-విజయభేరిలో సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటిస్తారు
-అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం
-టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
రాజకీయాలకు అతీతంగా సోనియా గాంధీకి స్వాగతం పలుకుదామని మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థి, నోరుద్యోగులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తుక్కుగూడలో విజయభేరి సభ ఏర్పాట్లను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ తో కలిసి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయభేరిలో సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటిస్తారన్నారు. ఆనాడు తెలంగాణ ఇస్తానని కరీంనగర్ సభలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు సోనియమ్మ. అదే తరహాలో విజయభేరిలో ప్రకటించే ఆరు గ్యారంటీలను నెరవేరుస్తారని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.
కుటిల రాజకీయాలతో కాంగ్రెస్ సభను జరగకుండా చేయాలనుకున్నారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కానీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ సభ కోసం రైతులు ముందుకొచ్చి స్థలాన్ని ఇచ్చారన్నారు. సోనియా గాంధీ పాల్గొంటున్న ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోనియా గాంధీపై కేటీఆర్ వ్యాఖ్యలు అహంకారపూరితమని రేవంత్ రెడ్డి విమర్శించారు. అధికారమదం తలకెక్కి కేటీఆర్ అలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్ కు సరైన సమాధానం చెబుతారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అత్యంత అవినీతి ప్రభుత్వం బీఆరెస్ ప్రభుత్వం : కేసీ వేణు గోపాల్
దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం బీఆరెస్ ప్రభుత్వం అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. శుక్రవారం తుక్కుగూడలో విజయభేరి సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి, ఇచ్చిన హామీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారు కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని వేణుగోపాల్ విమర్శించారు. బీజేపీ పాలనలో జాతీయత ఎక్కడుందని ప్రశ్నించారు.
రేపు మధ్యాహ్నం 2 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమవుతుందని వేణుగోపాల్ తెలిపారు. నాలుగు రాష్ట్రాల కాంగ్రెస్ సీఎం లతో సహా 90 మంది ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంతో తెలంగాణా రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయన్నారు. ఆదివారం ఉదయం 10.30కి ఎక్స్ టెండేడ్ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంటుందన్నారు. తర్వాత సాయంత్రం 5గంటలకు విజయభేరి బహిరంగ సభ ఉంటుందని అందులో 6 గ్యారంటీలను సోనియా గాంధీ విడుదల చేస్తారన్నారు.
తెలంగాణలోనూ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే : జైరామ్ రమేష్
భారత్ జోడో యాత్ర తరువాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అదే విధంగా తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం తుక్కుగూడలో విజయభేరి సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయభేరి సభలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ప్రకటిస్తామన్నారు. ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలన సాగుతోందని రమేష్ విమర్శించారు.