11 కోట్ల రూపాయలు పార్టీకి విరాళంగా ఇచ్చిన వ్యక్తి భూమిని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే 22A నుంచి తొలగించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
మరి చుట్టుపక్కలా ఉన్న భూములను 22A నుంచి ఎందుకు తొలగించలేదు??
లేని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో అవకతవకలు జరిగాయని కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం… అష్ట వంకర్లు తిరిగిన భోగాపురం రోడ్డు అలైన్మెంట్ మార్పుపై ఎందుకు కేసులు పెట్టలేదు?
దళితున్ని హత్య చేసి శవాన్ని పార్సిల్ చేసిన వ్యక్తి కి జైల్లో సకల రాజభోగాలు… చేయని అవినీతికి జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి ములాఖాత్ పై ఆంక్షలా?
నారా భువనేశ్వరి కి సంఘీభావం తెలపడం కూడా నేరమేనా??
మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?… కష్టంలో ఉన్న వ్యక్తికి సంఘీభావం తెలిపితే వీరి సొమ్ము పోయేదేముంది?
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
అవినీతికి ఆమడ దూరంలో ఉంటూ, క్విడ్ ప్రోకో ఊసే అసలు ఏమాత్రం తెలియని అమాయక చక్రవర్తులైన శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తోపాటు ఎన్నో కేసుల్లో A2 నిందితునిగా ఉన్న శ్రీమాన్ విజయ సాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డిలు ఎన్నికలకు ముందు పార్టీకి 11 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చిన వ్యక్తి భూమిని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 22A నుంచి తొలగించడాన్ని, ఏమంటారో చెప్పాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.
గత ఎన్నికలకు ముందు ఎంవివి బిల్డర్స్ పేరిట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 9 కోట్ల రూపాయల విరాళాన్ని అందజేశారు. ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణ తన బ్యాంకు ఖాతా నుంచి నేరుగా మరొక రెండు కోట్ల రూపాయలను 2018 ఆగస్టు 31 వ తేదీన మా పార్టీకి విరాళంగా అందించారని తెలిపారు. బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఎన్నికలకు ఆరు నెలల ముందుగా, ప్రజలు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా గుర్తించిన ముళ్ళపూడి వీర వెంకట సత్యనారాయణ, వైకాపాకు పెద్ద మొత్తంలో విరాళాన్ని ముట్ట చెప్పారు.
విశాఖపట్నం జిల్లా మధురవాడలో వీర వెంకట సత్యనారాయణ 10 ఎకరాలలో ఒక పెద్ద హౌసింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. అప్పటికి ఆ స్థలంలో నిర్మించిన ఇండ్లు రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో, కొనుగోలుదారుల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావించిన ఆయన, తన కంపెనీ ద్వారా, వ్యక్తిగతంగా మొత్తం 11 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించి చెక్కుల ద్వారా ఆ మొత్తాన్ని అందజేశారు .
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2019, అక్టోబర్ 28 వ తేదీన సత్యనారాయణ కు చెందిన 10 ఎకరాల స్థలాన్ని 22A నుంచి ప్రభుత్వం తొలగించింది. కేవలం 10 ఎకరాల స్థలాన్ని మాత్రమే 22A నుంచి తొలగించి, మిగతా స్థలాలను ఎందుకు తొలగించ లేదన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది. క్యాష్ కొట్టు…22A నుంచి మినహాయింపు పట్టు అన్నట్లుగా గతంలో విశాఖపట్నం పాలెగాళ్లుగా వ్యవహరించిన వారు ఓపెన్ ఆఫర్ ప్రకటించారు.
