– అవినీతి సక్రమం.. అరెస్టు అక్రమం..! అన్నదే టీడీపీ సిద్ధాంతం
– నారా భువనేశ్వరి, బ్రాహ్మణిల ‘మోతల’ సారాంశమిదే..!
– దమ్ముంటే ఢిల్లీ వెళ్లి ఈడీ, ఐటీ, సీబీఐ, రాష్ట్రపతి, ప్రధాని, అమిత్ షా ఇళ్ళ ముందు కాంచాలు కొట్టండి!
– స్కిల్‌స్కామ్‌లో రూ.371 కోట్ల అడ్డగోలు దోపిడీ..
– రూ.80 కోట్ల ఖర్చుతో ఏర్పాటైన సెంటర్ లో పరికరాల విలువ రూ.2 కోట్లేనంట..
– ‘ఆదిశంకర’ కాలేజీ సెంటర్లో వెల్లడైన నిజమిది..
– రాష్ట్రంలో 42 స్కిల్సెంటర్లలో ఎక్కడా పరికరాలకు ఇన్వాయిస్ల్లేవు..
– ఒకవేళ ఉంటే.. నాతో చర్చకొస్తారా ..?
-ః ఛాలెంజ్ విసిరిన మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి
చంద్రబాబు దొంగ అని సొంతోళ్లే తేల్చారుః
టీడీపీ ఈ రాష్ట్రంలో అనవసరమైన రాద్ధాంతాలకు పాల్పడుతున్న నేపథ్యంలో వాస్తవాల్ని ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత మాపై ఉంది. చంద్రబాబు అరెస్టు గురించి అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పెద్దగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే టీడీపీ నేతలే అసలు నిజాల్ని అంగీకరించారు. ఆమేరకు మేము తప్పులు చేసిన మాట వాస్తవమేనని ఆ పార్టీ ప్రజలకు చెప్పుకుంటుంది.
స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌లో తప్పు జరిగింది కానీ.. అందులో మా చంద్రబాబు పాత్ర కొంతే.. ఇంతే.. అని టీడీపీ నేతలు చెబుతున్నారు. నిజాల్ని ఒప్పుకోవడమనేది ఒకరకంగా మంచి సాంప్రదాయమే. తమ అధినేత చంద్రబాబుపై అవినీతి మచ్చ పడిందని.. ఎలాగైనా ఆ మచ్చను చెరిపేయాలనే ప్రయత్నంలో భాగంగా టీడీపీ నేతలు, వారి పార్టీని భుజానెత్తుకుని మోస్తున్న పచ్చమీడియా నానా తంటాలు పడుతుంది. అందులో భాగంగానే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలతో పాటు వాటి పచ్చఛానెళ్లల్లో రోజుకో కథనాల్ని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, వాళ్ల ప్రయత్నాలు మాత్రం ఎక్కడా ఫలించడంలేదు. ఈ తంతు మొత్తాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
నకిలీ సీమెన్స్ పేరిట జీవోలా..?
స్కిల్‌స్కామ్‌లో సీమెన్స్ సంస్థ పేరిట ఒప్పందం చేసుకుని ప్రభుత్వం రూ.371 కోట్లు విడుదల చేసిందని.. ఆ మొత్తంలో రూ.241 కోట్లు షెల్ కంపెనీలతో చంద్రబాబు ఖాతాలో చేరిందనేది వాస్తవాధారం. అయితే, ఆయన వర్గం మాత్రం రాష్ట్రంలో కొనసాగుతున్న స్కిల్ సెంటర్లు, వాటిల్లో పరికరాలన్నీ సీమెన్స్ కంపెనీనే కొనుగోలు చేసిందని చెప్పడానికి ప్రయత్నించారు.
టీడీపీ నేతలు విక్రమసింహపురి యూనివర్శిటీకి వెళ్లి అక్కడ స్కిల్సెంటర్లో ప్రెస్‌మీట్ పెట్టి ఏవేవో కబుర్లు చెప్పారు. తీరా.. అక్కడున్న ల్యాబ్ పరికరాలకు సీమెన్స్ సంస్థకు సంబంధమే లేదని ఆధారాల్ని చూపించాం. ఆ తర్వాత ఆదిశంకర సంస్థలకు వెళ్లి అక్కడ రూ.10 కోట్లతో సీమెన్స్ ఏర్పాటు చేసిన స్కిల్సెంటరన్నారు. సరేనని.. అక్కడకెళ్లి చూస్తే అసలు విషయం తేలింది.
