– 75 స్థానాల్లో కొత్త ముఖాలు
– ఎంపీ అభ్యర్ధుల కోసం వైసీపీ వేట
– ఎమ్మెల్యే ఆళ్ల రాజీనామా సంకేతం అదేనా?
– జగన్‌ను పెళ్లికీ పిలవనంత అసంతృప్తి
– బిల్లులు రాక విసుగుచెందిన ఆళ్ల
– ఆయన దారిలోనే మరికొందరు?
– సమన్వయకర్తల వైఫల్యమే కొంప ముంచుతోందా?
– బిల్లులు ఇప్పించడంలో సమన్వయకర్తల వైఫల్యం
– ఎమ్మెల్యేలతో సఖ్యత సాధించడంలో ఫెయిల్
– విశాఖలో సుబ్బారెడ్డిపై తీరుపై నేతల గరం గరం
– కోస్తాలో ఎమ్మెల్యేలకు గౌరవమివ్వని సమన్వయకర్తలు
– ఎమ్మెల్యేలు ఉండగనే మరొకరికి ఇన్చార్జి పదవులా?
– మర్యాద లేని చోట ఉండమంటున్న ఎమ్మెల్యేలు
– టీడీపీ-జనసేనతో 35 మంది సిట్టింగుల మంతనాలు?
– ఉప్పందిన తర్వాతనే జగన్ జాగ్రత్త పడుతున్నారా
– జగన్ పట్టించుకోని నిర్లక్ష్యమే కొంపముంచుతోందా?
– ‘ఫ్యాన్’ ఉక్కిరిబిక్కిరి
( మార్తి సుబ్రహ్మణ్యం)
వైసీపీలో నేతలకు గాలి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైనం తిరుగుబాటుకు దారితీస్తోందా? దాదాపు 75 మంది సిట్టింగులను మార్చాలన్న అధినేత జగన్ నిర్ణయం, ఏపీలో సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరలేపనుందా? తెలంగాణ ఫలితాలతో జాగ్రత్త పడుతున్న జగన్ నిర్ణయాలు బెడిసికొడుతున్నాయా? ప్రాంతీయ సమన్వయకర్తల రాజకీయ అవగాహన రాహిత్యమే వైసీపీ కొంపముంచుతోందా? జనం నాడి పసిగట్టిన దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు.. వైసీపీ-జనసేనతో టచ్‌లోకి వెళ్లారన్న సమాచారమే జగన్‌ను అప్రమత్తం చేసిందా? ప్రధానంగా బిల్లులు రాని, గౌరవమర్యాదలు లేని అవమానకర పరిస్థితులే ఫ్యాను ఉక్కిరిబిక్కిరికి అసలు కారణమా?.. తాజాగా జగన్‌కు అత్యంత సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా ఇలాంటి సంకేతాలే ఇస్తున్నాయా? తాజాగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలు, తీసుకుంటున్న నిర్ణయాలు వీటకి అవుననే సమాధానం ఇస్తున్నాయి.
తిరుగులేని మెజారిటీతో గద్దెనెక్కిన వైసీపీ.. ఇప్పుడు ‘గాలి’ సమస్యలు ఎదుర్కొంటోంది. అంతులేని మెజారిటీతో అమితవేగంగా గిర్రున తిరగాల్సిన ఫ్యాను, నిదానంగా-నిస్తేజంగా-నిట్టూర్పులతో తిరుగుతున్న వైచిత్రి ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదంతా పార్టీ అధినేత జగనన్న స్వయంకృతమేనన్నది సీనియర్ల విశ్లేషణ. గౌరవ మర్యాదలు ఆశించే నేతలకు ఆరెండూ కనిపించకపోవడంతో, పక్కచూపులు చూస్తున్న పరిస్థితి. దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు అటు టీడీ పీ-ఇటు జనసేనతో టచ్‌లో ఉంటున్న వైనం జగన్ దృష్టికి సైతం వెళ్లిందంటున్నారు.
సీఎం-పార్టీ అధినేత జగన్‌కు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి ఎంత సన్నిహితుడో చెప్పాల్సిన పనిలేదు. పార్టీ అధికారంలోకి వస్తే తమ్ముడిని మంత్రిని చేస్తానని, స్వయంగా జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబుపై కేసులు వేయించడంలో ఆళ్లను ప్రోత్సహించారు. జగన్‌పై ప్రేమతో పార్టీ నుంచి నయాపైసా తీసుకోకుండా, సొంత డబ్బుతో కోర్టులో కేసులు నడిపిస్తున్న ఆళ్ల వంటి ప్రముఖులకూ అవమానం తప్పని దుస్థితి సీనియర్లలను విస్మయపరుస్తోంది. ఆళ్ల ఎమ్మెల్యేగా ఉండగానే మరొకరికి ప్రాధాన్యం ఇవ్వడం, చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయకపోవడం వంటి అవమానకర పరిస్థితులే, ఆయన పార్టీ నుంచి నిష్ర్కమణకు కారణమంటున్నారు.
