– తరతరాలకు చెరగని మోసం
– ‘రెరా’ కళ్లకు రియల్టీ కంపెనీల గంతలు
– ‘రెరా’ రిజిస్ట్రేషన్ నెంబర్ చూపకుండానే పబ్లిసిటీ
– రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే ప్లాట్లు అమ్ముతున్న సువర్ణభూమి మోసాలు
– రెరా కళ్లుగప్పి ఎల్లాపూర్‌లో ప్లాట్లు అమ్మేసిన సువర్ణభూమి
– లేక్‌వ్యూ పేరుతో ప్లాట్లు అమ్మేసిన సువర్ణభూమిపై రెరా ఆగ్రహం
– బాధితులను బ్రాండ్అంబాసిడర్ రాంచరణ్ రక్షిస్తారా?
– రెరా అనుమతి లేకుండానే ఉస్మాన్‌నగర్‌లో రాధే పనోరమ ప్లాట్ల అమ్మకాలు
– రెరా కళ్లు గప్పి అదనపు నిర్మాణాలు చేసిన ఓంశ్రీ ప్రాజెక్టు లీలలు
– నాలుగు బ్లాకులకు మాత్రమే అనుమతి పొందిన ఓంశ్రీ బిల్డర్స్
– ప్రీలాంచ్ పేరుతో భువనతేజ ఇన్ఫ్రా అమ్మకాలు
– రెరా రిజిస్ష్రేషన్ ప్రదర్శించకుండానే టీఎంఆర్ కన్స్ట్రక్షన్స్
– రెరా కళ్లు తెరవడంతో వెలుగుచూసిన మోసాలు
– ఉల్లం‘ఫుునుల’కు రెరా షోకాజ్ నోటీసులు
– ఆందోళనలో కొనుగోలుదారులు
– వాస్తవం వెలుగుచూడటంతో రియల్టర్ల ఇరకాటం
– డబ్బులు వాపసు ఇవ్వాలని కొనుగోలుదారుల ఒత్తిడి
– నిబంధనలు పాటించకుండా మోసం చేశారంటూ ఆగ్రహం
– రియల్టీ కంపెనీలపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్న జనం
– సువర్ణభూమిపై కొనుగోలుదారుల మండిపాటు
– నమ్మించి మోసారని ప్లాట్ల కొనుగోలుదారుల ఆగ్రహం
– రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్న ఎల్లాపూర్ వెంచర్ బాధితులు
– రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్లాట్లు ఎలా అమ్మారంటూ బాధితుల ఫైర్
– రెరా నోటీసులతో చిక్కుల్లో రియల్టీ కంపెనీలు
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘డబ్బులెవరికీ ఊరకే రావు’ అంటాడు లలితా జ్యువెలర్స్ గుండాయన. కానీ చావు తెలివి ప్రదర్శిస్తే డబ్బులు ఊరకనే వస్తాయంటున్నాయి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు. మరి లలితా జ్యువెలర్స్ గుండాయన, అంత అమాయకంగా ఎలా చెప్పారు? అంటే బంగారం బిజినెస్ చేసే గుండాయనకు, భూముల వ్యాపారంలో అసలు కిటుకు తెలియదన్నమాట.
మా వెంచర్లో భూమి కొనండి. బంగారంగా లాభపడండి.. సువర్ణభూమి.. తరతరాలకు చెరగని చిరునామా. ఇలా ఆకర్షణీయమైన నినాదాలు.. రాంచరణ్ వంటి అగ్ర హీరోలు, కళాతపస్వి కె.విశ్వనాధ్, ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి ప్రముఖుల ప్రకటనతో కస్టమర్లను బుట్టలో పడేయడం, ఈ రియల్టీ కంపెనీల
ప్రత్యేకత. రంగు రంగుల బ్రోచర్లు, బ్రోకర్లకు అన్ని హంగుల ట్రిప్పులు, కోట్లాది రూపాయల ప్రచారంతో అమాయకులను ఆక ర్షించడమే వారి తెలివి. మరి.. ఇంత హడావిడి చేస్తున్న ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు.. రెరా నిబంధనలు పాటిస్తున్నాయా?