2017 జూన్ 30న ప్రభుత్వ జీవో నెంబర్.4 ప్రకారం ‘సీమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ కంపెనీ’ పేరుతో 90- 10 శాతం వాటాగా పేర్కొన్నారు. సీమెన్స్ నకిలీ కంపెనీ పేరుతో స్కామ్ చేశారు. ఒక్కోసెంటర్‌కు రూ.80 కోట్లు ఖర్చు పెట్టాలి. మరి, టీడీపీ నేతలే ఆదిశంకరలో కేవలం రూ.10 కోట్లే ఖర్చుపెట్టి స్కిల్‌సెంటర్ పెట్టారని చెబుతున్నారు గదా..? మరి, మిగతా రూ.70 కోట్లు ఎక్కడకు పోయాయి..? ఎవరి ఖాతాలోకి చేరాయి..? దీనికి సమాధానం చెప్పాలని ఆ పార్టీ నేతలకు నేను ఛాలెంజ్ విసురుతున్నాను. ∙
రూ.10 కోట్ల అబద్ధాల ప్రచరామదిః
ఆదిశంకరలో కనీసం రూ.10 కోట్ల విలువైన పరికరాలతో స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్ పెట్టారేమోనని అక్కడికి వెళ్లి ఆరాతీస్తే.. ఎక్కడా కొన్నవాటికి ఇన్వాయిస్ బిల్లుల్లేవు. అదేంటని, ఆదిశంకర యాజమాన్యాన్ని అడిగితే.. మాకు రూ.10 కోట్ల విలువైన సామానుల్లేమీ రాలేదంటూ.. కేవలం రూ.2 కోట్లతోనే ఈ సెంటర్ ఏర్పాటు చేశామని వివరించారు. దీన్నిబట్టి, మనం ఏం అర్ధం చేసుకోవాలి..? ప్రభుత్వం పేరిట టీడీపీ నేతలు మరీ, ఇంత పచ్చిమోసం చేస్తారా..? నేను నిప్పు నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు ఇంత దగా చేస్తాడా..? అని నివ్వెర పోవాల్సిన పరిస్థితి.
సోమిరెడ్డీ..ఇన్వాయిస్లు చూపే దమ్ము నీలో ఉందా..?
అధికారంలో ఉన్నోళ్లని ఎవరు ప్రశ్నిస్తార్లేనని ప్రజల కళ్లుగప్పి నాడు చంద్రబాబు..ఇంత అడ్డగోలుగా వ్యవహరిస్తారా..? అని అందరూ ఈరోజు ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న సీమెన్స్ కు టీడీపీ నేతలు చెబుతున్న సీమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్‌వేర్‌కు ఏమీ పోలికలేదు. పొంతనలేదు. అది వేరు. ఇది వేరని మేం ఇప్పటికే అనేకసార్లు చెప్పాం. అయినా.. ఆ పార్టీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిలాంటి వారు సిగ్గులేకుండా రూ.2 కోట్లు పెట్టినచోట రూ.10 కోట్లు పెట్టినట్లు అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్రంలో 42 సెంటర్లుంటే, వాటిల్లో కొనుగోలు చేసిన సామాగ్రికి సంబంధించి ఏ ఒక్క ఇన్వాయిస్ బిల్లు చూపలేని పరిస్థితి వారిది. వారు చెప్పినట్లు ఆదిశంకరలో రూ.10 కోట్లకు ఇన్వాయిస్లు చూపే దమ్మూధైర్యం సోమిరెడ్డికి ఉన్నట్లయితే నాతో చర్చకు రావాలని ఛాలెంజ్ విసురుతున్నాను. విక్రమసింహపురి యూనివర్శిటీ ఉదంతంతో తోకముడిచినట్లు మీరు వెళ్లకుండా.. కనీసం, ఆదిశంకర కాలేజీలో మీరు చూపెట్టిన వాటిపై చర్చకొచ్చి నిజాల్ని నిగ్గుతేలిస్తే నేను రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తొలగిపోతానని ఛాలెంజ్ విసురుతున్నాను. సోమిరెడ్డి నా ఛాలెంజ్‌ను స్వీకరించి ముందుకొస్తాడా..?
చంద్రబాబు అవినీతి మోత
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు మోగించిన అవినీతి మోత కారణంగానే ఈరోజు ఆయన జైల్లో ఊసలు లెక్కబెట్టుకోవాల్సి వచ్చింది. పాపం.. ఆయన పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే, ఇంట్లో ఈగలమోత.. జైల్లో దోమలమోతగా ఉంది. తప్పుచేసినోళ్లకే ప్రజలంతా సంఘీభావం తెలపాలంటూ ఆయన భార్య, కోడలు కలిసి పళ్లాలు, కంచాలు మోగించాలంటూ ప్రజల్ని సిగ్గులేకుండా కోరడం విడ్డూరంగా ఉంది.
లంచాలకు కంచాలమోత తగదు
చంద్రబాబు భార్య, కోడలు ఈ సమాజానికి అందించే సందేశం ఏంటి..?