ప్రధానంగా మంగళగిరిలో ఇసుక రీచ్, మట్టి తవ్వకాలను కడపకు చెందిన వైసీపీ ప్రముఖులు తవ్వుకుంటారని సీఎం సలహాదారుల్లో ఒకరు, సీఎంఓ అధికారి ఒకరు ఆళ్లకు చెప్పినట్లు సమాచారం. అయితే దానికి ఆళ్ల అంగీకరించుకుండా.. అదే జరిగితే నేను అడ్డుకుంటానని హెచ్చరించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దానితో ఆళ్లను పక్కనబెట్టి, నియోజకవర్గంలో మరొక రెడ్డికి పెత్తనమిచ్చి ఇసుక-మట్టి తవ్వకాలు జరిపి, ఎవరి వాటాలు వారికి అందిస్తున్నారన్న ప్రచారం మంగళగిరి వైసీపీలో జోరుగా సాగింది. తాను ఎవరికీ కొమ్ముకాయనని, ఎవరికీ వాటాలు పంచనన్న ఆళ్ల పట్టుదలే, ఆయనను పార్టీ నుంచి నిష్ర్కమించేందుకు దారి తీసిందంటున్నారు.
ప్రధానంగా ఆళ్ల 18 కోట్లతో నియోజకవర్గంలో పనులు చేయించారు. తొలుత కాంట్రాక్టర్లు ముందుకురాకపోవడంతో, తానే ఆ డబ్బులు ఇచ్చి పనులు పూర్తి చేశారట. బిల్లులు వచ్చిన తర్వాత కాంట్రాక్టరు నుంచి ఆ పెట్టుబడి తీసుకుంటారు. రాష్ట్రంలో చాలాచోట్ల ఎమ్మెల్యేలు ఈ విధంగానే పనులు చేశారు.
పనులు పూర్తయి ఇన్నాళ్లయినా బిల్లులు రాకపోవడం, ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకపోగా, తనపై మరొకరిని తెచ్చి రుద్దేందుకు జగన్ చేసిన ప్రయత్నాలే ఆళ్ల పార్టీకి రాజీనామా చేయడానికి దారితీసిన మరో
ముఖ్య కారణమని గుంటూరు జిల్లా సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. తన ఇంట్లో జరిగిన వివాహానికి చివరకు జగన్‌ను కూడా ఆహ్వానించలేదంటే, సీఎంపై ఆళ్ల అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. ముక్కుసూటిగా వ్యవహరించే ఆళ్ల, అవినీతికి దూరంగా ఉంటారు. పైగా పొలాలు అమ్ముకుని, అప్పులు చేసి మరీ రాజకీయాలు చేస్తుంటారన్న ప్రచారం కూడా లేకపోలేదు.
ఆవిధంగా ఆయన గత ఎన్నికల మధ్యలో 6 కోట్లు అప్పు చేసి, దానిని తీర్చేందుకు కొంత పొలం అమ్మారని చెబుతుంటారు. చంద్రబాబుపై కేసుల విషయంలోనూ పార్టీ నయాపైసా ఇవ్వలేదని, కోర్టు ఖర్చులన్నీ ఆళ్లనే భరించారని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. చివరకు మీకు టికెట్ లేదన్న మాటనే ఆళ్ల అహం దెబ్బతీసిందంటున్నారు. పార్టీకి అంత సేవచేసిన ఆళ్ల వంటి వారినే పక్కనపెడితే, ఇక తమ లాంటి వారి పరిస్థితి ఏమిటన్నది ఎమ్మెల్యేల ఆందోళన.
కాగా అటు విశాఖలో జనసేనాధిపతి పవన్‌పై గెలిచిన తిప్పల నాగిరెడ్డికి సైతం.. టికెట్ లేదని సమన్వయకర్త సుబ్బారెడ్డి స్పష్టం చేయడంతో, ఆయన తనయుడు దేవన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన వైనం
సంచలనం సృష్టించింది. విశాఖలో సుబ్బారెడ్డి ధోరణి రుచించని మరికొందరు ఎమ్మెల్యేలు- నియోజకవర్గ ఇన్చార్జిలు- సీనియర్లు కూడా బయటకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈవిధంగా ఒకేరోజు ఇద్దరు పార్టీకి రాజీనామా చేసి, జగన్‌పై తిరుగుబాటు చేయడం వైసీపీ నాయకత్వానికి షాక్ ఇచ్చింది.
