– సీఐడీ విచారణ అనంతరం మీడియాతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
దాదాపు ఆరున్నర గంటలపాటు ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేని 50 ప్రశ్నలు తనను అడిగారని, ఇందులో 49 ప్రశ్నలు గూగుల్‌లో కొడితే వచ్చేవి ఉన్నాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.
సీఐడీ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మీరు ఏం చేస్తుంటారు? హెరిటేజ్‌లో పని చేసినప్పుడు మీ హోదా ఏంటి? ప్రభుత్వం లో మీరు ఏ బాధ్యతలు నిర్వహించారు? ఇటువంటి గూగుల్ లో దొరికేవన్నీ తనని విచారణాధికారులు అడిగారన్నారు. తన ముందు ఈ కేసుకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు పెట్టలేదని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షమైనా, ప్రజలనైనా కక్ష సాధించడం అలవాటుగా మారిందన్నారు.
పోలవరం ఎందుకు పూర్తి చేయలేదని, యువతకి ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదని నిలదీసినందుకే ఆధారాలు లేని కేసులో అక్రమ అరెస్టు చేసి చంద్రబాబుని జైలులో వేశారన్నారు. ఇది ముమ్మాటికీ కక్షసాధింపు చర్యేనన్నారు. తాను యువగళం పాదయాత్ర ద్వారా అరాచక సర్కారుపై ప్రజల్ని చైతన్యపరుస్తుంటే…ఇదిగో ఇలా తప్పుడు కేసుతో యువగళం ఆగిపోయేలా చేశారని మండిపడ్డారు.
ఈ తప్పుడు కేసులన్నీ ప్రజల్లో ఉంటోన్న తెలుగుదేశం పార్టీని కట్టడి చేయడానికి నేను, చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే కుట్రల్లో భాగమేనన్నారు. తాను లండన్‌లో ఉన్నప్పుడు తనకి తెలియకుండా చంద్రబాబు అరెస్టు జరిగిందని జగన్ అంటున్నారని, ఏసీబీ-సీఐడీ సీఎం కింద పనిచేస్తాయనే కనీస అవగాహనలేని పిచ్చి జగన్ డిజిపి దగ్గర పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నా ఈరోజే ఎంత సమయమైనా ఉంటా అని చెప్పానని, మళ్లీ రేపు రమ్మని 41a నోటీసు ఇచ్చారని, ఉదయం 10గంటలకు హాజరు అవుతానని స్పష్టం చేశారు. తప్పుచేయనప్పుడు తానెందుకు భయపడాలని ప్రశ్నించారు.