-‘అవినీతి సక్రమం.. అరెస్టు మాత్రం అక్రమం’ అనేది వారి సిద్ధాంతమా..? రాష్ట్రంలోని ఎందరో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. నిరుద్యోగుల కంచాల్లో మెతుకులు తినేసి వారిని ఆకలితో పస్తులు పెట్టిన నేత చంద్రబాబు. అలాంటి లంచగొండులకు సంఘీభావంగా ప్రజల్ని కంచాలు మోగించమనడం, ఈలలు, డోళ్లు అంటూ వికృతచేష్టలకు పురిగొల్పడం తగదని మేధావులంతా నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు హితవు పలుకుతున్నారు.
లోకేశ్ ఉత్తరప్రగల్భాలు
దోచుకున్న డబ్బుతో దొంగలా ఆధారాలతో సహా పట్టుబడి రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లిన తండ్రిని కాపాడాలనే తాపత్రయంలో కొడుకు లోకేశ్ ఢిల్లీ వెళ్లాడు. ఆయన నిన్నటిదాకా ఏమని ఉత్తర ప్రగల్భాలు పలికాడో అందరూ చూశారుకదా..? తోలుతీస్తాం. తాటతీస్తాం. ఎర్రబుక్కు.. నిప్పు.. అన్నాడు. తీరా ఆయనొక పప్పు..తుప్పుగా తేలింది. ఢిల్లీ నుంచి ఏపీలో అడుగుపెట్టడానికి గజగజా వణికిపోతున్నాడు. ఎందుకంటే, అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్‌లో లోకేశ్ నిందితుడు కదా..? అందుకే, పారిపోయి దాక్కున్నాడు. సీఐడీ అక్కడికెళ్లి నోటీసులిస్తే చచ్చినట్లు రేపు ఏపీకి వస్తున్నాడు.
ఐటీ, ఈడీ ముందు మీమోత వినిపించే ధైర్యముందా..?
స్కిల్‌డెవలప్‌మెంట్, ఫైబర్‌గ్రిడ్, అమరావతి అసైన్డ్భూములు, ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్‌ల్లో చంద్రబాబు ఆధారాలతో సహా దొరికిపోయిన దొంగ. ఆయన చేసిన అవినీతిలో ఇప్పటికి బయటకొచ్చింది గోరంతే.. ఇంకా వెల్లడికావాల్సిన అవినీతి కొండంత ఉంది. అలాంటప్పుడు ఇక్కడ కంచాలు, స్పూన్లు, డోళ్లు మోగించి విజిల్స్ వేస్తే ఒనగూరే లాభమేమీ ఉండదు. నిజంగా, టీడీపీ నేతలకు దమ్మూధైర్యం ఉంటే.. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిభవన్ ఎదట, ప్రధాని మోదీ దగ్గర, కేంద్రహోం మంత్రి అమిత్‌షా ముందు నిలబడి మోగించడమో.. లేదంటే, ఐటీ నోటీసులిచ్చిన రూ.118 కోట్లకు లెక్కలున్నాయంటూ అక్కడ, ఈడీ ఆఫీసుల ముందు మోతమోగిస్తే బాగుంటుందేమో ఆలోచన చేయాలి.
టీడీపీ నేతలు సిగ్గుతో తలదించుకోవాలి
నిన్న వినాయక నిమజ్జనం సందర్భంగా రాష్ట్రంలో ఊరూరా డప్పులు మోగిస్తూ ఈలలేసుకుంటూ సందడి సందడిగా కార్యక్రమాలు జరిగాయి. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం ఆ సందళ్లే మా నాయకుడు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జరిగిన మోతగా పచ్చమీడియాలో లైవ్లిచ్చుకుని మరీ సంతృప్తి పడ్డారు. పోనీ, విఘ్నవినాయకుడ్ని నీళ్లల్లో కలిపి నిమజ్జనం చేసినట్లుగానే.. చంద్రబాబు రాజకీయ జీవితాన్ని నిమజ్జనం చేసేందుకు టీడీపీ నేతలు పూనుకున్నారేమోననిపిస్తుంది.
ప్రజలు కూడా ఖచ్చితంగా ఇదే అర్ధం చేసుకుంటున్నారు. లేకపోతే, కంచాలు మోగించండని అర్ధపర్ధంలేని వికృతచేష్టలకు పిలుపునివ్వడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఆ పార్టీ ఒక ధర్నాకు పిలుపునిస్తే.. నిరసన కార్యక్రమానికి రమ్మంటే.. నియోజకవర్గం నుంచి పట్టుమని పదిమంది కూడా రావడంలేదంటే ఆపార్టీ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిపోయిందనేది అర్ధమౌతుంది. కనుక, ఇప్పటికైనా టీడీపీ నేతలు, తమ అధినేత చంద్రబాబు అవినీతికి సిగ్గుతో తలదించుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవడం మంచిది.