మరోవైపు విశాఖలో వైసీపీ నేతలు అటు విజయసాయిరెడ్డి- ఇటు సుబ్బారెడ్డి మధ్య నలిగిపోతున్నారన్న ఆవేదన చాలాకాలం నుంచీ నడుస్తోంది. ఒకరిపై ఒకరు నిఘా పెట్టడంతో, విశాఖ నేతలు ఎవరి వద్దకు వెళుతున్నారన్న విషయం ఇద్దరికీ నిమిషాల్లో చేరిపోతున్న వైచిత్రి. వీరిద్దరూ కాక.. విశాఖలో ఏ పనికావాల్నా సీఎంఓలో జగన్‌కు సన్నిహితుడైన ఒక అధికారి జోక్యం కూడా ఎక్కువగా ఉండటంతో, సీనియర్లు పార్టీ నిష్ర్కమించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇక గ్రామాల్లో పనులు చేసిన వైసీపీ నేతలకు, ఇప్పటిదాకా బల్లులు ఇవ్వకపోవడం కూడా జగన్‌కు శిరోభారంగా పరిణమించాయి. వీరిలో రెడ్డి వర్గానకి చెందిన వారే ఎక్కువగా ఉండటం విశేషం. తమకు పెండింగ్ బిల్లులు ఇప్పించాలని జిల్లా సమన్వయకర్తలకు చెప్పినా ఫలితం లేకపోవడంతో.. కనీసం ఇప్పుడు పార్టీ మారితే కొత్త ప్రభుత్వం వస్తే, నీసం అప్పుడైనా బిల్లుల వస్తాయన్న ఆశ.. కిందిస్థాయి రెడ్లను టీడీపీతో టచ్‌లో ఉండేలా చేస్తోంది.
అసలు సమన్వయకర్తలకు స్థానిక రాజకీయాలపై అవగాహన లేకపోవడం, కొంతమంది మాట విని నిర్ణయాలు తీసుకోవడమే, సమస్యలకు కారణమన్న విమర్శలు వినిపించకపోలేదు. సమన్వయకర్తలు జిల్లా పార్టీ అధ్యక్షులను పూచికపుల్లలా పక్కనపెట్టి, అంతా తామై నడిపిస్తున్న తీరు అసమ్మతి రాజకీయాలకు ఆజ్యం పోస్తోంది. కొన్ని జిల్లాల్లో సమన్వయకర్తలే స్వయంగా జిల్లా అధ్యక్షులపై నేతలను ఎగదోస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. మరికొన్ని చోట్ల తమకు ఇష్టమైన ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారన్న ఫిర్యాదులూ వినిపిస్తున్నాయి.
ఒంగోలులో మాజీ మంత్రి బాలినేనికి మద్దతుగా సమన్వయకర్త విజయసాయిరెడ్డి వ్యవహారం నడిపించి, సుబ్బారెడ్డిని విశాఖలో పోటీ చేసేలా ఫిక్స్ చేశారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బాపట్లలో కరణం బలరాంకు అనుకూలం-ఆమంచికి వ్యతిరేకంగా, గుంటూరులో అప్పిరెడ్డికి అనుకూలంగా, నర్సరావుపేట జిల్లాలో మంత్రి రజనీకి అనుకూలం- ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎంపి కృష్ణదేవరాయలుకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం సీనియర్లకు రుచించడం లేదు.
మంత్రి రజని గుంటూరు నియోజకవ ర్గ ఇన్చార్జిగా నియమించడం వెనుక ఒక సలహాదారు పాత్ర-ప్రోత్సాహం ఉందని, ఆమెకు మంత్రి పదవి కూడా సదరు సలహాదారే ఇప్పించారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో బహిరంగంగానే వినిపిస్తుంటుంది. ఇప్పుడు ఆమెను చిలకలూరిపేట నుంచి గుంటూరు ఇన్చార్జిగా నియమించడంతో, సీనియర్లు కారాలు మిరియాలు నూరుతున్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు దృష్టిలో ఉంచుకుని.. ఎన్నికలకు ముందు దాదాపు 75 మంది సిట్టింగులను మార్చాలని నాయకత్వం తీసుకున్న నిర్ణయంపై, పార్టీలో బహిరంగంగానే చర్చ జరుగుతోంది. తాజాగా కొన్నిచోట్ల ఇన్చార్జిలను మార్చిన వైనం కూడా తిరుగుబాటుకు బీజం వేయనుంది. కాగా ఎంపి అభ్యర్ధులను కూడా పెద్ద సంఖ్యలో మార్చాలన్న నిర్ణయంపైనా, పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆ మేరకు ఎంపీగా పోటీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదంటున్నారు. ఫలితంగా పారిశ్రామికవేత్తలను బరిలోకి దించక తప్పని అనివార్య పరిస్థితి కనిపిస్తోంది.