– కీలక అంశాలను పేర్కొన్న హైకోర్టు
అనారోగ్య కారణాల రీత్యా టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనికి ఉత్తర్వుల్లో ఉన్నత న్యాయస్థానం వివిధ కీలక అంశాలను పేర్కొంది. అనారోగ్య కారణాల రీత్యా తెదేపా అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాదుల వాదనలతో ఉన్నత న్యాయస్థానం ఏకీభవించింది. మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల్లో వివిధ కీలక అంశాలను పేర్కొంది.
పిటిషనర్‌కు సమగ్రమైన వైద్య చికిత్స అవసరమని హైకోర్టు విశ్వసించింది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై నిర్ణయం వచ్చేవరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు చర్మ, హృదయ సంబంధిత సమస్యలకు చికిత్సతో పాటు తక్షణం ఆయన కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరగాలన్న పిటిషనర్ తరఫున వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి న్యాయప్రక్రియ నుంచి తప్పించుకునే వ్యక్తి కాదని అభిప్రాయపడింది. సమాజంతో బలమైన సంబంధ బాంధవ్యాలు కలిగినవారని భావిస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
చంద్రబాబు వ్యక్తిగత వైద్యులు, ప్రభుత్వ వైద్యుల నివేదికల్లో పెద్దగా వ్యత్యాసాలు లేవు. విచారణలో ఉన్నప్పుడు నేరారోపణలు ఎంత తీవ్రమైనవి అయినా వ్యక్తి ఆరోగ్య సమస్యలకు చికిత్స నిరాకరించడం సాధ్యం కాదు. అభియోగం ఎదుర్కొంటూ జైలులో ఉన్న వ్యక్తికి సమగ్ర చికిత్స తీసుకునే హక్కు ఉంటుందని విశ్వసిస్తున్నాం. తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు తగిన వైద్యం పొందేందుకు అవకాశమివ్వాలి. ప్రాణాపాయంలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న అంశానికి పరిమితం కాలేం. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నప్పుడు విచక్షణతో బెయిల్ ఇవ్వొచ్చు.
పిటిషనర్ ఆరోగ్య సమస్యలకు తక్షణ చికిత్స అందాలన్న అంశంలో ఎలాంటి వివాదం లేదు. కుడి కంటికి శస్త్రచికిత్స ప్రధానమైంది. వైద్యం ఎక్కడన్నది పిటిషనర్ ఇష్టానికే వదిలేస్తున్నాం. ఎడమ కంటికి సర్జరీ జరిగిన ఆస్పత్రిలోనే కుడి కంటికి కూడా శస్త్రచికిత్సకు అనుమతివ్వడం సహేతుకం. పిటిషనర్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కేసు వివరాల్లోకి వెళ్లకుండా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నామని హైకోర్టు పేర్కొంది.