Suryaa.co.in

Telangana

బీజేపీ మాటల నమ్మి మోసపోవద్దు

ఎన్నికలప్పుడు ముఖం చూపించేవారు కావాలా?
మీతో ఉండే నేను కావాలా?
విపక్షాల మాట వింటే అభివృద్ధికి దూరం
వాళ్లలో ఎవరూ ఇక్కడ ఉండేవాళ్లు కాదు
మీకోసం నిరంతరం పనిచేసే సేవకుడిని
జనంలో ఉండే మీ వాడిని
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఎన్నికల సమయంలో మాయమాటలతో వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దని సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శుక్రవారం బన్సీలాల్ పేట డివిజన్ లోని భోలఖ్ పూర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మల్లన్న దేవాలయం నుండి పాదయాత్రను ప్రారంభించి ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలుస్తూ మేకల మండి ప్రభుత్వ పాఠశాల వరకు ఈరోజు ప్రచారం కొనసాగింది. ప్రతి ఇంట మంత్రికి ఘనస్వాగతం పలికారు.

మంగళ హారతులు పట్టి, నుదుటన కుంకుమ తిలకం దిద్దారు. శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇండ్లపై నుండి తమ అభిమాన నాయకుడిపై పూల వర్షం కురిపించారు. ప్రతి ఒక్కరు మీకే మా ఓటు అంటూ ప్రకటించారు. హరిజన బస్తీ, మేకల మండి ప్రభుత్వ పాఠశాలల వద్ద స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాత్రమే ఓట్లకోసం గద్దల్లా వాలిపోతారని, ఎన్నికల అనంతరం అడ్రస్ ఉండరని విమర్శించారు. మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అత్యధికంగా నిరుపేదలు నివసించే హరిజన బస్తీలో అర్హులైన దళిత బందు, పక్కా ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకం క్రింద 3 లక్షల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించే విధంగా కృషి చేస్తానని ప్రకటించారు.

పేదల పాలిట గుదిబండ గా మారిన 1200 రూపాయలు ఉన్న వంట గ్యాస్ సిలెండర్ ను 400 రూపాయలకే అందించడం జరుగుందని చెప్పారు. రేషన్ ద్వారా సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. హిందూ, ముస్లీం, క్రిస్టియన్, సిక్కు అనే తేడా లేకునా అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నామని తెలిపారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా మీకు అండగా ఉంటాననే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. ఈ ప్రాంతం నుండి గతంలో గెలుపొందిన వారు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వచ్చే వారని, మిగతా సమయాలలో అందుబాటులో ఉండేవారు కాదని పేర్కొన్నారు.

కానీ తాను నిరంతరం ప్రజల మద్యనే అన్ని వేళలా ఆందుబాటులో ఉంటున్న విషయం అందరికీ తెలిసిందేనని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎలా ఉన్న సనత్ నగర్ నియోజకవర్గం 2014 తర్వాత ఎంత అభివృద్ధి చెందిందో కండ్ల ముందు కనిపిస్తుందని తెలిపారు. ఎవరు ఊహించని రీతిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. మేకల మండి ప్రభుత్వ పాఠశాల ను కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చేశామని, వచ్చే విద్యా సంవత్సరం నుండి ఉన్నత పాఠశాల గా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పారు.

విద్యార్ధులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పెద్ద మనసుతో విద్యార్ధులకు ఉచితంగా అల్పాహారం కూడా అందిస్తున్నారని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు మన బస్తీ మన బడి కార్యక్రమం క్రింద అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్బంగా పలువురు విద్యార్ధుల తల్లిదండ్రులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాని వారికి కూడా వస్తాయని, ఇప్పటికే లక్ష ఇండ్లు నిర్మించి 70 వేల ఇండ్లను పంపిణీ చేయడం జరిగిందని, ఇంకో ౩౦ వేల ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు.

మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం నిర్మిస్తదని ప్రకటించారు. జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని, నవంబర్ ౩౦ వ తేదీన జరిగే ఎన్నికలలో మరోసారి కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీ సమస్యలను పరిష్కరించే బాద్యత నాదేనని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్, బీజేపీ లను ప్రజలు నమ్మడం లేదు….తలసాని
కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మడం లేదని, ఈ సారి కూడా తిరిగి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. 50 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాడు చేయని అభివృద్దిని నేడు చేస్తామంటే ఎవరు నమ్మరని అన్నారు. సనత్ నగర్ నుండి గతంలో ఎమ్మెల్యే గా గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా ఉన్న మర్రి చెన్నారెడ్డి, ఆయన కొడుకు శశిధర్ రెడ్డి ఉన్నతమైన పదవులు అనుభవించి నియోజకవర్గానికి ఏం చేయలేదని విమర్శించారు.

నియోజకవర్గ పరిధిలో ఎన్ని బస్తీలు ఉన్నాయో కూడా వారికి తెలియదని, కారణం వారు ఎన్నికల తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండకపోవడమేనని అన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాలలో ఈ ప్రాంత ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని అన్నారు. తాను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగానని, నిరంతరం ప్రజల మద్య తిరుగుతున్న కారణంగా అన్ని ప్రాంతాలపై, ప్రజల సమస్యలపై పూర్తిస్థాయి అవగాహన ఉందని పేర్కొన్నారు.

మంత్రి వెంట కార్పొరేటర్ హేమలత, మాజీ కార్పొరేటర్ సావిత్రి, పద్మారావు నగర్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, డివిజన్ బీఆర్‌ఎస్‌ అద్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు, ఏసూరి మహేష్, ప్రేమ్, శ్రీకాంత్ రెడ్డి, లక్ష్మీపతి, మహేందర్, అరుణ్ గౌడ్, నాగలక్ష్మి, లక్ష్మి, అనితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE