న్యాయస్థానాలలో తీర్పులు ఆలస్యం అయితే న్యాయ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లే అవకాశం
హత్యాయత్నానికి నో బెయిల్… హత్య చేస్తే బెయిల్ అన్నట్టు గా పరిస్థితులు నెలకొన్నాయంటున్న ప్రజలు
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు తప్పే… తాళిబొట్లు తీసేసుకుని తిరగాలని, గుడ్డలూడదీసుకుని తిరగాలన్న వారిని ఏం చేయాలి?
రోజా రెడ్డి, కుష్బూ మీనా, శ్రీ రెడ్డిలు ఈ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు?
మహిళలంతా మహిషాసుర మర్దిణులు కావాలి… ఓటు అనే ఆయుధంతో హతమార్చాలి
మద్యం ద్వారా లక్షా పాతిక వేల కోట్ల కుంభకోణం… సిబిఐ విచారణకు కేంద్రం ఆదేశిస్తుందా?
గవర్నర్ కు కూడా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి వినతి పత్రాన్ని అందజేయాలి
ఢిల్లీలో మద్యం కుంభకోణం పై సిబిఐ విచారణను కోరింది అక్కడి గవర్నరే
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
న్యాయ స్థానాలలో తీర్పు ఆలస్యమైతే న్యాయవ్యవస్థ పైనే ప్రజలకు నమ్మకం సన్నగిల్లి అవకాశం ఉంది.. ఎటువంటి మచ్చలేని ఒక వ్యక్తిపై కక్షగట్టి… తమ పగను తీర్చుకోవడం కోసం ప్రజలకు న్యాయ వ్యవస్థ పైనే సందేహాలను రేకెత్తించే విధంగా వ్యవహరించడం దారుణం. న్యాయం చేయడానికి ఇంత ఆలస్యమా?, అవసరమైతే ధర్మాసనం గంటసేపు అధికంగా కూర్చుని, వాదనలను పూర్తిగా విని తీర్పును ఇస్తే సరిపోయే దని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు.
ఒకపక్క అన్యాయంగా జైల్లో పెట్టి, ఇన్ని రోజులుగా ప్రజలను మభ్యపెడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. నేను లండన్ లో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడుని పోలీసులు ఎత్తేశారని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా, విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన బజారు భాష ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్రంలో హత్య చేస్తే తప్పితే బెయిల్ రాదేమోనని ప్రజలు అనుకుంటున్నారన్నారు . తన డ్రైవర్ ను హత్య చేసి ఆయన శవాన్ని పార్సిల్ చేసిన అనంతబాబుకు బెయిల్ లభించిందని, ఆయన దర్జాగా మా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా అరెస్టు చేయలేక పోయింది.
చివరకు ఆయనకు కూడా బెయిల్ లభించింది . తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పై అన్యాయంగా ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయగా, ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేస్తే ఆయనకేమో బెయిల్ రాదు. ఐపీసీ 302 సెక్షన్ కింద కేసులు నమోదు చేసిన అనంత బాబు, అవినాష్ రెడ్డి లకు మాత్రం బెయిల్ లభిస్తుంది. న్యాయ వ్యవస్థను పై నమ్మకం పెట్టుకోవాలని, నాలాంటివారు ఎంత గొంతు చించుకున్నప్పటికీ, ఇటువంటి సంఘటనలతో ప్రజలకు న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఉంటుందా? అని ప్రశ్నించారు.
307 కు నో నోబెల్ … హత్య కేసు బెయిల్ అన్నది రాష్ట్రం లో, తెలంగాణ లో నేటి పరిస్థితులుగా కనిపిస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు సెక్షన్లు ఒకటే కాకపోయినాప్పటికీ, రాష్ట్రంలో మాత్రం హత్యాయత్నం కంటే, హత్య కేసులో నిందితులకే త్వరగా బెయిల్ లభిస్తోందన్నారు.
తీర్పు అంటూ వస్తే చంద్రబాబు నాయుడుకు ఉపశమనం ఖాయం
సుప్రీంకోర్టులో తన రిమాండ్ రిపోర్టు క్వాష్ కోసం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పు అంటూ వెలువడితే ఆయన కు ఉపశమనం లభించడం ఖాయమని రఘురామకృష్ణం రాజు అన్నారు . వాతావరణ శాఖ అధికారులు వారం రోజుల తర్వాత కురిసే వర్షాల గురించి కూడా ముందే చెప్పగలుగుతున్నారు. కానీ న్యాయస్థానంలో తీర్పులు ఎప్పుడు వెలువబడుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ తరహా పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరం.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రాసిక్యూషన్ తరపున వాదనలను వినిపిస్తున్న ముకుల్ రోహత్గి ఈ సంఘటన ఎప్పుడు జరిగిందన్నదే ముఖ్యం అన్నట్లుగా వాదనలను వినిపించారు. చంద్రబాబు నాయుడు తరఫున వాదనలను వినిపించిన హరీష్ సాల్వే మాత్రం ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారన్నదే ముఖ్యమని తన వాదనలలో చాలా స్పష్టంగా చెప్పారు. అవినీతి నిరోధక చట్టంలోని 17 A నిబంధన కింద ఎవరైనా అధికారులను అదుపులోకి తీసుకోవలసి వచ్చినప్పుడు వారిని నియమించే అధికారం ఉన్న అధికారుల అనుమతి తప్పనిసరిని పోలీసులకు స్పష్టంగా గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 2018 నుంచే విచారణ చేపడుతున్నామని చెప్పడం సరి కాదని చంద్రబాబు నాయుడు తరఫున వాదనలు వినిపించిన హరీష్ సాల్వే ధర్మాసనం కు తెలియజేశారు. ఎలాగైనా కేసు ను వాయిదా వేయించాలన్నదే తన లక్ష్యం అన్నట్లుగా ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు . ముకుల్ రోహత్గి వాదనలను సమర్థిస్తే, హైకోర్టు సింగల్ బెంచ్ తీర్పును సమర్ధించినట్లే. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును అన్ డూ చేసినట్టే అవుతుంది.