విశాఖలోని సమస్యాత్మక భూములను 22A నుంచి మినహాయించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలోని అంకురార్పణ చేసింది. ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 9 కోట్ల రూపాయలు, రెండు కోట్ల రూపాయలు వేరు, వేరుగా విరాళంగా అందజేసిన వ్యక్తికి సంబంధించిన పది ఎకరాల స్థలాన్ని ( సర్వేనెంబర్ 358 ) 22A నుంచి తొలగించడం క్విడ్ ప్రోకో కాకపోతే, మరేమిటో చెప్పాలి. అడంగల్ రిపోర్టులో ఇప్పటికీ ఆ పది ఎకరాల స్థలం ప్రభుత్వ భూమి గానే పేర్కొనడం జరిగిందని, నివేదిక ప్రతులను మీడియా ప్రతినిధుల ముందు రఘురామకృష్ణం రాజు ప్రదర్శించారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ స్కామ్ లో భాగంగా తెదేపాకు 27 కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు వచ్చాయని సిఐడి చీఫ్ సంజయ్, రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డిలు పేర్కొంటున్నారు. ఎన్నికల బాండ్ల గురించి ఎవరికీ మాట్లాడే అధికారం లేదు. ఎన్నికల బాండ్లను ఇచ్చిందెవరో చట్ట ప్రకారం తెలుసుకునే అవకాశం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రూ డెన్షియల్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నుంచి ఎన్నికలకు ముందే 27 కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు సమకూరాయి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రివర్స్ టెండరింగ్ లో లబ్ధి పొందిన వారే ప్రూడెన్షియల్ ఎలక్ట్టోరల్ ట్రస్టులో పెట్టుబడులను పెట్టి, ఆ నిధులను ఎన్నికల బాండ్ల రూపంలో మా పార్టీకి అందజేశారని తెలిసింది. ఆండ్రూ మినరల్స్ కంపెనీ ఎన్నికలకు ముందు మా పార్టీకి 11 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినప్పటికీ, మేలు చేయకపోగా వారి మైనింగ్ కంపెనీని లాక్కొని ప్రభుత్వ పెద్దలు తనకు వరుస కు బాబాయ్ అయ్యే వ్యక్తికి ఆయన అబ్బాయికి కట్టబెట్టారు.
ఆండ్రూ మినరల్స్కంపెనీ పేరిట తొమ్మిది కోట్ల 50 లక్షల రూపాయలు, అదే రోజు ఆండ్రూ ఉషారాణి 30 లక్షలు, ఆండ్రూ అనంతపద్మకోటి సత్యవతి 35 లక్షలు, సుజాత ఆండ్రూ 30 లక్షలు , ఆండ్రూ శ్రీనివాస్ 20 లక్షల రూపాయలు అందజేశారు. అయితే ఆండ్రూ ఫ్యామిలీ అక్కడ ఉన్నది ఆవు అనుకొని విరాళాన్ని అందజేయగా,అది తమని తినేసిన తర్వాత సింహం అని వారికి తెలిసింది.
ఎన్నికలకు ముందే 80 కోట్ల రూపాయలు విరాళంగా అందజేసిన వారికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ మార్గాలలో మేలు చేకూర్చడాన్ని క్విడ్ ప్రోకో కాకపోతే మరేమనాలని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. మధురవాడలోని సర్వేనెంబర్ 358లో ఎన్నికలకు ముందు విరాళాన్ని ఇచ్చిన వ్యక్తి స్థలానికి మినహాయింపు ఇచ్చి, మిగతా వారికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
లేని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అవకతవకలు జరిగాయని కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం… బీచ్ రోడ్డు నుంచి పోర్టు రోడ్డును కలుపుతూ భోగాపురం వరకు నిర్మించిన ఆరు వరుసల రహదారి అలైన్మెంట్ నుంచి కొన్ని స్థలాలకు మినహాయింపునిచ్చారు. ఆరు వరసల రహదారి అష్టవంకరలు తిరిగినా, అలైన్మెంట్ మార్పుపై ఎందుకు కేసు నమోదు చేసి విచారించడం లేదని ప్రశ్నించారు.
దోపిడీకి కాదేది అనర్హం
అగ్గిపుల్ల , సబ్బు బిళ్ళ, కుక్క పిల్ల కాదేది కవిత కనర్హమని ప్రముఖ కవి శ్రీ శ్రీ అన్నట్టుగానే బడి , తడి , గుడి , మడి కాదేది దోపిడీ కనర్హమని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. బెల్లం చుట్టూ ఈగలు ముగినట్లుగా ముఖ్యమంత్రితో సహా ఆయన పాలెగాళ్లు విశాఖపట్నం చుట్టూ చేరుతున్నారు. అమ్మ ఒడి నాన్న గొంతు తడిగా మారింది. బడిలో తీవ్రస్థాయిలో దోపిడి జరుగుతోంది. విద్యను ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుడు అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి విద్యారంగాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న దోపిడి గురించి త్వరలోనే స్పష్టమైన ఆధారాలను తెలియజేస్తా.
