింది. అంటే 45 శాతం ఓట్లు దక్కించుకునే ప్రతి నియోజకవర్గంలోనూ, టీడీపీ గెలుస్తుందని వెల్లడించింది.
ప్రస్తుతం టీడీపీ ఎంపీలున్న గుంటూరు, శ్రీకాకుళం, విజయవాడ లోక్‌సభ స్థానాలు, మళ్లీ ఆ పార్టీ ఖాతాలోనే చేరతాయని స్పష్టం చేయడం.. అక్కడ పాగా వేయాలని ప్రయత్నిస్తున్న వైసీపీకి శరాఘాతమేనని, రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
వైసీపీకి అరకు లోక్‌సభలో 47 శాతం, కడపలో 54 శాతం, రాజంపేటలో 48 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు ఐప్యాక్ పేర్కొంది. ఇక సిట్టింగ్ ఎంపీ ఉన్న నర్సాపురంలో వైసీపీకి 31.50 శాతం రాగా, టీడీపీకి 36, జనసేనకు 26 శాతం రావడం విశేషం. ఇది ఆ రెండు పార్టీలు కలిస్తే ఫలితం ఏవిధంగా ఉంటుందో స్పష్టం చేస్తోంది.
ఒంగోలులో వైసీపీ-టీడీపీకి చెరో 46 శాతం రాగా, జనసేనకు 4.25 శాతం ఓట్లు వస్తాయని పేర్కొనడం ప్రస్తావనార్హం. టీడీపీకి అమలాపురంలో 38.30-జనసేనకు 24.20 శాతం, అనకాపల్లిలో టీడీపీకి 44.85-
జనసేనకు 11.25 శాతం, అనంతపురంలో టీడీపీకి 50 శాతం, బాపట్లలో టీడీపీకి 49 శాతం, చిత్తూరులో 48.25 శాతం, ఏలూరులో టీడీపీకి 48.90 శాతం-జనసేనకు 8 శాతం, గుంటూరులో 52.50-10 శాతం, కాకినాడలో 43.50 – 13 శాతం, నెల్లూరులో 47.25-3.25 శాతం, రాజమండ్రిలో 42.75-15 శాతం, తిరుపతిలో 45-3.25, విజయవాడలో 47.25-8.75 శాతం, విశాఖలో 42.75 -20.50 శాతం, విజయనగరంలో 48.25-4.25 శాతం ఓట్లు టీడీపీ-జనసేన సాధిస్తాయని పేర్కొంది.
ప్రధానంగా టీడీపీ-జనసేన కలిస్తే.. వైసీపీ అధికారంలోకి రాదన్న విషయాన్ని, ఐప్యాక్ నివేదిక చెప్పకనే చెప్పింది. ఒంగోలు లోక్‌సభలో వైసీపీ-టీడీపీకి చెరో 46 శాతం రాగా, జనసేన 4.25 ఓట్లు సాధిస్తుందని పేర్కొంది. కర్నూలులో వైసీపీకి 47 శాతం ఓట్లు రాగా.. టీడీపీి 46.50-జనసేనకు 2 శాతం ఓట్లు వస్తాయని వివరించింది. రాజంపేటలో వైసీపీకి 48 శాతం, టీడీపీ43.25 – జనసేనకు 4.25 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది.
తిరుపతిలో వైసీపీకి 47.25 శాతం ఉండగా, టీడీపీ 45-జనసేన3.25 శాతం ఓట్లు సాధిస్తాయని పేర్కొంది. అంటే టీడీపీ-జనసేన కలిస్తే, వైసీపీ ఎన్నికల వైతరణి దాటడం కష్టమన్నది ఐప్యాక్ పరోక్షంగా చెప్పినట్టయింది.
మొత్తంగా ప్రశాంత్ కిశోర్ నాయకత్వంలోని ఐప్యాక్ చేసిన సర్వేలో.. వైసీపీకి 35 నుంచి 50 అసెంబ్లీ స్ధానాలు మాత్రమే వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడించింది. తాజా ఐప్యాక్ సర్వే ఫలితాలు, వైసీపీ వర్గాలను నిద్రకు దూరం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
టైమ్స్ నౌ సర్వే ఆసాంతం.. తమ పార్టీకి పూర్తి స్థాయి అనుకూలమైన నివేదిక ఇవ్వగా, తమ సొంత సంస్థ అయిన ఐప్యాక్ మాత్రం.. అందుకు భిన్నంగా సర్వే ఫలితాలివ్వడంతో, సహజంగానే వైసీపీ వర్గాలు అయోమయంలో పడ్డాయి.
నిజానికి శాసనమండలి గ్రాడ్యుయేషన్ నియోజకవర్గాలు, తాజాగా సర్పంచ్, వార్డు సభ్యుల ఉప ఎన్నికల్లో టీడీపీ పడిలేచిన కెరటంలా విరుచుకుపడింది. అధికార పార్టీ సర్పంచులంతా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. రెడ్లు సహా ఉద్యోగులు, వ్యాపారులు ప్రభుత్వంపై వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నారు. అయినా టైమ్స్ నౌ సర్వేలో, వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది. అయితే దానిని మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలే విశ్వసించలేని పరిస్ధితి.
ఆ క్రమంలో ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ సర్వే సంస్థ, సొంత పార్టీకి అసెంబ్లీకి ఆరుపదుల సీట్లు కూడా రావన్న ఫలితాలే.. వైసీపీ ఎమ్మెల్యేలు, సీనియర్లను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
అయితే అసలు ఐప్యాక్ పేరిట సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న వివరాలు నిజమేనా? అబద్ధమా? ఆ సంస్థ సర్వే ఎప్పుడు చేసింది? ఎప్పుడు జగనన్నకు ఇచ్చింది? అని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూపీ లాగే పనిలో ఉన్నారట. కాగా ఐప్యాక్ పేరిట ఉన్న లెటర్ హెడ్లో మాత్రం, 20/07/2023 నాడు నివేదిక రూపొందించినట్లు కనిపిస్తోంది.