– మేడ్చల్ ‘ప్రజా ఆశీర్వాద సభ’ లో సీఎం కేసీఆర్
పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మేడ్చల్ జిల్లా ఏర్పాటు చేశాం. కొత్త కలెక్టరేట్ ను కూడా ప్రారంభించాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుంటే మేడ్చల్ జిల్లా ఏర్పడేదే కాదు. మేడ్చల్ జిల్లా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎంతో చైతన్యవంతులు. ఇరవై ఏండ్ల క్రితం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిననాడు అందరూ నవ్వులాటగా తీసుకున్నారు.
ఆనాడు నామీద ఎన్నోరకాల నిందలు వేసి, అవమానాలు చేసి, ఎన్నిరకాల అవహేళనలు చేసిండ్రో మీకందరికీ తెలుసు. ఆనాడు కరెంటు లేదు..మంచినీళ్లు లేవు..సాగునీళ్లు లేవు.. పాలమూరు లాంటి జిల్లాలు సగానికి సగం ఖాళీ అయి బొంబాయి లాంటి ప్రాంతాలకు ప్రజల వలసలు పోయే హృదయవిదారకమైన దృశ్యాలుండేవి.
నాడు భూదాన్ పోచంపల్లిలో ఒకటే రోజు ఏఢుగురు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే నేను దు:ఖపడి, ఆనాటి ముఖ్యమంత్రిని జోలెపట్టి అడిగినా ఒక్క రూపాయి కూడా సహాయం చెయ్యలేదు.దుర్మార్గమైన పరిపాలనలో తెలంగాణ ప్రజలు రెండవ తరగతి స్థాయి ప్రజలుగా చూడబడుతూ చాలా అవహేళనకు గురవుతూ, అవమానాలకు గురయిన సంగతి మనకు తెలిసిందే.
ఆనాటి శాసనసభా సమావేశాల్లోనే ‘‘నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను..ఏం చేసుకుంటారో చేస్కొండని’’ అంటే తెలంగాణ ప్రాంత నాటి ఎమ్మెల్యేలు ఒక్కరూ కూడా ఎదురు ప్రశ్నించలేదు. బానిసల్లాగా పడున్నటువంటి దుస్థితి ఉండేది.1956 నాడు ఆనాటి కాంగ్రెస్ నాయకులే కేంద్రానికి లొంగిపోయి, చిన్న పొరపాటు చేస్తే 58 ఏండ్లు మనం గోస పడ్డాం. మంచినీళ్లు కూడా లేనటువంటి భయంకరమైన బాధలు పడ్డాం.
నాడు కరెంటు కోతలతోని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి మనందరికీ తెలిసిందే. నేడు తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్. మిషన్ భగీరథను విజయవంతం చేసుకుని తాగునీటిలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా ఉంది.
కుల,మతాలు లేకుండా తెలంగాణ బిడ్డలందరూ మనవాళ్లేనని పేదలందరినీ ఆదుకుంటూ ముందుకు పోతున్నాం. దాదాపు 40, 50 లక్షల విలువు ఉండే ప్లాట్లను ఒక్క రూపాయి కూడా లేకుండా పేదలకు 26 వేల ఇండ్లను ఉచితంగా ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కింది. హైదరాబాద్ లోని పేదలకు మరో లక్ష ఇండ్లను కట్టిస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేశాం.
పదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఈ అభివృద్ధి పరంపర ఇట్లాగే కొనసాగాలి. ఉన్న తెలంగాణాను ఊడగొట్టి, 50 ఏండ్లు మనల్ని రాచిరంపాన పెట్టిందెవరో.. మనం తిరుగుబాటు చేసిన్నాడు మన తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపిందెవరో మీరందరూ ఒక్కసారి ఆలోచన చెయ్యాలె. మళ్లీ కాంగ్రెసోళ్ల చేతుల్లో పడితే.. కరెంట్ బాధలతో పరిశ్రమలన్నీ బంద్ అయితయ్. మీరందరూ ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉండాలెనని మనవి.
ఆపదమొక్కులు మొక్కుతూ, ఇష్టారీతిన మాట్లాడేవాళ్లు వస్తరు..జాగ్రత్త. ఆనాడు కరెంటు ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయి రైతులు ఏడుస్తుంటే ఏ ఒక్కరూ మనల్ని పట్టించుకోలేదు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతల, ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టులు కట్టుకొని సాగునీళ్లు తెచ్చుకుంటున్నాం.
మేడ్చల్ నియోజకవర్గంలోనే దాదాపు రూ.350 కోట్లతో మంచినీళ్ల బాధ లేకుండా ఏర్పాట్లు చేసుకున్నాం. మేడ్చల్, ఎల్.బి.నగర్, ఉప్పల్, కుత్భుల్లాపూర్ నియోజకవర్గాలు మినీ భారత దేశాలు. మన రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రజలూ వస్తుంటారు. వివిధరకాల పనుల కోసం పేదలు ఇక్కడికి వస్తుంటారు. మేడ్చల్ జిల్లాలోని నియోజకవర్గాల అభివృద్ధికి రాబోయే రోజుల్లో ప్రత్యేక బడ్జెట్ పెట్టి తగిన చర్యలు తీసుకుంటాం.
రైతుబీమా తరహాలో రాష్ట్రంలోని 93 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ‘కేసీఆర్ బీమా – ప్రతి ఇంటికి ధీమా’ పేరుతో ప్రతి కుటుంబానికి సాయమందిస్తాం.‘అన్నపూర్ణ పథకం’ ద్వారా తెల్లరేషన్ కార్డులందరికీ సన్న బియ్యం సరఫరా చేస్తాం.
పెన్షన్లను దశలవారీగా ఐదు వేల రూపాయలకు పెంచి అందజేస్తాం. ‘సౌభాగ్య లక్ష్మీ పథకం’ ద్వారా అర్హులైన పేద మహిళలందరికీ నెలకు రూ.3 వేల గౌరవ భృతిని అందజేస్తాం.‘రైతు బంధు’ ను వచ్చే ఏడాదికి రూ.12 వేలకు పెంచి, ప్రతి సంవత్సరం పెంచుకుంటూ రూ.16 వేలు అందజేస్తాం.
అగ్రవర్ణ పేద పిల్లలకు ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున మొత్తం 119 గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తాం.కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి, కష్టపడి పైకొచ్చిన వ్యక్తి అయిన చామకూర మల్లారెడ్డి కి ఘన విజయం చేకూర్చాలని మనవి చేస్తున్నాను. మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను నేను తీసుకుంటున్నాను.