Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వం- పార్టీ ఒకటే అంటే ఒక్క ఐఏఎస్ అధికారి కూడా ప్రశ్నించరా?.. అంగీకరిస్తారా?

ఐఏఎస్ అధికారులను ప్రతి ఒక్కరూ అసహ్యించుకునే పరిస్థితి
రాష్ట్ర జి ఎస్ డి పీ బోగస్ అని కేంద్ర మంత్రిత్వ శాఖకు తెలిసినప్పటికీ ప్రశ్నించరు
మంగళవారం మాత్రం అప్పులు ఇస్తూనే ఉంటారు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కూడా తానా అంటే తందానా అంటున్నారు
రవిచంద్ర అనే నిజాయితీకి మారుపేరైన అధికారికి గత నాలుగు నెలలుగా పోస్టింగు ఇవ్వడం లేదు
ఐఏఎస్ లు జె పి ఎస్ గా మారిన ఐపీఎస్ లు
అమెరికా నుంచి రెండు కుక్కలు మొరగడం ప్రారంభించాయి

– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

ప్రభుత్వం పార్టీ వేరు కాదు… రెండు ఒకటే అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఒక్క ఐఏఎస్ అధికారి కూడా అది తప్పు అని ప్రశ్నించరా? ఎలా అంగీకరిస్తారు? అంటూ నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘు రామ కృష్ణంరాజు నిలదీశారు. ఐఏఎస్ అధికారులను నాతో పాటు నాలాగే గౌరవించే ప్రతి ఒక్కరూ అసహ్యించుకునే పరిస్థితిని తీసుకువస్తున్నారన్నారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఐఏఎస్ అధికారులు అంటే గతంలో ఎంతో ఉన్నతంగా వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు ఐఏఎస్ అధికారులు అంటే, అయ్యా… ఎస్ అధికారులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలకు ఊడిగం చేసే వ్యక్తులుగా ఐఏఎస్ అధికారులు ఎందుకు మిగిలి పోవాల్సి వస్తుందని ప్రశ్నించారు. ఎవరు మిమ్మల్ని ఏమి చేయలేరు కదా అంటూ నిలదీశారు. ప్రభుత్వ పెద్దలు తాము చెప్పినట్లు నడుచుకోవాలని బెదిరిస్తున్నారు… అవసరమైతే కేసులు పెడుతున్నారు.

ఇదే విషయాన్ని ఐఏఎస్ అధికారులు తమ అసోసియేషన్ లో మాట్లాడుకుని, ఉఫ్ మని ఊదితే, ముఖ్యమంత్రి గాలికి కొట్టుకుపోతారు. ఐఏఎస్ అధికారులు ఎందుకలా వ్యవహరించడం లేదు. ఎందుకీ నేలబారు వ్యవహారం… ఇంత నీచ స్థాయికి దిగజారాల్సిన అవసరం ఏమొచ్చిందని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి ఎన్ని కష్టాలు ఎదురవుతున్నప్పటికీ, ఆ కష్టాలను పంటి కింద దాచి పెట్టి… అప్పులు తెచ్చి ప్రజలకు పప్పుకూడు తినిపిస్తున్నారని మా పార్టీ నాయకులు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర జి ఎస్ డి పి అమాంతం పెంచి చూపించారు. అడ్డగోలుగా అప్పులు చేసుకోవడానికి రాష్ట్ర జి ఎస్ డి పి ని పెంచారన్నారు.. రాష్ట్ర జి ఎస్ డి పీ బోగస్ అని కేంద్ర మంత్రిత్వ శాఖకు తెలిసినప్పటికీ, వారు ప్రశ్నించరు. మంగళవారం మాత్రం అప్పులు ఇస్తూనే ఉంటారు. ప్రతి మంగళవారం కోసం ప్రభుత్వ పెద్దలు అప్పుల కోసం ఎదురుచూస్తూనే ఉంటారు. ఇప్పటికే ఈ ఏడాది పరిమితికి మించి అప్పులు చేశారన్నారు.

జగన్ ఎవరికి కావాలి?