కేసు వాయిదా కోసం రోహత్గి చేస్తున్న ప్రయత్నాలను చూస్తుంటే… నిన్ననే గవర్నర్ వద్దకు జగన్ సర్కార్ ముగ్గురి అధికారులను పంపించింది . నేడు జగన్మోహన్ రెడ్డి , గవర్నర్ ను కొలవబోతున్నారు. వాయిదా గడువులో గా గవర్నర్ ను ఏదో విధంగా కన్విన్స్ చేసి, ఇప్పుడు గవర్నర్ అనుమతి వచ్చిందని చెబుతారేమోనంటూ రఘురామ కృష్ణంరాజు సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసులో తీర్పు అంటూ వస్తే 17A అప్లికబుల్ అని మాత్రమే వస్తుంది. తీర్పు వస్తుందా రాదా అన్న దాని తోపాటు, ఇంకెన్ని రోజులు ఆలస్యం చేస్తారన్నది అర్థం కావడం లేదు.
గురువారం, లేదంటే శుక్రవారం వాయిదా వేయాలని ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గి కోరుతున్నారు. ఎలాగైనా ఇబ్బందులను సృష్టించడానికి కేసు వాయిదాను కోరుతున్నారు. చంద్రబాబు నాయుడుకి లోయర్ కోర్టు, హైకోర్టులలో న్యాయం జరగదని నేను ముందు నుంచే చెబుతున్నాను. ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటీషన్లపై ఈ విషయంలో ముందస్తు బెయిల్ కుదరదని అన్నారు.
బెయిల్ కోసం వేసిన పిటిషన్ పై మాత్రం ముందస్తు బెయిల్ పిటీషన్ వేసుకోవచ్చు అని అంటున్నారు. లంచ్ మోషన్ ద్వారా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా కొట్టివేయడంపై రఘురామ కృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు. హైకోర్టును ఆశ్రయించకుండా, సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి వీలు లేదు. అన్యాయంగా జైల్లో పెట్టిన చంద్రబాబు నాయుడు కేసులో వాదనలు వినడానికి సుప్రీంకోర్టులోని ఒక బెంచ్ నిరాకరించింది.
ఆ బెంచ్ లో లిస్ట్ కావడానికే వారం రోజుల వ్యవధి పట్టింది. కేసు మరొక బెంచ్ కి బదిలీ అయిన తర్వాత కూడా పది రోజుల సమయం గడిచింది. ఇప్పుడు కూడా తీర్పు ఈ వారమా?, వచ్చేవారమా?? అన్న పరిస్థితి నెలకొందని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
గతంలో శాసనసభలో దళిత శాసన సభ్యురాళ్ళ గురించి వ్యంగ్య వ్యాఖ్యలు, సైగలు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా రెడ్డి పై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలపై ఆయన బేషరతుగా క్షమాపణలను చెప్పారు. రోజా రెడ్డికి మద్దతుగా సినీ హీరోయిన్లు రమ్యకృష్ణ, మీనా, మా పార్టీకి అత్యంత సానుభూతిపరురాలు అయినా శ్రీ రెడ్డి స్పందించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పే… నేను కూడా అంగీకరిస్తాను. అయితే గత శాసనసభలో దళిత శాసన సభ్యురాళ్ళైనా వంగలపూడి అనిత, పీతల సుజాతను ఉద్దేశించి రోజా రెడ్డి వ్యంగ్య వ్యాఖ్యలు సైగలు చేసినప్పుడు వీరు ఎందుకు స్పందించలేదు.
తమ తోటి నటీమణి అని స్పందించి ఉంటారు సంతోషం. అందుకు వారిని నేను అభినందిస్తున్నాను. అసభ్యకర వ్యాఖ్యలు చేశారని గగ్గోలు పెడుతున్న ఈ నటీమణులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిటీస్ట్ ఒకరు , పార్టీ నాయకుడొకరు మరొకరు చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు.
సోషల్ మీడియా యాక్టివిటీస్ట్ మతం, ముఖ్యమంత్రి మతము ఒకటేనని అనుకుంటా… హైందవ స్త్రీలను అవమానించే విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగిన అరెస్టును నిరసిస్తూ ర్యాలీలలో పాల్గొన్న మహిళలను తాళిబొట్టును తీసి పక్కన పెట్టి పాల్గొనాలనడం సిగ్గుచేటు. తాళిబొట్టు ఎప్పుడు తీసి పక్కన పెడతారో తెలుసా?, ఈ చెత్త వెధవలకు అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. తాళిని గౌరవించే ఏ స్త్రీ అయినా వైకాపాకు ఓటు వేస్తుందా?. ఇటువంటి దరిద్రులకు ఓటు వేయాలా? అని మహిళలు భావించే అవకాశం ఉంది.
రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన చంద్రబాబు నాయుడు అరెస్టును పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. తెదేపా ఇచ్చిన పిలుపుమేరకు పళ్లెం పై గరిటతో శబ్దం చేయడం, లైట్లు ఆర్పి వేసి కొవ్వొత్తులను వెలిగించే కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. లైట్లు ఆర్పి వేసి కొవ్వొత్తులు వెలిగించే కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను ఉద్దేశించి వైకాపాకు చెందిన ఒక నాయకుడు అర్ధనగ్న ప్రదర్శన చేయాలని సూచించడం ఎంతవరకు సమంజసం.
మంత్రి రోజా రెడ్డి, ముఖ్యమంత్రి సతీమణి భారతి రెడ్డిలు ఈ విషయంపై స్పందించాలి. పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఒకరు మహిళలను తాళిబొట్లు తీసివేసి పాల్గొనాలని అవమానపరచగా, మరొకరేమో గుడ్డలూడదీసి పాల్గొనాలని అంటే, ఏ ఒక్క మహిళా అయినా మన పార్టీకి ఓటు వేస్తుందా?. పెళ్లి అయిన మహిళలు 90% మంది ఓట్లు వేస్తారు. పెళ్లి కాని వారు 10 శాతం మంది మాత్రమే ఓటు వేసినా, వారికి తాళిబొట్లు ఉన్న తల్లులు ఉంటారు. తాళిబొట్టు ధరించని వారు ఉంటే ఓ పదిహేను శాతం ఉండి ఉండవచ్చు. అంతమాత్రాన ఇంత అసహ్యంగా మాట్లాడుతారా? అని రఘు రామ కృష్ణంరాజు మండిపడ్డారు. మరొకవైపు చంద్రబాబు నాయుడు ని అక్రమ అరెస్టు చేసిన కేసులలో పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉందని జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే, ఆయనపై కూడా కేసులు నమోదు చేసేలా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ను టచ్ చేస్తే ఏమి జరుగుతుందో అర్థమవుతుంది. పగిలి పోతుందని అన్నారు. మహిళలంతా మహిషాసుర మర్దిణులుగా మారి తమ ఓటు అనే ఆయుధం ద్వారా ఇటువంటి దుర్మార్గులకు తగిన బుద్ధి చెప్పాలని రఘురామకృష్ణం రాజు కోరారు.
మద్యపానంతో జగన్మోహన్ రెడ్డికి అభిషేకం చేసిన మహిళలు
మద్యపానంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మహిళలు అభిషేకం చేశారని, గతంలో క్షీరాభిషేకం చేయడం చూశామని… కానీ మధ్య అభిషేకం అన్నది ఇదే మొదటి సారంటూ రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లభిస్తున్న నాణ్యత లేని మద్యం గురించి రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందరేశ్వరి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు సుదీర్ఘ లేఖ రాశారు. నాణ్యత లేని మద్యంలో వినియోగిస్తున్న రసాయన అవశేషాల గురించి వెల్లడించారు.
ఏటా పాతికి వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్షా పాతిక వేలకోట్ల అవినీతి జరిగిందని పురందరేశ్వరి వివరించారు. 100 కోట్ల రూపాయల మధ్య కుంభకోణం జరిగితేనే సిబిఐ విచారణకు ఆదేశించిన కేంద్రం, లక్షా పాతిక వేల కోట్ల మధ్య కుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశిస్తుందా? లేదా అంటూ రఘురామకృష్ణం రాజు సందేహాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం పై ఆ రాష్ట్ర గవర్నర్ సిబిఐ విచారణ కోరారు అన్నారు. రాష్ట్ర గవర్నర్ కు కూడా పురందరేశ్వరి వినతి పత్రాన్ని అందజేయాలని సూచించారు.
రాష్ట్రంలో జరుగుతున్న మద్యం కుంభకోణంపై రాష్ట్ర గవర్నర్ కూడా సిబిఐ విచారణ కోరుతారేమోనని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కులము చూడము, మతం చూడం అంటూనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసేది కులము లేకపోతే మతమని చెప్పారు. రాక్షసుడు అన్నవారే సిగ్గుపడే విధంగా అసలు ఒక రాక్షసుడు ఉన్నారని, ఆ రాక్షసుడి పేరు ఏంటో నేను చెప్పనని ఎవరికి వారు తెలుసుకోవాలని సూచించారు.