చంద్రబాబు ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ ఆపలేరని సి ఓటర్ సర్వే స్పష్టం
అక్రమ కేసులో అరెస్టు తరువాత, జనసేనతో పొత్తు కుదిరాక తెదేపా అధినేతకు అనూహ్యంగా పెరిగిన ప్రజాదరణ
స్కిల్ డెవలప్మెంట్ స్కీం స్కామ్ లో చంద్రబాబు 371 కోట్లను కొట్టేస్తే… అన్ని సెంటర్లలో ఎక్విప్మెంట్ ఎలా వచ్చింది?
చంద్రబాబును 90 రోజులు జైల్లో ఉంచాలని… రామోజీరావు, లోకేష్ లను అరెస్ట్ చేయాలని అధికారులకు జమోరె దిశా నిర్దేశం చేశారట…!
అధికారులు.. తస్మాత్ జాగ్రత్త… తప్పు చేశారో మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు
ఈ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం కలే
రాష్ట్రంలో రాజ్యాంగం అమలు కోసం తెదేపా ఎంపీలతో కలిసి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశా
ఋషికొండకు గుండు కొట్టి నిర్మించిన భవనాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చి వేస్తాం
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన కూటమి ఘన విజయం సాధించడం ఖాయం. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కాకుండా ఎవరు అడ్డుకోలేరు. స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో స్కామ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన తర్వాత, జనసేనతో పొత్తు కుదిరాక చంద్రబాబుకు అనూహ్యంగా ప్రజాధరణ పెరిగిందని తాజాగా సి ఓటర్ విడుదల చేసిన సర్వేలో వెల్లడైందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు తెలిపారు.
తిరుమలకు ఏ ముఖ్యమంత్రి అయినా సతీ సమేతంగా వెళ్లి పట్టు వస్త్రాలను సమర్పించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఒక్కరే వెళ్లి, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. నెత్తిన అక్షితలు వేస్తే అదేదో టన్నుల కొద్ది బరువును మోపినట్లుగా అప్పటికప్పుడే నెత్తిన ఉన్న అక్షితలను దులుపుకోవడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ భూమరాంగ్ అయ్యిందన్న ఆయన, ఒక అబద్ధాన్ని పదే పదే పనికిమాలిన వ్యక్తుల ద్వారా చెప్పించడం వల్ల నిజం చేయాలని చూస్తున్నారు. సాక్షి మీడియాలో, దినపత్రికలో తప్పుడు కథనాలను ప్రసారం చేస్తూ రాస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో పస లేదు. కేవలం చంద్రబాబు నాయుడుని మానసికంగా వేధించి, ఆయన స్తైర్యాన్ని దెబ్బతీయాలన్న వెర్రి ప్రయత్నం మాత్రమే కనిపిస్తోందని ధ్వజమెత్తారు.
బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 371 కోట్ల రూపాయలను చంద్రబాబు నాయుడు కొట్టేశారంటూ సిఐడి చీఫ్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెబుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన 371 కోట్ల రూపాయలను చంద్రబాబు నాయుడు కొట్టి వేస్తే, రాష్ట్రంలోని అన్ని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలలో ఎక్విప్మెంట్ ఎలా వచ్చిందని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలలోని ఎక్విప్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం కానీ, సిఐడి పోలీసులు మదింపు చేశారా?అని ఆయన నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ మదింపు చేసి వాటి విలువను నిర్ధారించిందని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు తరఫున వాదనలు వినిపించిన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే లేవనెత్తారు. ఒకవేళ ఈ స్కీం అమలులో కుంభకోణం జరిగిందని భావిస్తే, ఎక్విప్మెంట్ ను మదింపు చేసి సర్టిఫికెట్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ అధికారులను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ఆయన సిఐడిని ప్రశ్నించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
అవినీతి నిరోధక చట్టంలోని 17 A నిబంధన గురించి హరీష్ సాల్వే ప్రధానంగా ప్రస్తావించారు. అవినీతి నిరోధక చట్టానికి 2018లో సవరణ చేసిన తర్వాత, కేబినెట్ హోదా కలిగిన ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు చేయడానికి అయినా, విచారించడానికి అయినా గవర్నర్ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారో లేదో తెలియని అర్బక అజ్ఞాని ఏసీబీ న్యాయస్థానంలో తనకే అంతా తెలుసు అన్నట్లుగా నటించిన తీరుతో , న్యాయమూర్తి ఆయన వాదనను అంగీకరించినట్లుగా కనిపిస్తోంది.
ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గి అవినీతి నిరోధక చట్టానికి సవరణ చేస్తూ తీసుకు వచ్చిన 17 A నిబంధనను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సంఘటన అవినీతి నిరోధక చట్ట సవరణకు ముందే జరగడం వల్ల, న్యాయస్థానం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవద్దని కోరారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదిగా ఎంతో పేరున్నా ముకుల్ రోహత్గి డబ్బుల కోసం ఈ స్థాయికి దిగజారడం దురదృష్టకరం. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ఇదే రకమైన అవినీతి ఆరోపణలతో దాఖలైన కేసు లో ఇదే ముకుల్ రోహత్గి వాదనలను వినిపించారు.
చంద్రబాబు నాయుడు తరఫున వాదనలను వినిపించిన హరీష్ సాల్వే, సిద్ధార్థ లూత్రా లు ఈ కేసులోని రిమాండ్ రిపోర్టు తప్పుల తడకగా ఉన్నదని కొట్టివేయాలని వాదించారు. రిమాండ్ రిపోర్టే తప్పు అయినప్పుడు, ఈ కేసులో బెయిల్ అడగాల్సిన అవసరమే లేదు. రిమాండ్ రిపోర్టు కొట్టి వేయబడుతుంది. గురువారం నాటికి తీర్పు వెలువడే అవకాశం ఉందని, చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల అవుతారని రఘురామకృష్ణం రాజు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుని ఎలాగైనా జైలులో ఉంచాలని మా ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నిస్తోంది.
రింగురోడ్డే లేని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అవినీతి జరిగిందంటూ పిటి వారెంట్ జారీ చేసింది. ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు సమయంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రి కాదు. అయినా, ఈ ఇద్దరినీ అరెస్ట్ చేయడం ద్వారా తెదేపా శ్రేణులను ఉక్కిరి బిక్కిరి చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ కేసుల్లో ఎటువంటి విషయము లేదని న్యాయమూర్తులకు కూడా అర్థమయింది.
అయినా పీటీ వారెంట్లు జారీ చేసి జైల్లోనే ఉంచాలని భావిస్తే, తెలంగాణలో తీన్మార్ మల్లన్న విషయంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఇదేవిధంగా వ్యవహరిస్తే కోర్టు చివాట్లు పెట్టింది. చంద్రబాబు నాయుడు ని ఎలాగైనా 90 రోజులపాటు జైల్లో ఉంచాలని, ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లను అరెస్టు చేయాలని అధికారులకు ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి దిశా నిర్దేశం చేశారట. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా ఈ వార్త ప్రముఖంగా ప్రచురించిందని తెలిపారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్ ప్లాన్
చంద్రబాబు నాయుడు ని జైల్లో ఉంచడంతోపాటు, రామోజీరావు, నారా లోకేష్ లను అరెస్టు చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీ పెద్దల ఆశీస్సులు తీసుకొని తెలంగాణతో పాటే, డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళితే జగన్మోహన్ రెడ్డి ముందే అధికారం నుంచి దిగిపోతారు.
సమయానుకూలంగా ఎన్నికలు జరిగితే, కొన్ని రోజులైనా ఎక్కువ అధికారంలో ఉంటారు. అంతే తప్పితే, మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది లేదు. ఈ విషయాన్ని కొంతమంది అధికారులు గుర్తు పెట్టుకుంటే మంచిది. ఇప్పటికీ, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా నడుచుకుంటున్నావారికి భవిష్యత్తులో తిప్పలు తప్పవని రఘు రామకృష్ణంరాజు హెచ్చరించారు.
చంద్రబాబు ఆర్థిక లబ్ధి పొందినట్లుగా ఆధారాలున్నాయా? అని ప్రశ్నించిన న్యాయమూర్తి
స్కిల్ డెవలప్మెంట్ స్కీం స్కామ్ లో చంద్రబాబు ఆర్థికంగా లబ్ధి పొందినట్లుగా ఆధారాలు ఉన్నాయా అని హైకోర్టు న్యాయమూర్తి , సిఐడి పోలీసులను ప్రశ్నించారు. దానికి సిఐడి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఆధారాల కోసం ఇంకా ప్రయత్నిస్తున్నాము సార్.., ఈ కేసును వాయిదా వేయాలని కోరారు. దానికి న్యాయమూర్తి తిరస్కరించి, కేసు తీర్పును వెలువరిస్తానని కరాకండిగా తేల్చి చెప్పారని రఘు రామకృష్ణంరాజు వివరించారు.
మా వారి వద్ద విషయము లేదు. ఫైల్ మాయం చేశారు. ఆ ఫైల్ పై అధికారులంతా సంతకం చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. 2014 సెప్టెంబర్ 10వ తేదీన జీవో నెంబర్ 47 జారీ ద్వారా నూతన కార్పోరేషన్ ఏపీ ఎస్ ఎస్ డి సి ఏర్పాటుకు నిర్ణయించారు. కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గ ఆమోదం పొందిన తర్వాత, 2015 ఫిబ్రవరిలో సీమెన్స్ ప్రతినిధులు, గుజరాత్ లో తాము చేసిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వివరాలతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కలిశారు.
ఊరురా తిరుగుతున్న జోగి బ్రదర్స్ ఈ ప్రాజెక్టు అమలుకోసమే కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు అమలుకు నిర్ణయించడానికి ఐదు నెలల ముందే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయాన్ని తీసుకున్నారు. తెదేపా ఎన్నికల మేనిఫెస్టోలో స్కిల్ డెవలప్మెంట్ అంశాన్ని యువతకు ప్రధానంగా హామీ ఇవ్వడం వల్లే, కార్పొరేషన్ ఏర్పాటుకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకున్నారు . 546 కోట్ల రూపాయలతో 6 క్లస్టర్లలో 200 నైపుణ్య శిక్షణ కేంద్రాలకు అనుమతి ఇచ్చారు.
గుజరాత్ కంటే అదనంగా 70 కోట్ల రూపాయల విలువ చేసే 40 శాతం ఎక్విప్మెంట్ రిక్వెస్ట్ చేసి తీసుకొని, స్కిల్ డెవలప్మెంట్ స్కీమును చంద్రబాబు నాయుడు అద్భుతంగా అమలు చేశారు. ఈ స్కీమును అద్భుతంగా అమలు చేసిన చంద్రబాబు నాయుడు కిరీటం పెట్టాల్సింది పోయి, అక్రమ కేసులు అరెస్టు చేయడం సిగ్గుచేటని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన నైపుణ్య శిక్షణ కేంద్రాలను నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని ఆయన మండిపడ్డారు. 2015 జూన్ లో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఒప్పందానికి ఆమోదం తెలపాలని సీఈవో ఒక లేఖ ద్వారా కోరారు.
2015 జూన్ 30వ తేదీన జీవో నెంబర్ 4 ద్వారా ఈ స్కీం అమలుకు ఆమోదం తెలిపారు. అయినా, స్కీం అమలుకు నోచుకోకపోవడంతో, నైపుణ్య శిక్షణ అనేది ఎన్నికలలో యువతకు ఇచ్చిన హామీ అని భావించి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో మధ్య నిషేధం అమలు చేస్తామని, మధ్య నిషేధం అమలు చేయకపోతే ఓట్లే అడగమని చెప్పినా జగన్మోహన్ రెడ్డి, అదే మద్యం పై 30 ఏళ్లకు సరిపడా అప్పులను చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీం అమలుకు ప్రేమ్చంద్రారెడ్డి తో పాటు, మరొక రెడ్డి సంతకం చేసి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారన్న రఘురామ కృష్ణంరాజు, ఇప్పుడు అన్ని అబద్ధాలే చెబుతున్నారని మండిపడ్డారు.
ప్రస్తుతం మా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల గుండెల్లో దడ, దడ
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు తర్వాత ఆయనకు అనూహ్యంగా ప్రజాధరణ పెరిగిన విషయాన్ని సి ఓటర్ సర్వే తాజాగా వెల్లడించింది. చంద్రబాబు నాయుడు కి కూడా ప్రపంచవ్యాప్తంగా తనకు ఇంత పెద్ద ఆదరణ ఉన్నదని తెలిసి ఉండకపోవచ్చు. అమెరికాలో ఇంటి పక్కనే ఏమి జరిగినా పట్టించుకోని వారు కూడా … చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ వేలాది మందిగా రోడ్లమీదకు వచ్చారు.
కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ రోడ్లెక్కి ఈ ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ చంద్రబాబుకు సంఘీభావాన్ని తెలియజేశారు. చంద్రబాబు కున్న ప్రజాదరణను ప్రపంచానికి పరిచయం చేసిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. మేము ఎంతటి దరిద్రులమో ప్రపంచంలోని తెలుగు వారందరికీ కూడా తెలియజేశారని, ఇంకా ఈ పార్టీలో కొనసాగుతున్నాను కాబట్టి మేము అంటున్నానని ఆయన తెలిపారు.
వైయస్సార్ అభిమానులకు ఆగ్రహం తెప్పించవద్దు
కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలో లేకపోయి ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడి ఉండేదని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉండే వారా అని నిలదీశారు.
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చుట్టూ తిరిగిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం విడ్డూరం. జగన్మోహన్ రెడ్డి తొలుత ఎంపీ అయ్యింది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే, ఆయన తల్లి విజయమ్మ ఎమ్మెల్యేగా ఎన్నికయింది కూడా అదే పార్టీ తరఫున అని గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ద్వారా రాజశేఖర్ రెడ్డి అభిమానుల ఆగ్రహానికి గురికావద్దని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే తనకున్న అభ్యంతరమేమీ లేదన్నారు.
సంజయ్, సునీల్, రఘురామిరెడ్డి తో పాటు మరికొంతమంది అధికారులకు భవిష్యత్తు లేదు
సిఐడి చీఫ్ సంజయ్, మాజీ చీఫ్ సునీల్, మరో పోలీసు అధికారి రఘురామిరెడ్డి తోపాటు మరి కొంతమంది అధికారులకు భవిష్యత్తు అనేది ఉండదు. ఐపీఎస్ గా ఉత్తీర్ణులైన వారు కనీసం రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కులను కూడా గుర్తించకుండా నడుచుకోవడం విడ్డూరంగా ఉంది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి ఏ పరీక్ష పాస్ కాలేదు. తనది రాజ్యాంగబద్ధమైన పదవి అని చెప్పుకుంటూ ఉంటాడు.
అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి రాజ్యాంగబద్ధమైన పదవి కాదని సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చింది. ఆయన కేవలం ప్రభుత్వ న్యాయవాది మాత్రమే. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో ఎటువంటి కంటెంట్ లేకపోయినా తన నటనతో సుధాకర్ రెడ్డి ఊపేశారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా తనని గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న సుధాకర్ రెడ్డి ని, అడ్వకేట్ జనరల్ గా నియమించుకోండి. అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా కొనసాగుతున్న సుధాకర్ రెడ్డి ని బార్ కౌన్సిల్ నుండి సస్పెండ్ చేయాలని గతంలోనే నేను కోరాను. నా కేసులో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన సుధాకర్ రెడ్డి ని న్యాయమూర్తి తీవ్రంగా ఆక్షేపించారు. కోర్టు ధిక్కరణ కేసును పెట్టాలని ఆదేశించారు. అయినా తమ పలుకుబడిని ఉపయోగించుకొని, ఆ కేసు వెలుగులోకి రాకుండా తొక్కి పెట్టేశారని రఘురామకృష్ణం రాజు అన్నారు.
