Suryaa.co.in

Andhra Pradesh

సిద్ధం సభ ఖర్చు ఎవరిది? ప్రభుత్వానిదా? పార్టీ దా?

– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

సిద్ధం పేరిట వైకాపా నిర్వహిస్తున్న సభలకు ఖర్చు ఎవరిదని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సిద్ధం సభ కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల ఖర్చు ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించినట్లు , పార్టీ ఖాతా నుంచి ఇవ్వలేదని తెలిసిందన్నారు.

శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులకు మాట్లాడుతూ… పార్టీ ఖాతాలో దాదాపు 1000 కోట్లకు పైగా నిధులు ఉన్నప్పటికీ, ఆ నిధులను ఖర్చు చేసుకోకుండా… ప్రజాధనాన్ని ఖర్చు చేయడం దారుణమని మండిపడ్డారు. కన్సల్టెంట్ల పేరిట సాక్షి ఉద్యోగులను తీసుకొని వారికి 600 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టుగా జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ గణాంకాల తో సహా వివరించారని తెలిపారు. ఈ ఖర్చుతో ఒక పెద్ద ప్రాజెక్టు పూర్తయి ఉండేదని, కానీ వైకాపా ప్రభుత్వం కన్సలెంట్ల పేరిట ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. పనికిమాలిన సలహాలు ఇచ్చే సలహాదారుల కోసం 140 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

హవ్వ… సిద్ధం సభ కోసం ఇంటర్ పరీక్షలు వాయిదానా?!
ఏలూరులో సిద్ధం సభ కోసం ఓ 20 రోజుల పాటు ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించడం దారుణమని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీ సభ నిర్వహించుకోవడం అనేది ప్రభుత్వానికి సంబంధం లేని అంశం. కేవలం సభ నిర్వహణ కోసమే ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేయడం అన్నది ఎంత దారుణమో ప్రజలు అర్థం చేసుకోవాలి. వ్యవస్థలన్నింటినీ ఇంతలా దుర్వినియోగం చేస్తున్నా వైకాపా ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు.

సిద్ధం… సిద్ధం అంటూనే రోజుకు ఒక అభ్యర్థి పేరును మార్చి వేస్తున్నారు. నరసాపురం నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా తొలుత తమ్మయ్య పేరు ఖరారు చేసినట్లు చూశాం. ఆ తర్వాత సాక్షి మీడియాలో పనిచేసిన ఒక యాంకర్ పేరు వినిపించింది. ఇప్పుడేమో పిల్లి సుభాష్ చంద్రబోస్ ను పోటీ చేయమని అడిగారట. ఆయన ఏమన్నారో తెలియదు . నాపై అభ్యర్థిని పోటీ పెట్టడానికి ఇలా రోజుకోక పేరును పరిశీలిస్తున్న వైకాపా నాయకత్వం, ఏలూరు సభలోనైనా అభ్యర్థిని ప్రకటించాలని రఘురామ కృష్ణంరాజు ఛాలెంజ్ విసిరారు.

మొన్నటి వరకు నాకు టికెట్ రాదని వైకాపా కాలకేయులు అన్నారు. ఇప్పుడు నాకు టికెట్ ను ప్రకటించారు. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. పొత్తులో భాగంగా నరసాపురం స్థానం ఏ పార్టీకి కేటాయించిన ఆ పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పాను. సిద్ధమని మీరంటున్నారు. మిమ్మల్ని ఓడించడానికి, ప్రజలతో కలిసి మేము కూడా సిద్ధం అయ్యాము. సిద్ధం సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేరువయ్య దానికంటే, రచ్చబండ కార్యక్రమం ద్వారా నేను అధికంగానే ప్రజలకు చేరువ అవుతున్నాను.

