అమరావతి:రాష్ట్రంలో ఎస్‌ఐ పోస్టుల భర్తీపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అభ్యర్థుల ఎత్తు కొలిచే విషయంలో అనుసరించిన డిజిటల్ విధానం సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో 24 మంది పిటిషన్ దాఖలు చేశారు.
ఛాతీ, ఎత్తు కొలిచే విధానంలో డిజిటల్ విధానం వల్ల అనేక మంది అర్హులైన అభ్యర్థులు కూడా అర్హత కోల్పోయారని కోర్టుకు తెలిపారు పిటిషనర్.. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. హైకోర్టు పర్యవేక్షణలో కోర్టు ప్రాంగణంలో ఎత్తు, కొలతలు తీయాలని ఆదేశాలు జారీ చేసింది.. అయితే, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇచ్చిన కొలతలు కరెక్ట్ అయితే.. ఒక్కో పిటిషనర్ ఖర్చుల కింద లక్ష రూపాయలు చెల్లించాలంటూ ఆదేశించింది. కొలతలకు సిద్దంగా ఉన్న అభ్యర్థుల వివరాలు కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌ను సూచించిన హైకోర్టు.. తదుపరి విచారణ ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది..
మొత్తంగా ఏపీలో ఎస్‌ఐ పోస్టుల భర్తీ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు అయ్యింది.. 2018లో అర్హత సాధించిన తమను 2023 నోటిఫికేషన్‌లో అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ వ్యాజ్యం దాఖలు చేసిన 24 మందికి హైకోర్టు పర్యవేక్షణలో, న్యాయస్థానం ప్రాంగణంలోనే ఎత్తు కొలతలు తీసేందుకు నిర్ణయించింది.
హైకోర్టు.. న్యాయమూర్తులు జస్టిస్ జి. నరేంద్ర, జస్టిస్ న్యాపతి విజయ్‌తో కూడిన ధర్మాసనం నవంబర్ 24న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఐ పోస్టుల భర్తీలో 2023 నోటిఫికేషన్ ప్రకారం శారీరక దారుఢ్య పరీక్షల్లో భాగంగా డిజిటల్‌మెషీన్‌తో ఎత్తును కొలవడాన్ని సవాలు చేస్తూ 95 మంది అభ్యర్థులు హైకోర్టులో గతంలో పిటిషన్లు వేయగా.. డిజిటల్ మెషీన్ల ద్వారా ఛాతి, ఎత్తు కొలతలు నిర్వహించడంతో తాము అనర్హులమయ్యామన్నారు. మాన్యువల్ విధానంలో కొలతలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.