ప్రభుత్వ ఖర్చుతో జగన్మోహన్ రెడ్డి మళ్లీ కావాలని పుస్తకాలను ముద్రించడం ఏమిటో అర్థం కావడం లేదని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి కావాలి… ప్రజలకా?, మనకా? అంటూ ప్రశ్నించాలంటే పోలీసులతో వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక పోలీసు వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని రఘురామకృష్ణం రాజు చెప్పారు. వై నీడ్ జగన్ కాదు… వై హేట్ జగన్ అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసి రెడ్డి చెప్పారు. ఇది అక్షరాలా నిజమని, ఇటువంటి డకోటా పనులు చేయడం వల్లే ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు.

పార్టీకి బోలెడు డబ్బులు ఉన్నాయి. పార్టీ డబ్బులతో పుస్తకాలను ముద్రించి పంచకుండా, ప్రభుత్వ ఖర్చుతో పుస్తకాలను ముద్రించడం ఏమిటంటూ రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. ప్రభుత్వ ఖర్చుతో పుస్తకాలను ముద్రించడం, ప్రభుత్వ పథకాలకు తన తండ్రి పేరు తన పేరు పెట్టుకోవడం, మరొకవైపు గత ప్రభుత్వం ఏమీ చేయలేదని… అంతా మేమే చేశామని గొప్పలు పోవడం సిగ్గుచేటు. 24 పేజీల బుక్లెట్ కు 40 రూపాయల చొప్పున కోటి పుస్తకాలను ముద్రిస్తే 40 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ సొమ్ము కొన్ని వేల కోట్ల రూపాయలను స్వాహా చేశారు. మరెన్నో కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారన్నారు.

ప్రభుత్వ అధికారులు జగన్కి ప్రచారం చేయడం ఏమిటి?

ముఖ్యమంత్రి పేరిట బుక్ లేట్ ముద్రించి ప్రభుత్వ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఇంటింటికి పంపిణీ చేయడం ఏమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. వాలంటీర్లకు ప్రభుత్వమే జీతాలను ఇస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వం తరఫున ఒక పార్టీ కోసం ఎందుకు ప్రచారం చేయాలన్నారు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఐఏఎస్ అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మంచి అధికారి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవీ బాధ్యతలు అప్పగించినందుకు, ఏమో ఆయన కూడా తానా అంటే తందానా అంటున్నారు.

రాష్ట్రంలో ఒక పార్టీ తరఫున ప్రభుత్వ యంత్రాంగం ప్రచారం నిర్వహించడాన్ని డి ఓ పి టి, ప్రధానమంత్రి కార్యాలయానికి పూర్తి వివరాలను అందజేస్తూ పెన్ డ్రైవ్, బుక్ లెట్ ను జత చేస్తూ లేఖ రాస్తాను. ఇప్పటికైనా జవహర్ రెడ్డి తగిన చర్యలు తీసుకోవాలి. నేను లేఖలో రాసింది నిజం కాదని అబద్ధం అని చెబుతారు. గతంలోనూ ఇదేవిధంగా అబద్దాలను చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని వైకాపా శాశ్వత అధ్యక్షుడిగా పేర్కొంటూ తీర్మానం చేసిన , ఆ తర్వాత తాము అలా తీర్మానం చేయలేదని పేర్కొన్నారని గుర్తు చేశారు.

జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎందుకు కావాలని ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తున్నారని, బుద్ధి ఉందా? డి ఓ పి టి, కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి ప్రశ్నిస్తారు. దానికి ఎలా లౌక్యంగా సమాధానం చెబుతారో వేచి చూద్దాం. రవిచంద్ర అనే నిజాయితీకి మారుపేరైన అధికారికి గత నాలుగు నెలలుగా పోస్టింగు ఇవ్వడం లేదు. సి ఎఫ్ ఎం ఎస్ సిస్టంను ఇంప్రూవ్ చేసి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ఔట్ గా ఆయన అభివృద్ధి చేశారు. అందుకే ఆయనకు పోస్టింగు ఇవ్వలేదు. రెడ్డి అధికారులకు మాత్రం కీలక పోస్టింగులు ఇస్తూ, ఇతర సర్వీస్ ల నుంచి వచ్చిన వెంకట్ రెడ్డికి మైనింగ్ శాఖ, వాసుదేవ రెడ్డికి మద్యం విక్రయాల బాధ్యతలను కట్టబెట్టారన్నారు. అజయ్ జెన్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారిని భయపెట్టి 164 స్టేట్మెంట్ తీసుకున్నారు. వీళ్లే దాన్ని బహిర్గతం చేస్తారు.