భీమిలి నియోజకవర్గంలో నిర్వహించిన సిద్ధం సభకు 30 నుంచి 40 వేల మంది హాజరు కాగా, రచ్చబండ కార్యక్రమానికి మిలియన్ వ్యూస్ ఉన్నాయి. తాను ఎటువంటి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఎక్కువ మందికి రీచ్ అవుతున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి లాగా వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసే ఇంట్రెస్ట్ నాకు లేదు… అవకాశం ఉన్న ఆ పని చేయనని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. భీమవరానికి డీఎస్పీగా ఒక రెడ్డి అధికారిని నియమించారు. భీమవరం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు, ఎంపీగా నేను పోటీ చేస్తుండడం వల్లే ప్రభుత్వ పెద్దలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఆ అధికారి ఎక్కడ ఉంటారో చూద్దాం… ఇటువంటి చీప్ పాలి ట్రిక్స్ చేయవద్దు.

ఒకే కులానికి చెందిన 11 మంది అధికారులను ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో నియమించారు. ఎస్పీలు, డిసిపి, ఐజి క్యాడర్లలో వారిని నియమించారు. వీరు కూడా వారికి ఎందుకు అంతగా సహకరిస్తున్నారు అర్థం కావడం లేదు. ఇంకా కేవలం రెండు నెలల వ్యవధి మాత్రమే ఈ ప్రభుత్వానికి ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత, ముఖ్యమంత్రి వద్ద అధికారం ఉండదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే తెలంగాణలో అధికారులను బదిలీ చేయడం చూశాం. ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో వారికి కూడా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత బదిలీలు తప్పవు. ఇప్పటికైనా పోలిస్ అధికారులు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.

సౌభాగ్యమ్మ పోటీ చేస్తే వైకాపాకు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఏమిటి నష్టం?
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తే, జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి వచ్చే నష్టం ఏమిటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. సౌభాగ్యమ్మ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారా?, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటే టిడిపి మద్దతును ఇస్తుందా? అసలు ఆమె పోటీ చేస్తారా లేదా అన్నది ఆమె ఇష్టం… వ్యక్తిగతమని అభిప్రాయపడ్డారు. సౌభాగ్యమ్మ పోటీ చేస్తారనే ఊహాగానాలతోనే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఉలిక్కిపడింది.

వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పై ప్రజల్లో ద్వేషాన్ని నింపే విధంగా సాక్షి దినపత్రికలో రెండు పేజీల కథనాన్ని వండి వార్చడం విస్మయాన్ని కలిగించింది. ఒక్కసారి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాట నమ్మారని, పదేపదే నమ్మించే ప్రయత్నం చేస్తే, ప్రజలు విశ్వసించరని అన్నారు. కోడి కత్తి కేసులోనూ కోడి కత్తితో గీసింది ఒక శ్రీను అయితే, మరొక శ్రీను పై కేసు పెట్టారు. అతన్ని జైల్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటూనే ఉన్నారు. ఒకవేళ కోడి కత్తి శ్రీను బయటకు వస్తే అసలు నిజాలు బయటపడతాయని భయం, జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతోంది.

కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న సతీమణి అయిన సౌభాగ్యమ్మ పోటీ చేస్తే, వైయస్ కుటుంబీకులు సౌభాగ్యమ్మకు మద్దతును ఇస్తారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తాత రెండోవ భార్య మనవడైన వైయస్ అవినాష్ రెడ్డికి మద్దతును ఇస్తారో వారే తేల్చుకుంటారు. కడప ఎంపీ స్థానానికి సౌభాగ్యమ్మ తోపాటు పులివెందుల అసెంబ్లీ స్థానానికి షర్మిల కూడా పోటీ చేస్తే చేయవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమైన ఎన్నికల్లో ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉందని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. పోటీ చేసే వారిని ప్రతిష్ట పాలు చేసే విధంగా సాక్షి దినపత్రిక రెండు పేజీల కథనాన్ని ప్రచూరించినంత మాత్రాన ప్రజలేమి అమాయకులు కాదు. వారేమి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ చెప్పే మాయ మాటలను నమ్మరని అన్నారు.

