మాపై నిందలు నిరాధారం
పార్టీ మారుతున్నారన్న వార్తల్లో నిజం లేదు
టీడీపీ బలోపేతానికే పార్టీలో చేరాం
బాబుకు కార్యకర్తల మనోభావాలు వెల్లడిస్తాం
టీడీపీ జాతీయ కార్యదర్శి వీరేశం
వచ్చే ఎన్నికల్లో తాను పరిగి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమని టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేశం ముదిరాజ్ స్పష్టం చేశారు. దీనికి భిన్నంగా సోషల్ మీడియాలో వస్తున్న దుష్ర్పచారాన్ని నమ్మవద్దని కోరారు. పరిగి నుంచి తాను పోటీ చేయడం ఖాయమన్నారు. క్యాడర్ కోరికకు భిన్నంగా వ్యవహరించనని స్పష్టం చేశారు. తాను పరిగిలో చాలాకాలం నుంచి క్యాడర్ను సిద్ధం చేశానని, విస్తృతమైన పార్టీ కార్యక్రమాలు నిర్వహించానని గుర్తు చేశారు.
ఇక టీడీపీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించేందుకు, అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ భేటీ అవుతున్నారని చెప్పారు. ఈలోగానే పార్టీ పోటీ చేయదంటూ సోషల్మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. పోటీపై తమకే ఇంకా అధికార సమాచారం తెలియనప్పుడు, పోటీ చేయదంటూ సోషల్మీడియాలో ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. ఇటీవల నిర్వహించిన పార్లమెంటు జిల్లా అద్యక్షుల సమావేశంలో పాల్గొన్న అధ్యక్షులంతా.. ఎన్నికల్లో పోటీ చేయాలని తీర్మానించారని గుర్తు చేశారు. ఆ మేరకు పార్టీ నాయకత్వం వద్ద అభ్యర్ధుల దరఖాస్తులు కూడా ఉన్నాయని చెప్పారు.
పరిగిలో తాను పోటీ చేస్తానని వీరేశం ముదిరాజ్ స్పష్టం చేశారు. తమ కుటుంబంపై కొందరు కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు. తాము రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేయడానికే పార్టీలో చేరామని వీరేశం స్పష్టం చేశారు.
‘’కాసాని వీరేష్ పరిగి అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తారా చేయరా అసలు రేస్ లో ఉంటారా ఉండరా, అని ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదు. కొంత మంది సోషల్ మీడియాలో పరిగి బరిలో ఉండటం లేదు అని హల్చల్ చేస్తున్నారు. ఇందులో నిజం లేదు. ఇది ముమ్మాటికీ నిజం కాదు. నేను 100% పోటీ చేస్తున్నాను. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదు. నేను పోటీ చేస్తున్నాను. పరిగి ప్రజల ఆశీస్సులతో ముందుకు వస్తున్నాను. మీ ఆశీస్సులు ఎల్లవేళలా నాపై ఉండాలి ఇన్ని రోజులు జరగని అభివృద్ధి మనం చేసి చూపిద్దాం. ఎవరు ఏమి చెప్పినా నమ్మవద్దు ఈసారి బరిలో ఉంటున్నాను‘’ అని వీరేశం స్పష్టం చేశారు.