జీఎస్టీ రిటర్నులు, ఇసుక అమ్మకాలపై జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ లెక్కలపై మంత్రి పెద్దిరెడ్డి ఏం చెబుతాడు?
– ఇసుక తవ్వకాలు..ఆదాయం.. జేపీ సంస్థ జీఎస్టీ రిటర్నులు సహా మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణతోనే జగన్ రెడ్డి, పెద్దిరెడ్డిల ఇసుకమాఫియా అవినీతి బయటపడుతుంది
• జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ క్వార్టర్లీ ఆడిట్ రిపోర్టులపై నోరెత్తని మంత్రి పెద్దిరెడ్డి… జీఎస్టీ రిటర్నులపై స్పందిస్తాడా?
• ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి రెండేళ్లకు రూ.1528 కోట్లు కట్టాల్సిన జేపీ పవర్ వెంచర్స్ సంస్థ జీఎస్టీ రిటర్న్స్ లో రూ.1421 కోట్ల టర్నోవర్ చూపించడం ఏమిటి?
• ఇసుక తవ్వకాలతో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థకు రెండేళ్లలో రూ.107 కోట్ల నష్టం వచ్చిందా? నష్టపోయిన సొమ్ముని జేపీ సంస్థ జేబులో నుంచి తీసి కడుతుందా?
• 2023 జనవరిలో కేవలం 43 వేల టన్నులు ఇసుక మాత్రమే అమ్మినట్టు, రూ.2కోట్ల ఆదాయమే వచ్చినట్టు జేపీ పవర్ వెంచర్స్ సంస్థ చెప్పడం విచిత్రాలకే విచిత్రం కాదా?
• జయప్రకాశ్ పవర్ వెంచర్స్ 2021-22లో 11 నెలలకు జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటే, 5 నెలలకే ఫైల్ చేసి, 6 నెలలకు సున్నాలు పెట్టింది.
• 2022-23లో 12నెలలకు గాను 10 నెలలే జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేశారు. ఏప్రియల్, ఆగస్ట్ నెలలకు సున్నాలు పెట్టారు.
• ఈ లెక్కన రెండేళ్లలో 8 నెలల్లో జేపీ సంస్థ రాష్ట్రంలో ఒక్క కేజీ కూడా ఇసుక అమ్మలేదా? జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లెక్కలన్నీ బోగస్ లెక్కలే.
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
గత నాలుగేళ్లలో జగన్ రెడ్డి ఇసుకమాఫియా సాగించిన రూ.40వేల కోట్ల ఇసుక దోపిడీపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడిగితే ప్రభుత్వపెద్దలు మౌనం వహించారని, కొద్దిరోజుల క్రితం జేపీ పవర్ వెంచర్స్ క్వార్టర్లీ ఆడిట్ రిపోర్టుల్లోని అంశాల ఆధారంగా తాను లేవనెత్తిన ప్రశ్నలపై కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
“ రాష్ట్రంలోని ఇసుక రీచ్ లను జిల్లాలవారీగా తనపార్టీ నేతలకు పంచిపెట్టిన జగన్ రెడ్డి, సామంతరాజుల ద్వారా నెలనెలా తాడేపల్లి ప్యాలెస్ కు కప్పం వచ్చేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నాడనేది రాష్ట్రమంతా విదితమే. మొన్న మీడియా మందుకొచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జేపీ పవర్ వెంచర్స్ సంస్థ క్టార్టర్లీ ఆడిట్ రిపోర్టుల్లోని అంశాలపై మాట్లాడతారని అనుకుంటే, ఉత్తుత్తి ప్రజంటేషన్ తో తన ప్రెస్ మీట్ మొత్తా న్ని కామెడీ షోగా మార్చాడు.
తనకు అలవాటు లేని పనులు చేస్తే ఇలానే అభాసుపా లు అవాల్సి వస్తుందని పెద్దిరెడ్డికి మొన్నటి ప్రెస్ మీట్ తో బాగా అర్థమై ఉంటుంది. చంద్రబాబుని చూసి, ఆయనకంటే మిన్నగా ఏదో చేయాలనుకొని చివరకు సర్కస్ ఫీట్లతో పెద్దిరెడ్డి మీడియా ముందు భంగపడ్డాడు. జేపీ పవర్ వెంచర్స్ సంస్థ సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడంపై విలేకరుల ప్రశ్నలకు కూడా పెద్దిరెడ్డి ఎవరో ఎవరికో సబ్ కాంట్రాక్ట్ ఇస్తే మాకేంటి సంబంధమంటూ అడ్డగోలుగా మాట్లాడాడు.