సౌభాగ్యమ్మ పోటీకి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లకు సంబంధం ఏమిటి?
కడప ఎంపీ స్థానానికి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేయాలనుకుంటే, ఆమె పోటీ చేయడానికి తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు కు, మాజీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లకు సంబంధం ఏమిటో అర్థం కాలేదని రఘు రామకృష్ణంరాజు అన్నారు. సాక్షి దినపత్రిక యాజమాన్యమే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తప్పుడు సాక్ష్యాలను సృష్టించి తెదేపా నాయకుడు బీటెక్ రవి, బిజెపి నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిని ఇరికించాలని చూశారు. వారు కోర్టును ఆశ్రయించడం వల్లే ఈ కేసు విచారణ బాధ్యతలను సిబిఐ కి అప్పగించడం జరిగింది. సిబిఐ విచారణలో ఎన్నో నిష్టూర నిజాలు బయటపడ్డాయి. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసే సమయంలో ఆయనతో బలవంతంగా లేఖ రాయించారు. ఆ లేఖను వివేకానంద రెడ్డి వ్యక్తిగత సహాయకుడైన కృష్ణారెడ్డి వద్దే ఉంచుకోవాలని వైఎస్ సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సూచించారని, ఒకవేళ అలా చేసి ఉండకపోతే అప్పుడే వైఎస్ వివేకానంద రెడ్డి ది హత్య అని తెలిసి ఉండేదని సాక్షి దినపత్రిక తన కథనంలో పేర్కొనడం విడ్డూరంగా ఉంది.

అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి శవం జోలికి ఎవరు వెళ్లి ఉండేవారు కాదని, ముట్టుకునే వారు కాదని సాక్షి దినపత్రిక కథనంలో పేర్కొనడం ఇంకా ఎవరిని నమ్మించడానికి అర్థం కావడం లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి శవాన్ని పరిశీలించిన ఎవరికైనా అది ముమ్మాటికి హత్యేనని తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన తల వెనుక భాగం పూర్తిగా లేచిపోయింది. ఒళ్లంతా గొడ్డలితో చీరి వేయబడింది. కడుపులో నుంచి పేగులు బయటకు వచ్చాయి. అయినా వైఎస్ వంశస్థులు అది హత్యని అనుకోలేదట. గుండెపోటుతో మరణించారని అనుకున్నారట.

గుండెపోటుతో మరణించిన వ్యక్తికి ఊర్లో ఉన్న బ్యాండేజ్ అంత తీసుకువచ్చి ప్యాక్ చేశారు. రాజశేఖర్ రెడ్డి ఆ లెటర్ అందరికీ చూపించమని ఉంటే, ఆ లేఖను శివ శంకర్ రెడ్డి వంటి వారు దాచి వేసి ఉండేవారు. వైఎస్ వివేకానంద రెడ్డి ది హత్య అని అప్పుడు డాక్టర్ వైఎస్ సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి దంపతులకు తెలిసే ఉండేది కాదు. ఆ లేఖ ద్వారానే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారని నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కి తెలిసి ఉంటుందనేది నా భావన అని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి ది హత్య అని తెలిసిన వెంటనే పోస్టుమార్టం చేయాలని రాజశేఖర్ రెడ్డి ఒత్తిడి చేశారు .

పిఎ కృష్ణారెడ్డి ని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కృష్ణారెడ్డి కూడా హంతకులతో కలిసిపోయారని రాజశేఖర్ రెడ్డి గ్రహించలేకపోయారు. పోస్టుమార్టం కోసం సునీత రాజశేఖర్ రెడ్డి దంపతులు పట్టుబట్టడంతో గత్యంతరం లేక పోస్టుమార్టం చేశారు. లేఖ అన్నది ఉండి ఉండకపోతే, రాజశేఖర్ రెడ్డి దంపతులు చూసి ఉండకపోతే… వైఎస్ వివేకానంద రెడ్డి శవాన్ని హత్య చేసిన వారు ముందుగానే ఖననం చేసి ఉండి ఉండేవారు. పోలీస్ ఫిర్యాదు చేసిన తరువాత కూడా, పోస్టుమార్టం లేకుండానే ఖననం చేద్దామని శివశంకర్ రెడ్డి ఒత్తిడి చేసినట్లు సీ ఐ శంకరయ్య తన వాంగ్మూలంలో పేర్కొన్నారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు.