హెచ్ఎండిఏ పర్మిషన్ పేరుతో వ్యవసాయభూముల్లో కమర్షియల్ భవనాలు, వ్యాపారాలు చేస్తున్న ఈ కంపెనీలు, లే అవుట్లలో పేర్కొన్న నిబంధనలు పాటిస్తున్నాయా అంటే.. లేదు. పోనీ ఫాం ప్లాట్ల వ్యాపారాలకు అనుమతి ఉందా? నో. అవి కూడా ఉండవు.
మరి అధికారులు ఏం చేస్తున్నారంటే.. అదంతా ‘మామూలే’! ఇదీ హైదరాబాద్ న గర శివార్లలో, అమాయకుల అవసరాలే పెట్టుబడిగా.. రియల్ ఎస్టేట్ కంపెనీలు సాగిస్తున్న రియల్ దందా.
అసలు రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే.. ప్లాట్లను పప్పుబెల్లాల మాదిరిగా అమ్మేస్తున్న రియల్టీ కంపెనీల మోసాలు, ఆలస్యంగా వెలుగుచూసిన వైనం కొనుగోలుదారుల గుండెల్లో ఆందోళన రైలు పరిగెత్తిస్తోంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్‌రెరా) ఆలస్యంగా కళ్లు తెరచి, రియల్ కంపెనీలపై చర్యల కొరడా ఝళిపించడంతో రియల కంపెనీలు కలవరపడుతున్నాయి.
రెరా కళ్లు గప్పి.. ఇప్పటికే ప్లాట్లు అమ్మేసిన కంపెనీల పరిస్థితి ప్రమాదంలో పడింది. అయితే రియల్టీ కంపెనీల ప్రచారానికి మోసపోయి, ప్లాట్లు కొనేసిన బాధితులు తాము మోసపోయామని తెలుసుకుని నెత్తీనోరూ బాదుకుంటున్నారు. తమను ఇప్పుడు రాంచరణ్ రక్షిస్తాడా? అని ప్రశ్నిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలో ఎల్లాపూర్ గ్రామం తెలుసుకదా? అక్కడ లేక్‌వ్యూ పేరిట ఒక పెద్ద వెంచర్ ఉంది చూశారా? అది ఎవరిదో కాదు. మన హీరో రాంచరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న
‘సువర్ణభూమి’ది.. ఇంకా అర్ధం కాలేదా? కళాతపస్వి కె విశ్వనాధ్, ఎస్పీ బాలసుబ్రమణ్యం చాలాకాలం క్రితం టీవీ ప్రకటనలో కనిపించి మీరు కూడా సువర్ణభూమి ప్లాట్లు కొనమని చెప్పారే.. అదే ఇది. అయినా
అర్ధం కావడం లేదా? తరతరాలకు చెరగని చిరునామా అంటూ, బీచ్‌లో రాగయుక్తంగా పాడిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ నటించిన ‘సువర్ణభూమి’ రియల్ ఎస్టేట్ వెంచర్ అది. హమ్మయ్య. ఇప్పుడు అర్ధమైందా?
మరి ఇంతమంది సినిమా తారలు కొనమంటే, జనం కొనకుండా ఎందుకుంటారు? అందుకే ఎగబడి కొనేశారు. ఈ రియల్టీ సినిమా కంపెనీ వేషాలు, ఇంటర్వెల్ వరకూ బాగానే రక్తికట్టాయి. కానీ ఆ తర్వాత అటు కొనుగోలుదారులు-ఇటు అమ్మి సొమ్ము చేసుకున్న రియల్టీ కంపెనీకి, అసలు సినిమా కష్టాలు రెరా రూపంలో ఆరంభమయ్యాయి.
సహజంగా ఏ రియల్ కంపెనీ అయినా ప్లాట్లు అమ్ముకోవాలంటే రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అందులో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్లాట్లు అమ్ముకోవాలన్నది నిబంధన. ఆ రిజిస్ట్రషన్ నమోదయినట్లు సదరు కంపెనీ తమ ప్రచారంలో ప్రదర్శించాలి.
కానీ అలాంటి రిజిస్ట్రేన్ ఏమీ లేకుండానే, సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎంచక్కా ‘లేక్‌వ్యూ’ పేరుతో.. సంగారెడ్డి జిల్లా పటన్‌చెరు సమీపంలోని ఎల్లాపూర్‌లో ప్లాట్లు అమ్మేసింది. బహుశా హీరో
రాంచరణ్ తమకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు కాబట్టి, పిచ్చి జనాలకు ఇవన్నీ తెలియదనుకుంది కామోసు.