చంద్రబాబు ప్రశ్నలకు సమాధానం చెప్పరేంటన్న విలేకరుల ప్రశ్నలకు కూడా పెద్దిరెడ్డి స్పందించలేదు
గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు సంబంధించిన బిల్లులు జయ ప్రకాశ్ పవర్ వెంచర్స్ పేరుతో ఇస్తున్నారని, వాళ్లు అసలు ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నారా..జీఎస్టీ చెల్లింపులు చేస్తున్నారా అని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పరేంటన్న విలేకరుల ప్రశ్నల్ని కూడా పెద్దిరెడ్డి దాటవేశారు. జీఎస్టీ చెల్లింపులతో తమకేం సంబంధమని పెద్ది రెడ్డి చెప్పడం నిజంగా సిగ్గుచేటు.
ఇసుక అనేది ప్రజల సంపద.. దానిపై ఒక కంపెనీ వ్యాపారం చేస్తున్నప్పుడు, ఆ సంస్థ సక్రమంగా పన్నులు కడుతుందో, లేదో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మంత్రి పెద్దిరెడ్డిపై ఉంది. వాస్తవాలు అన్నీ తెలిసి పెద్దిరెడ్డి కావాలనే బుకాయించారని ఆయన మాటల్ని బట్టి స్పష్టంగా అర్థమైంది.
జయ ప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ ఇసుక తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వానికి ఎప్పుడు ఎంతెంత ట్యాక్స్ కట్టిందనే వివరాలు మాకు అందిన సమాచారం ప్రకారం ఇలా ఉన్నాయి. వీటిపై పెద్దిరెడ్డి తక్షణమే జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ జీఎస్టీ రిటర్నుల చెల్లింపులు.. సున్నాలపై పెద్దిరెడ్డి ఏం సమాధానం చెబుతాడు?
2021-22 ఆర్థిక సంవత్సరంలో మాకు అందిన సమాచారం ప్రకారం జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ అవుట్ వర్డ్ టాక్స్ బుల్ సప్లైస్ కింద చూపించిన టర్నోవర్ రూ.637,65,65,192లు (ఆరువందల ముప్పై ఏడుకోట్ల అరవై ఐదు లక్షల అరవై ఐదువేల నూట తొంబైరెండు రూపాయలు). అలానే 2022-23 సంవత్సరంలో చూపిన టర్నోవర్ రూ.783,72,55,114లు (ఏడు వందల ఎనభై మూడుకోట్ల డెబ్బై రెండు లక్షల యాభై ఐదువేల నూట పద్నాలుగు).
జేపీ పవర్ వెంచర్స్ సంస్థ జీఎస్టీ రిజిస్ట్రేషన్ నంబర్ 37AAA CJ 6297K1Z0. ఈ జీఎస్టీ నంబర్ ద్వారా జయ ప్రకాశ్ పవర్ వెంచర్స్ వారు రెండేళ్లకు చూపిన మొత్తం టర్నోవర్ రూ.1421,38,20, 306లు (పద్నాలుగు వందల ఇరవై ఒక్క కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఇరవై వేల మూడు వందల ఆరు). జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ రాష్ట్రంలో ఇసుకతవ్వకాలకు సంబంధించి రెండేళ్లకు ఏపీ ప్రభుత్వానికి చెల్లిస్తామన్న సొమ్ము రూ.1528.80 కోట్లు.
కానీ వాళ్లు చూపించిన టర్నోవర్ రూ.1421.38 కోట్లు. ఈ లెక్కన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారు రాష్ట్రంలో ఇసుక వ్యాపారం చేసి రెండేళ్లలో రూ.107కోట్లు నష్టపోయా రన్నది జీఎస్టీ లెక్కల ద్వారా అర్థమవుతోంది. రాష్ట్రంలో ఇసుక వ్యాపారం చేసి, ఒక సంస్థ రెండేళ్లలో రూ.107 కోట్లు నష్టపోయిందంటే ఈ రోజున బడికి వెళ్లే పసిపిల్లాడు కూడా నమ్మే పరిస్థితి లేదుజ ఇసుక వ్యాపారంచేసి నష్టపోయారని పెద్దిరెడ్డి చెబితే ప్రజలు నమ్మాలి.