విజయనగరం జిల్లాలోని భోగాపురం లో జిఎంఆర్ సంస్థ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనుంది. భోగాపురం విమానాశ్రయం చేరుకోవడానికి విశాఖలోని బీచ్ రోడ్డు నుండి, పోర్టు రోడ్డును కలుపుతూ ఆరు వరసల ప్రధాన రహదారిని నిర్మించారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి గతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయగా, ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
ఎన్నికలకు ముందు మరొకసారి శంకుస్థాపన చేస్తారేమో. బీచ్ రోడ్డు నుండి భోగాపురం వరకు నిర్మించిన రహదారి అష్ట వంకర్లు తిరిగేలా అలైన్మెంట్ మార్చారు. విశాఖ నుంచి భీమిలి వెళ్లే దారిలో రాడిసన్ అనే హోటల్ ఉంటుంది. అలైన్మెంట్ ప్రకారం ఈ హోటల్ లోని కొంత భాగాన్ని రహదారి నిర్మాణం కోసం సేకరించాల్సి ఉండగా, అప్పటి విశాఖపట్నం పాలెగాడు రంగ ప్రవేశం చేసి అలైన్మెంట్ ను ఎడమవైపు మార్చి, ఆ హోటల్ కు ఏమీ కాకుండా జాగ్రత్త పడ్డారు.
వుడా విక్రయించిన భూముల మీదుగానే అలైన్మెంట్ మార్చడంతో ఆదిభట్ల నగర్లోని ముందు వరస ప్లాట్ల యజమానులు వంద మీటర్ల తమ స్థలాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దానికి ప్రతిఫలంగా తన బినామీల పేరిట ఉత్తి పుణ్యానికి రాడిసన్ హోటల్ హక్కులను 50 శాతం సదరు పాలె గాడు రాయించుకున్నారు. భోగాపురం విమానాశ్రయం నుంచి, విశాఖపట్నం కు వచ్చే దారిలోని నేరెళ్ల వలస అనే గ్రామంలో విజయ్ సాయి రెడ్డి 30 ఎకరాల భూములను కొనుగోలు చేశారు. ఈ భూముల కొనుగోలు వ్యవహారం వెనుక మా పార్టీ అగ్ర నాయకుడు ఉన్నారా?
ఇంకా ఎవరు ఉన్నారన్నది స్థానిక ప్రజలకు తెలుసు. భోగాపురం రహదారి నిర్మాణం అలైన్మెంట్ కు తొలుత ఈ భూములు దూరంగా ఉండగా, అలైన్మెంట్ ను మార్చి భూముల పక్కనుంచే ఆరు వరుసల రహదారిని నిర్మించారు. మూలకుదురు గ్రామం లోనూ 32 ఎకరాల భూమిని విజయసాయిరెడ్డి కొనుగోలు చేశారు. ఈ భూముల కొనుగోలు వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారన్నది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తేలుస్తాం . భోగాపురం రహదారి అలైన్మెంట్లో మార్పులు జరిగిన తరువాత ఈ మూడు వ్యవహారాలు వెలుగులోకి రాగా , ఇంకా వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి.
విశాఖపట్నంలో వేల ఎకరాల భూములను లుంగీ బ్యాచ్ ఇచ్చినంత తీసుకొని, వచ్చి సంతకం పెట్టి వెళ్లాలని బెదిరింపులకు దిగుతూ కబ్జాలు చేశారు. భోగాపురం ప్రధాన రహదారి పక్కన భూములు ఉన్న యజమానులంతా ఎంతోకొంత సమర్పించుకోవాల్సిందేనని హుకుం జారీ చేశారు. లేకపోతే తమకు ఇబ్బందులు తప్పవని తెలుసుకొని వారే డబ్బులు ముట్ట చెప్పినట్లు తెలిసింది. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ లో అవకతవకలంటూ కేసులను పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్న విఎమ్ఆర్డిఏ భోగాపురం రోడ్డు అలైన్మెంట్ లో జరిగిన అక్రమాలపై ఎందుకు కేసులు పెట్టడం లేదు.