కోన శశిధర్ అనే అధికారి కూడా 164 స్టేట్మెంట్ అడుగుతున్నట్లు తెలిసింది. ఇలాగే ఎంతో మంది అధికారులను వేధిస్తున్నారు. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఫిర్యాదులు చేయాలని, లేకపోతే ఏదో ఒక కేసులో ఇరికిస్తామని వేధిస్తున్నారు. తప్పులు చేయకపోయినా కేసులు పెడుతున్నారు. నాలుగు నెలల పాటు వేచి చూడాలని… అధికారంలోకి మేమే వస్తామని, నిజాయితీపరులైన అధికారులకు సరైన పోస్టింగులు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇకనైనా తానా అంటే తందానా అనకండి. మీకున్న మంచి పేరును పోగొట్టుకోవద్దు.

కేంద్రం వద్ద నుంచి దగ్గరుండి నేనే లేఖ రాయిస్తాను. ముఖ్యమంత్రి కి చెప్పండి… నాకు ఇబ్బందికరంగా ఉందని, అవసరమైతే నేను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటానని చెప్పండి. పార్టీ పనికి ప్రభుత్వ యంత్రాంగాన్ని, డబ్బులను వాడడం తప్పు, ఆ తప్పులో మీరు కూడా భాగస్వాములు కావద్దని మీ గత మిత్రునిగావిజ్ఞప్తి చేస్తున్నాను. అది మీపై ఆధారపడి ఉంటుంది. రేపు మాపో పోయే వారికి మీ పేరు ప్రతిష్టలను పోగొట్టుకోవద్దని రఘురామ కృష్ణంరాజు సూచించారు. ఐఏఎస్ లలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. అయ్యా ఎస్ కాకుండా, ఐఏఎస్ లో మాదిరిగా వ్యవహరించాలని సూచించారు.

ఐఏఎస్ ల కంటే ఐపీఎస్ లు మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్ వాహనాన్ని దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. కిలారు రాజేష్ ను గతంలో ఇద్దరు సీఐలు విచారిస్తున్న సమయంలో, డిజి వద్దకు వెళ్దామని చెప్పారట. డీజీ అంటే సిఐడి చీఫ్ సంజయ్ అనుకుంటారు. తీరా అక్కడకు వెళ్తే ఇంటలిజెన్స్ విభాగం అధికారులు రఘురామిరెడ్డి, సీతారామాంజనేయులు ఉన్నారు.

సీతారామాంజనేయులు డీజీపీ కావాలని అనుకుంటున్నారు. ఆయన తనని బెదిరించినట్లుగా కిలారు రాజేష్ అఫిడవిట్లో పేర్కొన్నారు. సీతారామాంజనేయులు కు ఈ విచారణకు సంబంధం ఏమిటి? బ్యాక్ డేట్ తో జివో ప్రత్యేకంగా జీవో జారీ చేసి, ఆయన సిఐడి విభాగంలో పనిచేస్తున్నారని అంటారేమో. అలా చేయడం నేరం. సాక్షిగా పిలిచి, నిందితుడిగా ఆయన ఫోటోను వెబ్సైట్లో పెట్టి, లుకవుట్ నోటీసును పోలీసులు జారీ చేశారు.

ఈ విషయాన్ని సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు గారు ప్రశ్నిస్తే.. తూచ్ తప్పయింది. బై మిస్టేక్ వెబ్సైట్లో అప్లోడ్ అయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. సారీ అంటే సరిపోతుందా?, అతనికి ఎంత పరువు నష్టం జరిగినట్లు అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. దేవుడు శాసిస్తారు… అరుణాచలం పాటిస్తారు అనేది సినిమా డైలాగు అయితే, తాడేపల్లి దేవుడు శాసించనక్కరలేదు ఆశిస్తే చాలు… ఈయన వేసేస్తాడు అనేది పచ్చి నిజమని తెలిసిపోయింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, ఆస్తులను అటాచ్ చేస్తామని సిఐడి చీఫ్ సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి నాకు ఆస్తులు లేవు అప్పులు మాత్రమే ఉన్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే నా అప్పులు తీరుస్తారా అంటూ ప్రశ్నించారన్నారు.