2021 మే నెలలో రాష్ట్రంలో ఇసుక తవ్వకాల టెండర్ దక్కించుకున్న జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 11 నెలలకు జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటే, 5 నెలలకే ఫైల్ చేశారు. 6 నెలలకు సున్నాలు పెట్టారు. 2021 మే, జూన్, జులై, ఆగస్ట్..2022 జనవరి, ఫిబ్రవరి నెలలకు సున్నాలు చూపించారు. ఈ లెక్కన ఆరునెలల్లో జేపీ సంస్థ రాష్ట్రంలో ఒక్క కేజీ కూడా ఇసుక అమ్మలేదా?
ఈ లెక్కలు ప్రజలు నమ్మాలా? 2022-23లో 12నెలలకు గాను 10 నెలలే జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేశారు. ఏప్రియల్, ఆగస్ట్ నెలలకు సున్నాలు పెట్టారు. సంవత్సరంలో 12 నెలలు, 365 రోజులు విచ్చలవిడిగా ఇసుక అమ్మకాలు జరుపు తూ, ఈ విధంగా సున్నాలు పెట్టడంలోని ఆంతర్యం ఏమిటో పెద్దిరెడ్డే చెప్పాలి. జీఎస్టీ రిటర్నులకు సంబంధించి సున్నాలు చూపిన జయప్రకాశ్ వెంచర్స్ సంస్థ తీరుకి, క్షేత్రస్థాయిలో జరిగిన ఇసుకతవ్వకాలు, అమ్మకాలకు ఎక్కడా పొంతనలేదు.
2023 జనవరిలో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ కేవలం 43,506 టన్నుల ఇసుకమాత్రమే అమ్మినట్టు, రూ. 2,06,65,476ల టర్నోవర్ మాత్రమే వచ్చినట్టు చెప్పడం విచిత్రాలకే విచిత్రం కాదా?
2021-22 మరియు 2022-23 సంవత్సరాల్లో వివిధ నెలల్లో జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారు చూపించిన టర్నోవర్ ప్రజల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయక తప్పదు . ఉదాహరణకు 2021 నవంబర్లో కేవలం రూ.58కోట్ల టర్నోవర్ మాత్రమే ఇసుక అమ్మకాలద్వారా రాష్ట్రంలో సాధించినట్టు, అదే సంవత్సరం సెప్టెంబర్లో కేవలం రూ.62.9కోట్లు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగినట్టు జయప్రకాశ్ సంస్థ తమ జీఎస్టీ రిటర్నుల్లో పేర్కొనడం అత్యంత విడ్డూరం.
ఇంకా ఘోరం ఏమిటంటే 2023 జనవరిలో రాష్ట్రంలో ఇసుక అమ్మకాలు అతి తక్కువగా రూ.2,06,65,476లు మాత్రమే జరిగిన ట్టు అంటే టన్ను రూ.475 చొప్పున లెక్కగడితే కేవలం 43,506 టన్నులు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగాయని చెప్పడం ప్రజలు నోళ్లు వెళ్లబెట్టేలా చేస్తుంది.
జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ ఫైల్ చేసిన జీఎస్టీ రిటర్న్స్ లో ఇన్ వోర్డ్ సప్లైస్ అనే కాలమ్ కూడా మెన్షన్ చేశారు. ఇతరుల నుంచి రూ.1372 కోట్ల విలువైన ఇసుక కొనుగోలు చేసినట్టు చెప్పారు. 2021-22లో రూ.725 కోట్లు, 2022-23లో రూ.647 కోట్లు మొత్తంగా రూ.1372కోట్లకు కొనుగోలు చేశామని చెప్పారు. అంటే ఆ సంస్థ ఇసుకతవ్వకాలు మరో సంస్థకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందనేది కూడా నిజం. సబ్ కాంట్రాక్ట్ సంస్థ తవ్వకాలు జరిపితే, వారినుంచి జేపీసంస్థ ఇసుక కొనుగోళ్లు జరిపినట్టు వ్యవహారం నడిపారు. మైనింగ్ శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఈ లెక్కలపై ఏం సమాధానం చెబుతాడు?
మంత్రి పెద్దిరెడ్డి పక్కన కూర్చొని వెకిలి నవ్వులు నవ్వడం కాదు.. టీడీపీప్రభుత్వం రాగానే ఒక్కొక్కరి లెక్క తేలుస్తాం. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ నెలవారీగా చేసిన జీఎస్టీ రిటర్నులపై, సదరు సంస్థ వేరే సబ్ కాంట్రాక్ట్ సంస్థ వద్ద ఇసుక కొన్నట్టు చెప్పడంపై మంత్రి పెద్దిరెడ్డి, జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని నిలదీస్తున్నాం.
ప్రభుత్వ కాంట్రాక్ట్ పొందిన సంస్థ జీఎస్టీ రిటర్నుల్లో నెలల తరబడి సున్నాలు చూపుతుంటే ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించదా? వాస్తవాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత పాలకులపై లేదా?
ప్రభుత్వ కాంట్రాక్ట్ పొందిన ఒక సంస్థ జీఎస్టీ రిటర్నుల్లో సున్నాలు పెడుతుంటే, దానిలో ని వాస్తవాలు తేల్చాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానికి లేదా? జీఎస్టీ చెల్లింపుల్లో రాష్ట్ర వాటా (SGST) ఉన్నప్పుడు, ఆ వాటా చెల్లించకుండా ఒక సంస్థ తప్పుడు లెక్కలు చెబుతున్నప్పుడు వాటిపై నిజానిజాలు నిగ్గుతేల్చి, సదరు సంస్థను ప్రశ్నించాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వానికి లేదా? జేపీ పవర్ వెంచర్స్ సంస్థ ఏం ఫైల్ చేస్తే అదే నిజమని నమ్ముతారా?
జయప్రకాశ్ పవర్ వెంచర్స్ వారు జగన్ రెడ్డి బినామీ సంస్థ కాబట్టి, జీఎస్టీ రిటర్నుల్లో ఎన్నిసున్నాలు పెట్టినా పట్టించుకోరా? ఈ సున్నాల వ్యవహారం వెనుక కచ్చితంగా జగన్ ప్రభుత్వ ప్రమేయం కూడా ఉందనేది సుస్పష్టం. కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగులు.. ఉద్యోగసంఘం నేతలపై కక్షసాధింపులకు పాల్పడటం కాదు.. ఆ విభాగానికి సంబంధించి జరిగే రిటర్నుల దాఖల్లో ఏ కంపెనీ, ఎటువంటి తప్పుడు పనులు చేస్తుందో, ఎవరు వారికి సహకరిస్తున్నారో తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?
జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ రెండేళ్లలో చూపించిన టర్నోవర్ రూ.1421.38 కోట్లు మాత్రమే. అంటే కేవలం 2కోట్ల 99 లక్షల టన్నుల ఇసుక మాత్రమే అమ్మినట్టు చెబుతున్నారు. అంటే సంవత్సరానికి కోటిన్నర టన్నులు కూడా అమ్మలేదంటున్నా రు. మంత్రి పెద్దిరెడ్డేమో సంవత్సరానికి తక్కువలో తక్కువగా రూ. 2 కోట్ల టన్నులు ఇసుక అమ్మకాలు రాష్ట్రంలో జరుగుతున్నట్టు చెబుతున్నాడు.
వాస్తవానికి మా నాయకులు చంద్రబాబు చెప్పినట్టు ప్రతిసంవత్సరం పదికోట్ల టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. తన ధనదాహంతో జగన్ రెడ్డి భారీ యంత్రాలతో ఇష్టానుసారం రీచ్ లలో కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలు జరపబట్టే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ 110 రీచ్ లలో ఇసుక తవ్వకాలు నిలిపేయాలని ఆదేశించింది.
జయప్రకాశ్ పవర్ వెంచర్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్, జీఎస్టీ రిటర్న్స్ సహా రాష్ట్రంలో కొన్ని వందల రీచ్ లలో జరుగుతున్న అక్రమ ఇసుకతవ్వకాలపై తక్షణమే సీబీఐ విచారణ జరగాలి, 40 వేలకోట్లు దిగమింగిన ఇసుకాసురుడి మాఫియా ముఠా ఆటకట్టించాలి. రాష్ట్రంలో ఇసు క తవ్వకాలన్నీ ఎంతో పారదర్శకంగా జరుగుతున్నాయని బుకాయిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి సీబీఐ విచారణ జరిపించమని కేంద్రాన్ని కోరే దమ్ము, ధైర్యం ఉందా” అని పట్టాభి సవాల్ చేశారు.