– ఓట్ల నమోదు, తొలగింపుకు సంబంధించి బూత్ ల సమాచారం, బీఎల్వోల వివరాలు ప్రతిపక్షపార్టీలకు ఇవ్వకుండా ప్రభుత్వం పథకం ప్రకారం దురుద్దేశంతో వ్యవహరిస్తోంది
• బూత్ నెంబర్, బీఎల్వోల సమాచారం లేకుండా ఫామ్ – 6, ఫామ్-8 దరఖాస్తులు నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్నాయి.
• ఇలా వచ్చే దరఖాస్తులు అన్నీ దొంగఓట్ల నమోదులో భాగమనే అనుమానం కలుగుతోంది
• బూత్ ల వివరాలు, బీఎల్వో సమాచారం లేకుండా కేవలం చిరునామాతో ఓటుకు దరఖాస్తు చేస్తే, సదరు ఓటర్ ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది?
• ప్రభుత్వం కావాలనే ఒక పథకం ప్రకారం దురుద్దేశంతో ఇవన్నీ చేస్తోంది
– టీడీపీ హెచ్.ఆర్.డీ విభాగం చైర్మన్ బూర్ల రామాంజనేయులు
రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా కొత్తగా నమోదయ్యే ఓటర్లు, ఓటుబదిలీ సమాచారం వివరాలు ప్రతిపక్షపార్టీలకు తెలియకుండా అధికార పార్టీ చేస్తోందని, ఓటర్ల నుంచి వచ్చే ఫామ్-6, ఫామ్-7, ఫామ్-8, ఫామ్-9 దరఖాస్తుల సమాచారం దాస్తోందని, బీఎల్వోల వివరాలు, బూత్ నెంబర్లు తెలియచేయడం లేదని టీడీపీ హెచ్.ఆర్.డీ విభాగం ఛైర్మన్ బీ.రామాంజనేయులు తెలిపారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
బూత్ నెంబర్లు, బీఎల్వోల సమాచారం లేకుండా కేవలం ఇంటి చిరునామాలతో కూడిన దరఖాస్తులపై ప్రతిపక్షపార్టీలు ఎలా విచారిస్తాయి?
“ కొత్తగా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే యువ ఓటర్ల సమాచారం తెలిస్తే, మరీ ముఖ్యంగా బూత్ లవారీ సమాచారం తెలిస్తే ప్రతిపక్ష పార్టీలు సదరు ఓటర్లు ఆయా బూత్ లలో ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. వీఆర్వోలు రాజకీయపార్టీలకు ఇచ్చే ఓటర్ల జాబితాల్లో ఫామ్-6 దరఖాస్తుల్లో ఏ బూత్ నుంచి, ఏ బీఎల్వో ద్వారా కొత్త ఓటర్ ఓటుకు దరఖాస్తు చేసుకున్నాడనే సమాచారం ఇవ్వడం లేదు.
క్షేత్రస్థాయిలో నివాసమున్నారో లేదో తెలియకుండా తప్పుడు సమాచారంతో ఓటుకు దరఖాస్తు చేసుకుంటే, దానిపై అభ్యంతరం వ్యక్తంచేసి, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయవ చ్చు. కేవలం ఇంటి చిరునామాతో ఓటుకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పి 400మంది పేర్లు ఒక మండలంలో ఇస్తే వారంతా ఏ బూత్ లలో ఎక్కడున్నారో, ఏ బీఎల్వోను కలిస్తే వారి సమాచారం వస్తుందో ఎలా తెలుస్తుంది. రాజకీయ పార్టీలను ఇబ్బంది పెట్టేలా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారో ఎన్నికల అధికారులు స్పష్టం చేయాలి.
ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశం లేకపోతే, బీఎల్వోల వివరాలు ఎందుకు రాజకీయ పార్టీలకు ఇవ్వడంలేదు? కొత్తగా నమోదయ్యే ఓటర్లు ఏ బూత్ ల పరిధిలో ఉన్నారో తెలియకుండా, వారు ఎవరు…ఎక్కడి వారు…వారి అర్హతలేమిటనే వివరాలు ఎలా తెలుస్తాయి? కొన్నిచోట్ల బీఎల్వోలకు కూడా వారి సమాచారం తెలియకుండా అధికార పార్టీ వారు ఎందుకు దాస్తున్నారు? ఈ వ్వవహారమంతా గమనిస్తే ఓటుహక్కు కల్పించాలని కోరుతూ చేసుకునే దరఖాస్తులు సరైనవి కావని అనిపించదా?
ఓట్ల బదిలీకి సంబంధించిన సమాచారం కూడా దాస్తున్నారు
ఇప్పటికైనా బూత్ నంబర్ల వారీగా, బీఎల్వోల పేర్లు, నంబర్లతో కూడిన ఫామ్-6, ఇతర జాబితాలు ఇచ్చేలా చూడాలని ఎన్నికల సంఘానికి సూచిస్తున్నాం.ప్రతిపక్ష పార్టీలకు సరైన సమాచారం ఇవ్వకుండా గంపగుత్తగా ఇచ్చే ఓటర్ల వివరాలు పరిశీలిం చడం సాధ్యంకాదు. ఇదే పద్ధతి అనుసరిస్తే కచ్చితంగా ప్రభుత్వం దురుద్దేశంతోనే చేస్తున్నట్టు భావించాల్సి వస్తుంది.
బూత్ నెంబర్, బీఎల్వో పేరు ఉంటే ఫామ్ – 6 దరఖాస్తుదారుని వివరాలు తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఫామ్ -8 (ఓటు బదిలీ దరఖాస్తు) లో కూడా ఏ బూత్ నుంచి ఏ బూత్ కు ఓటు మార్చుకుంటున్నారనే వివరాలు చెప్పడంలేదు. కేవలం చిరునామాలిచ్చి సరిపెడుతున్నారు. కొత్తగా నమోదయ్యే ఓటర్ వివరాలను బీఎల్వోలు సేకరించే సందర్భంలో ఫామ్-6 దరఖాస్తుపై బూత్ నంబర్ వేయడం లేదు.
ఈ చర్యలన్నీ గమనిస్తే ప్రభుత్వం దొంగఓట్లు చేర్చడం, టీడీపీసానుభూతిపరుల ఓట్లు తొలగించడంపై ఎక్కువగా దృష్టిపెట్టినట్టు అర్థమవుతోంది. ఒక పథకం ప్రకారం కావాల నే ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేస్తూ, తాము అనుకున్నవిధంగా అధికారపార్టీ వారు వ్యవహరిస్తున్నారు. తాము లేవనెత్తిన అంశాలపై ఎన్నికలసంఘం తక్షణమే దృష్టి పెట్టి, క్షేత్రస్థాయిలో తప్పిదాలు జరక్కుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
రాష్ట్రవ్యాప్తంగా కోటి 60 లక్షల ఇళ్లుంటే, 3కోట్ల 99లక్షల 88వేల ఓట్లున్నాయి. 45,951 మంది బీఎల్వోలు ఉన్నారు. ఒక నియోజకవర్గంలో దాదాపు 300మంది బీఎల్వోలు ఉంటారు. వారిపేర్లు, ఫోన్ నంబర్లు ఇవ్వకుండా, ప్రతిపక్ష పార్టీలవారు వారితో సంప్రదిం చడం ఎలాసాధ్యమవుతుంది? ఓటర్ల జాబితా పరిశీలన, ఓటర్ల వివరాలు ప్రతిపక్షపార్టీలకు తెలియకుండా చేసి, తాము అనుకున్నవిధంగా పథకం ప్రకారం ఎన్నికల్లో గట్టెక్కాలన్న దరుద్దేశంతోనే అధికారపార్టీ ఇలా వ్యవహరిస్తోంది.” అని రామాంజనేయులు స్పష్టం చేశారు.