వైయస్సార్సీపి ఎంపీగా రాజ్యాంగ అమలు కోసం ఆందోళన చేశా
మహాత్మా గాంధీ దండి యాత్ర స్ఫూర్తితో పార్లమెంట్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఆందోళన నిర్వహించారు. రాజ్యాంగాన్ని కాపాడాలని, రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నేను కూడా మద్దతు తెలియజేశాను. ఇప్పుడు దండి యాత్ర స్ఫూర్తితో నిర్వహించిన ఆందోళన రేపు మా ప్రభుత్వం పై దండయాత్ర కానుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో కోర్టు తీర్పు వచ్చేలోపు ఇంకేమైనా తింగరి వేషాలు వేస్తే మరిన్ని ఇబ్బందులు తప్పవు.
19వ తేదీ వరకు కస్టడీ పిటిషన్ పై ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవద్దని హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి ఏసీబీ న్యాయస్థానాన్ని ఆదేశించారు. జడ్జిమెంట్ రిజర్వ్ అని వెల్లడించిన తర్వాత కూడా ఓవరాక్షన్ చేస్తే, ఇబ్బందులు తప్పవన్నారు. గతంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మద్యం బ్రాండ్లను కాకుండా, కొత్త మద్యం బ్రాండ్ల ద్వారా వేల కోట్ల రూపాయలను కొట్టివేయడమే కాకుండా 300 నుంచి 400 కోట్ల రూపాయలను తాడేపల్లి ప్యాలెస్ కు ముడుపులుగా ముట్టజెప్పుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పేర్కొన్నారని, దీనిపై సిబిఐ చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆమె కోరారని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు.
నేను గత రెండున్నర ఏళ్లుగా ఇదే విషయాన్ని చెబుతున్నాను. గతంలో బిజెపి నాయకత్వం స్పందించలేదు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉంటే బాగుండేదని విజయసాయిరెడ్డి అంటున్నారు. పురంధరేశ్వరి నియామకం తర్వాత తమ పప్పులు ఉడకడం లేదని వారు గ్రహించారు. పురందరేశ్వరి వ్యాఖ్యల ద్వారా ప్రజలు సంతోషపడుతున్నారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని, రాష్ట్రంలోని మద్యం కుంభకోణంపై ఆమె సిబిఐ విచారణకు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణం రాజు కోరారు.
ఋషికొండకు గుండు కొట్టి నిర్మించుకున్న ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి దంపతులు నివసించినంత మాత్రాన విశాఖపట్నం ఏమి రాష్ట్ర రాజధాని కాదు. ఆ విషయము విశాఖపట్నం ప్రజలకు కూడా తెలుసు. ఋషికొండపై నిర్మించిన అక్రమ భవనాన్ని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చి వేస్తాం. ఇటువంటి పనికిమాలిన పాలకులకు చక్కటి సందేశాన్ని ఇచ్చేందుకు ఆ భవనం కూల్చివేత ఒక్కటే మార్గం.
మహిళా బిల్లును అందరూ స్వాగతించాల్సిందే
కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టిన మహిళా బిల్లును ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందేనని రఘురామకృష్ణం రాజు కోరారు. ఇప్పటివరకు ఎన్నో మార్లు పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ ఆమోదం పొందలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు ఈసారి ఆమోదం పొందడం ఖాయం. ఈ బిల్లును 2024 లోనే అమలు చేసి ఉంటే బాగుండేది.
కానీ నియోజకవర్గాల డీ లిమిటేషన్ ప్రక్రియ తర్వాత అమలు చేయనున్నారు. పనికిమాలిన పార్టీలో ఉంటూ నారీ శక్తి గురించి మాట్లాడడం నాకే సిగ్గుచేటుగా అనిపిస్తుంది. తల్లికి ఓడిపోయే సీటు ఇచ్చి, చెల్లికి సీటే ఇవ్వలేదు. విద్యాధికులైన యువతులు, సామాజిక స్పృహ కలిగిన మహిళలు ఇప్పటినుంచే తమ రాజకీయ జీవితానికి పునాదులు వేసుకోవాలనీ రఘురామకృష్ణం రాజు సూచించారు.