Suryaa.co.in

Andhra Pradesh

లాలూచీ, కేసుల మాఫీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్న జగన్ రెడ్డి

-కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల కోసం టీడీపీ పోరాటం
– తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

కృష్ణా జలాల్లో హక్కులు కోల్పోతే రాష్ట్రం ఎడారిగా మారిపోతుందని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. కృష్ణా జలాల పునపరిశీలనపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు అధికారం కట్టబెట్టడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన వ్యవసాయ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.

25 మందికి 25 మంది ఎంపీలను ఇస్తే విభజన హామీలను నెరవేర్చడంతో పాటు ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ రెడ్డి ప్రగల్బాలు పలికారు. నేడు 31 మంది ఎంపీలు ఉన్నా.. లాలూచీ, కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని స్టీరింగ్ కమిటీ సభ్యులు మండిపడ్డారు. రాష్ట్రానికి మేలు చేయకపోగా మరింత నష్టం చేకూరుస్తున్నారన్నారు. తెలంగాణలో ఆస్తులు కాపాడుకోవడం కోసం లాలూచీ పడుతున్నారు.

పోలవరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జగన్ రెడ్డి వైఫల్యాలను చంద్రబాబు ఎండగట్టడం వల్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. నేడు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం జరుగుతోంది. కృష్ణా జలాల్లో హక్కులు కోల్పోతే రాష్ట్రంలో లక్షలాది ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడుతుంది. మిగులు జలాలపై అధికారం దిగువ రాష్ట్రాలకే ఉంటుంది. దీనిని పునసమీక్ష చేయడం అంటే రాష్ట్ర ప్రయోజనాలను కాలరాయడమే.

కనీసం తాగునీరు కూడా లభించని పరిస్థితి ఏర్పడుతుంది. జగన్ రెడ్డి కనీస అవసరాలను కూడా తాకట్టుపెడుతున్నారు. రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి. ఇప్పటికే వర్షాభావంతో కరవు తాండవిస్తోంది. దాదాపు 30 లక్షల ఎకరాల్లో విత్తనం పడలేదు. ఇప్పుడు నీటి హక్కులను కాపాడటంలో కూడా విఫలమయ్యారు.

ఈ నేపథ్యంలో కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులు కాపాడటం కోసం టీడీపీ పోరాటం చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి రంగ నిపుణులు, మేధావులు, రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడంతో పాటు ఆయా జిల్లాల్లో రైతులు, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ బహిరంగ సభల ఏర్పాటు, కరపత్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనిపై భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కాలవ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, కూన రవికుమార్, బోడె ప్రసాద్, యరపతినేని శ్రీనివాసరావు, బీసీ జనార్థన్ రెడ్డి, జ్యోతుల నెహ్రూ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యార్లగడ్డ వెంకట్రావు, మన్నవ సుబ్బారావు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, అక్తర్ చాంద్ బాష, గోనుగుంట్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE