Suryaa.co.in

Telangana

ఎర్రవల్లిలో కేసీఆర్‌ రాజశ్యామల యాగం

– యాగాన్ని పర్యవేక్షిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం
– మూడు రోజులపాటు కొనసాగనున్న యాగం
– స్వరూపానందేంద్ర ఆశీస్సులు అందుకున్న కేసీఆర్‌
– కేసీఆర్‌ కుటుంబానికి రాజశ్యామల అనుగ్రహం ఉండాలన్న పీఠాధిపతులు

విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజశ్యామల యాగం చేపట్టారు. ఎర్రవల్లిలోని కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో బుధవారం ఉదయం యాగం ప్రారంభమైంది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో యాగానికి అంకురార్పణ జరిగింది. రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా దీనికి నామకరణం చేసారు. కేసీఆర్‌ దంపతులు యాగ సంకల్పం చెప్పి పండితులకు దీక్షా వస్త్రాలను ప్రదానం చేసారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 170 మంది రుత్విక్కులు ఇందులో పాల్గొంటున్నారు.

ఈసందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ రాజశ్యామల యాగం ప్రాముఖ్యతను వివరించారు. రుద్ర, చండీ, వనదుర్గ హోమాలు అన్నిచోట్లా జరుగుతాయని, రాజశ్యామల యాగం విశిష్టమైనదని తెలిపారు. రాజులతో పాటు సామాన్యులను అనుగ్రహించే రాజశ్యామల యాగం కఠినమైన భీజాక్షరాలతో కూడినదని వివరించారు. మహా శక్తివంతమైన రాజశ్యామల యాగ ఫలితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబానికే కాదని, యావత్‌ రాష్ట్రానికీ ఉంటుందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైందన్నా, హైదరాబాద్‌ మహానగరంగా అభివృద్ధి చెందిందన్నా గతంలో కేసీఆర్‌ చేసిన రాజశ్యామల యాగం ఫలితమేనని అన్నారు. మహాభారతం చదివిన జ్ఞాని కేసీఆర్‌ అని అభివర్ణించారు. ముఖ్యమంత్రులు ఎందరో తనకు తెలిసినా హైందవ తత్త్వం పరిపూర్ణంగా తెలిసిన నేత కేసీఆర్‌ మాత్రమేనని తెలిపారు.

బ్రాహ్మణుల సంక్షేమాన్ని కోరుకున్న కేసీఆర్‌ కుటుంబానికి రాజశ్యామల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు కొలువై ఉన్న ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదాపీఠమేనని స్పష్టం చేసారు. హిమాలయాల్లో మహాత్ముల చెంత అమ్మవారి ఉపాసన పొందానని తెలిపారు. కేసీఆర్‌ కుటుంబం, బంధుమిత్రులతో పాటు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ తదితరులు యాగంలో పాల్గొన్నారు.

శాస్త్రోక్తంగా యాగానికి అంకురార్పణ
తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని, సస్యశ్యామలం కావాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన ఈ యాగానికి రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా నామకరణం చేసారు. శాస్త్రోక్తంగా ప్రారంభమైన యాగం మూడు రోజులపాటు కొనసాగుతుంది.

ఉదయం గోపూజ అనంతరం కేసీఆర్‌ దంపతులు యాగశాల ప్రవేశం చేసారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసనతో యాగానికి అంకురార్పణ జరిగింది. కేసీఆర్‌ దంపతులు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి యాగంలో ఆసీనులయ్యారు. గురు ఆజ్ఞ తీసుకుని యాగాన్ని ప్రారంభించారు. కేసీఆర్‌ దంపతులతో స్వరూపానందేంద్ర స్వామి యాగ సంకల్పం చెప్పించారు.

విశాఖ శ్రీ శారదాపీఠ అధిష్టాన దైవం రాజశ్యామల అమ్మవారికి స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారిని వనదుర్గ అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని ముక్కోటి దేవతలను ప్రార్ధిస్తూ అస్త్ర రాజార్చన, కర్కరీయ స్థాపన నిర్వహించారు. అఖండ స్థాపన అనంతరం అగ్నిమధనం చేసి యాగశాలలో అగ్నిని ప్రతిష్టించారు.

LEAVE A RESPONSE