కావాలంటే విశాఖపట్నం జర్నలిస్టులు భోగాపురం రహదారిని పరిశీలించవచ్చు. లేని ఇన్నర్ రింగ్ రోడ్ లో అలైన్మెంట్ మార్చిన వారు దొంగలా, నిర్మించిన భోగాపురం రహదారి అలైన్మెంట్ మార్చినవారా? ఎవరు దొంగలో… ఎవరు దొరోలో చెప్పాలని రఘురామకృష్ణం రాజు కోరారు . విశాఖపట్నంలో దొరికిన కాడికి దోచుకొని, ఇక్కడ మాత్రం ఇతరుల మీదికి తోసివేయాలని చూస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలని ఆలోచన రావడమే తప్పు అన్నట్లుగా కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది.
అవినీతి ఊసునే భరించలేని జగన్మోహన్ రెడ్డి తోపాటు ఎన్నో కేసుల్లో తన సహ నిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి, ఆయన అనుమతులు లేకుండానే ఇంత దర్జాగా భూములను కొట్టేయగలరా? అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ముడసరి లోవాలో రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ చుట్టుపక్కల ప్రహరీ గోడను నిర్మించారు. రిజర్వాయర్ పక్కనే ఉన్న పార్కును దీర్ఘ కాలం పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు లీజుకు ఇవ్వడం కోసమే ఆ ప్రహరీ గోడను నిర్మించినట్లు స్పష్టమవుతుంది. రెండు జాతీయ రహదారుల మధ్య ఉన్న నీల కుండీలు అనే గ్రామంలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు అడ్డంగా పెట్టుకుని వైకాపా నాయకులు 120 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు పక్కా సాక్షాధారాలు ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
నిమిషానికొక రూల్ మారుస్తున్న జైల్లో శాఖ డిఐజి రవికిరణ్ రెడ్డి
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో నిమిషానికొక నిబంధనను జైళ్ల శాఖ డిఐజి రవి కిరణ్ రెడ్డి మారుస్తున్నారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. దళిత యువకుడిని హత్య చేసి ఆయన ఇంటికి శవాన్ని పార్సిల్ చేసిన వ్యక్తికి అదే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో సకల సౌకర్యాలను కల్పించారు. మూలాఖత్ ద్వారా ఎవరిని అంటే వారిని కలుసుకునే అవకాశాన్ని కల్పించిన జైలు అధికారులు, ఇప్పుడు తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని న్యాయవాదులు కలుసుకోవడానికి కూడా ఆంక్షలు విధించడం ఆశ్చర్యంగా ఉంది.
చంద్రబాబు నాయుడు ను ములాఖత్ ద్వారా న్యాయవాదులు, ఆయన కుటుంబ సభ్యులు కలుసుకుంటే ఇతర ఖైదీలకు ఇబ్బందిగా ఉందట. అందుకే జైలుల శాఖ డిఐజి రవి కిరణ్ రెడ్డి నిమిషానికి ఒక నిబంధనను మారుస్తున్నారంటూ రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు.. విజయవాడ వరకే పరిమితమైన 144 సెక్షన్, ఇప్పుడు రాష్ట్రమంతా అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు.
చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరుని కలుసుకొని ఆమెకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చే వారిని రాజమండ్రి కి రాకుండా నిలువరిస్తున్నారు. నారా భువనేశ్వరి ని కలుసుకొని సంఘీభావం తెలియజేయడానికి కూడా ఆంక్షలు విధించడం ఆశ్చర్యంగా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణించిన రెండేళ్ల అనంతరం పెయిడ్ బ్యాచ్ ను వేసుకుని ఓదార్పు యాత్ర అని చేపడితే ఆనాటి ప్రభుత్వం ఏమైనా ఆంక్షలు విధించిందా? అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్న ప్రస్తుత ప్రభుత్వ విధానాలను విజ్ఞులైన ప్రజలు ఆలోచించి, తీవ్రంగా వ్యతిరేకించాలని రఘురామకృష్ణంరాజు కోరారు.