అయితే జనం పిచ్చివాళ్లయినా.. రెరా పిచ్చిది కాదుకదా? ముందు ఇవన్నీ దానికి తెలిసినా- ఒకవేళ తెలియకపోయినా, ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తారు కదా? అప్పుడయినా మేల్కొనక తప్పదు కదా? యస్. రెరా ఇప్పుడు అదే పనిచేసింది. రిజిస్ట్రేషన్ లేకుండానే ఎల్లాపూర్‌లో ప్లాట్లు ఎలా అమ్మారంటూ, రెరా సువర్ణభూమిపై తాజాగా షోకాజ్ నోటీసు కొరడా ఝళిపించింది.
దానితో సువర్ణభూమి సంస్థ.. రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే ప్లాట్లు అమ్మేసిందని తెలుసుకున్న కొనుగోలుదారులు, నెత్తీనోరూ కొట్టుకుంటున్న పరిస్థితి. సువర్ణభూమి తరతరాల చెరగని మోసం చేసిందంటూ మండిపడుతున్నారు. తమను మోసం చేసిన సువర్ణభూమిపై చర్యలు తీసుకుని, తమ డబ్బు తమకు ఇప్పించాలంటూ రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నారు. మరి కొందరు రెరా షోకాజ్ నోటీసుల ఆధారంగా కోర్టుకెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంతో సువర్ణభూమి భూముల వ్యాపారానికి ప్రమాదం వచ్చి పడింది. మీడియా ప్రకటనలతో జనాలను నమ్మించిన, తమ గుట్టును రెరా రట్టు చేయడం సువర్ణభూమిని ఖంగుతినిపించింది. ఈ పరిణామాలు వందల ఎకరాలు కొని మార్కెటింగ్ చేస్తున్న తమను, ఎక్కడ పుట్టిముంచుతాయోనన్న ఆందోళన సువర్ణభూమికి అనివార్యంగా మారింది. ఫలితంగా కొనుగోలుదారులకు ఏం సమాధానం చెప్పాలో తెలియని ఆందోళనకర పరిస్థితి.
నిజానికి ఫాంప్లాటింగ్ చేస్తున్న సువర్ణభూమిపై, ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం, రామనాధ్గూడ సర్వే నెంబర్ 67 అమ్మకాల వ్యవహారంపై ఇప్పటికే విమర్శలు, వివాదం నడుస్తోంది. అక్కడ 5 గుంటలు సేల్‌డీడ్ ప్రకారం 29 వేలు చూపించారు.
ఆ ప్రకారంగా సర్కారుకు దానిపై రిజిస్ట్రేషన్ రూపంలో వచ్చే ఆదాయం 2,838 రూపాయలు మాత్రమే. కానీ అక్కడ రోడ్డు లేదు. ఎవరైనా ప్లాట్లు, వ్యవసాయభూమి ఉన్నప్పుడు రోడ్లు చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే దానిని చూపించి, కొనుగోలుదారు మరొకరికి అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది.
అయితే సువర్ణభూమి మాత్రం, అలాంటివేమీ లేకుండానే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించడం వివాదానికి దారితీసింది. అంటే..సదరు కొనుగోలుదారు విధిలేక.. అ భూమిని కారుచౌకగా, మళ్లీ సువర్ణభూమికే అమ్ముకోక తప్పదన్న మాట. ఇదో వ్యాపార ఎత్తుగడ.
సువర్ణభూమి ఫాంప్లాట్ల అమ్మకాల్లో వందల ఎకరాలే ఉన్నాయి. కానీ సేల్‌డీడ్‌లో మాత్రం కంపెనీకి ఆ స్థాయిలో భూములే లేవ న్నది ఒక ఆరోపణ. మరి రైతుల దగ్గర నుంచి ఎవరు, ఎంతకు కొన్నారు? ఎంతకు అమ్ముతున్నారన్నది బ్రహ్మరహస్యంగా మారింది. లేఅవుట్లుగా చూపిస్తున్న ప్లాట్లను, వ్యవసాయభూములుగా రిజిస్ష్రేషన్లు చేస్తున్నారన్నది మరో ఆరోపణ.
హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం.. రోడ్లు సదుపాయాలున్నట్లు, సువర్ణభూమి బ్రోచర్లలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అనుమతులు లేకుండా ఆర్గానిక్, అగ్రికల్చర్ ఫాం, వీకెండ్ హోమ్స్ పేరుతో ప్లాట్లు అమ్మకాలు చేస్తున్న వైనంపై ఇప్పటికే అనేక ఆరోపణలున్నాయి. అయినా రెవిన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై , సహజంగానే అనుమానాలు వ్యక్యమవుతున్నాయి. సువర్ణభూమి అంత ప్రఖ్యాత కంపెనీ, భూ వ్యాపారాలు ఎలా చేస్తుందో రెవిన్యూ అధికారులకు తెలియదనుకుంటే అమాయకత్వమేనంటున్నారు.
సహజంగా వ్యవసాయభూముల్లో నిర్మాణాలకు అనుమతించరు. కానీ సువర్ణభూమి మాత్రం తమ బ్రోచర్లలో క్లబ్ హౌస్ నిర్మాణాలు, స్పా నిర్మాణాలు చూపిస్తున్నారు. వాటికి ఎవరు అనుమతులిచ్చారన్నది మరో ప్రశ్న. పోనీ వ్యవసాయ భూమిని కమర్షియల్‌గా కన్వర్ట్ చేశారా? ఆ మేర కు ప్రభుత్వానికి డబ్బు
చెల్లించారా? ఒకవేళ చెల్లిస్తే మళ్లీ అక్కడ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఎలా చేస్తారు? అన్నది మరో సందేహం. అసలు కొనుగోలుదారులు.. వాటి సేల్‌డీడ్‌లో తాము కొన్న స్థలానికి, దారి ఉందో లేదోనని అన్వేషిస్తే, సువర్ణభూమి అసలు అజెండా అర్ధమవుతుందని రియల్ఎస్టేట్ బ్రోకర్లు చెబుతున్నారు. మరిప్పుడు.. ప్లాట్లు కొనమని ప్రోత్సహించిన హీరో రాంచరణ్.. ఎల్లాపూర్‌లో సువర్ణభూమి ప్లాట్లు కొని మోసపోయిన వారిని రక్షిస్తారా?
ఇక రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రదర్శించకుండానే బ్రోచర్లు వేసిన టిఎంఆర్ నిర్మాణ సంస్థకు రెరా నోటీసులిచ్చింది. రెరా అనుమతి లేకుండా రామచంద్రాపురం మండలం ఉస్మాన్‌నగర్‌లో రాధే గ్రూప్ రాధేపనోరమా ప్రాజెక్టుతో ప్రారంభించిన ప్రీలాంచింగ్ అమ్మకాలపై రెరా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అనుమతి తీసుకోకుండానే ప్రీలాంచింగ్ పేరుతో అమ్మకాలు ఎలా చేస్తారని రెరా రాధేగ్రూప్ కంపెనీకి షోకాజ్ నోటీసులిచ్చింది.
ఓంశ్రీ సిగ్నెట్ పేరుతో.. ఓంశ్రీ బిల్డర్స్ నాలుగు బ్లాక్ నిర్మాణాలకు మాత్రమే రెరా నుంచి అనుమతి తీసుకుంది. కానీ ఆ సంస్థ అదనపు నిర్మాణాలు చేయడంపై ఆగ్రహించిన రెరా ఆ కంపెనీకి షోకాజ్ నోటీసులిచ్చింది. అలాగే ప్రీలాంచింగ్ అమ్మకాలు చేస్తున్న భువనతేజ ఇన్ఫ్రాకు సైతం రెరా షోకాజ్ నోటీసులిచ్చింది.
ఈవిధంగా రెరా షోకాజులు ఇచ్చిన కంపెనీల నుంచి, భూములు కొన్న తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన జనంలో మొద లయింది. ఆ కంపెనీల నుంచి కొన్న ప్లాట్లు, మళ్లీ అమ్ముకోవాలంటే వీలుంటుందా లేదా అన్నదే వారి అసలు ఆందోళన.