ఐపీఎస్ లు మాట్లాడే మాటలు ఇలా కామెడీ పీస్ గా మారిపోతున్నాయి. గతంలో ఎంతోమంది ఐపీఎస్ ల నిస్వార్ధమైన సేవలను అందించారు. వారిని చూస్తే ఎంతో గర్వంగా ఉండేది. గతంలో దొంగ పోలీసుల ద్వారా నన్ను అపహరించి చంపాలని చూశారు. నా ఇంటి వద్ద ఇంటలిజెన్స్ పోలీసులు మోహరించి, వాన్ని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే, తిరిగి నా పైనే కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు గట్టిగానే అక్షింతలు వేసింది. నేను ఎంపీ ని కాబట్టి ఢిల్లీలో ఉంటున్నాను.

ఇతరులకు ఫ్యామిలీ, ప్రైవేటు జీవితం ఉండదా? వారిపై నిఘా పెడతారా అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేయిస్తున్నారు. కేవలం కొంతమంది పనికిమాలిన అధికారుల సహకారం వల్లే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా ఓటమిపాలవుతారు. ఐఏఎస్ లు జె పి ఎస్ గా మారిన ఐపీఎస్ లకు ఇబ్బందులు తప్పవని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.

సిఐడి విచారణ కొనసాగుతుండగా, సిబిఐ విచారణకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?

స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసు ను సిబిఐ చేత విచారణ జరిపించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ నిన్న విచారణకు వచ్చిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సిఐడి విచారణ జరుగుతున్న దానికి వ్యతిరేకంగా… సీబీఐ చేత విచారణ జరిపించాలి అంటే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐ చేత విచారణ జరిపించాలంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభ్యంతరాన్ని వ్యక్తం చేసిందని గుర్తు చేశారు.

కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసును సిబిఐ విచారణకు అభ్యంతరం చెప్పకపోవడం వెనుకనున్న ఆంతర్యం ఏమిటో ప్రజలు గ్రహించాలన్నారు. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పై నమోదు చేసిన అక్రమ కేసులో మ్యాటర్ లేదు. మేటర్ లేని ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దొరికేయకుండా, ఎన్నికల సమయం వరకు కేసు విచారణ కొనసాగాలా చూడాలని భావిస్తున్నారు. అలాగే, చంద్రబాబు నాయుడు పై కేవలం సిఐడి కేసు మాత్రమే ఉన్నదని కాకుండా సీబీఐ విచారణ జరుగుతుందని ప్రచారం చేయాలనుకున్నారు. అయితే వారి ఎత్తుగడ ఫలించే అవకాశాలు లేవు. ఈ కేసు విచారణను సిబిఐ కి బదిలీ చేయడానికి వీలు లేదు.

గతంలో రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో యశ్వంత్ సిన్హా సుప్రీం కోర్టును ఆశ్రయించి, సీబీఐ కేసు నమోదు చేసి విచారించేలా ఆదేశించాలనే ఆయన కోరారు. కానీ ఈ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన వర్తిస్తుందని, సిబిఐ ని ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయమని ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పును, ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసు లో రిమాండ్ రిపోర్ట్ క్వాష్ పిటిషన్ విచారిస్తున్న సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ మరోలా తీర్పు ఇచ్చే అవకాశం లేదు. అలాగే సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పును, హైకోర్టు బెంచ్ కూడా కాదని అవకాశం లేదన్నారు.

రోజా రెడ్డి చెప్పింది నిజమే

గతంలో మంత్రి రోజా రెడ్డి చెప్పింది నిజమేనని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రెడ్డి అనేది ఒక కులం కాదు.. గుణం అన్నారు. రెడ్డి అనేది కులం కాదు అని నేను కూడా గతంలో ఎన్నోసార్లు రచ్చబండ కార్యక్రమంలో వెల్లడించాను. రెడ్డి అనే టైటిల్ అనేక కులాలకు చెందిన వారికి ఉంటుంది. కానీ రెడ్లలో చాలామందికి గుణం అనేది ఉండదన్నారు. ఈమధ్య దారుణంగా పడిపోయిందన్నారు.

సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి పై నేను దాఖలు చేసిన పిటిషన్ పై నోటీసులు జారీ చేసిన తర్వాత, అమెరికా నుంచి రెండు కుక్కలు మొరగడం ప్రారంభించాయి. ఫోన్లు చేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మరో ఆరు నెలలు ఆగండి… ఇది స్వీట్ వార్నింగ్ మాత్రమే. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిదని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు.

 

LEAVE A RESPONSE