హత్య చేసిన వారికి శిక్ష పడాలా? చేయించిన వారికి కూడా శిక్ష పడాలా? అన్నది విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి
వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన వారికి మాత్రమే శిక్ష పడాలా?, చేయించిన వారికి కూడా శిక్ష పడాలా?? అన్నది విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. వైయస్ వివేకానంద రెడ్డిని దస్తగిరి హత్య చేస్తే, అతన్నీ సునీతా రాజశేఖర్ రెడ్డి దంపతులు సమర్ధిస్తున్నారని సాక్షి దినపత్రిక తన వార్తా కథనంలో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక వ్యక్తిని కత్తితో హత్య చేస్తే, శిక్ష కత్తికి పడాలా?, లేకపోతే పొడిచిన వ్యక్తికి పడాలా? అని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు… ఇంకా ప్రజలని అమాయకులుగా భావిస్తూ సాక్షి దినపత్రిక అడ్డగోలు కథనాలు రాయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు.

దస్తగిరికి, వైయస్ వివేకానంద రెడ్డికి పాత కక్షలు ఏమీ లేవు. ఈ హత్యలో దస్తగిరిని కిరాయి హంతకుడి మాదిరిగా వాడుకున్నారు. ఈ హత్య గురించి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డిలు దస్తగిరి తో డీల్ మాట్లాడినట్లుగా సిబిఐ తన విచారణలో తేల్చింది. గతంలో టీ కి కూడా డబ్బులు లేని దస్తగిరి ఇప్పుడు కార్లలో డ్రైవర్ ను పెట్టుకొని తిరగడానికి సునీత దంపతులే ఆర్ధిక సహాయం చేస్తున్నారనే అపవాదు సాక్షి దినపత్రిక యాజమాన్యం మోపింది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కు గాను అడ్వాన్స్ గా ఇచ్చిన మొత్తం లో కొంత డబ్బులను చెప్పులు కుట్టే మున్నా వద్ద దాచానని గతంలో దస్తగిరి చెప్పారు.

ఆ సొమ్మును సిబిఐ అధికారులు మున్నా అకౌంట్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు దస్తగిరిని పాత కేసులలో ఈ ప్రభుత్వం జైలులోవేసింది. బెయిల్ లభించినప్పటికీ కూడా జైలు నుంచి విడుదల కాకుండా, పాత కేసులలో పిటి వారెంట్లను జారీ చేస్తూ , జైలులోనే నిర్బంధిస్తోందన్నారు . జైలులో ఉన్న దస్తగిరిని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సహా నిందితుడైన శివశంకర్ రెడ్డి తనయుడితోపాటు, మరొకరు జైలులోనే బెదిరించినట్లు దస్తగిరి భార్య చెప్పింది. ఎందుకని ఇదంతా చేస్తున్నారంటే… గతంలో వివేకానంద రెడ్డి వ్యక్తిగత సహాయకుడైన కృష్ణారెడ్డిని లొంగదీసుకుని కేసును వేయించినట్లుగానే, ఇప్పుడు దస్తగిరి చేత కూడా చేయించాలని చూస్తున్నారు.

సీబీఐ అధికారి రాంసింగ్ తనని చిత్రహింసలకు గురిచేసి వాంగ్మూలాన్ని తీసుకున్నారని, అందుకే నేను ఆయన చెప్పమన్నట్లు చెప్పానని ఎన్నికలకు ముందు దస్తగిరి చేత ఒక కట్టు కథ చెప్పించాలని చూస్తున్నారు. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎన్నికల్లో లబ్ది పొందాలన్నదే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథక రచన. మా చిన్నాన్న వీళ్లే హత్య చేసి, మా కుటుంబ సభ్యులే హత్య చేశారని అన్నారని జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి దొంగ ఏడుపు ఏడ్చడం ద్వారా సానుభూతిని పొందాలని చూస్తున్నారు.

ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి లొంగి ఒక వేళ దస్తగిరి రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ, 164 స్టేట్మెంట్ ఒక్కసారి ఇచ్చిన తర్వాత, దాన్ని మార్చడానికి వీలు లేదు. ప్రజలని ఎలాగైనా మభ్య పెట్టాలని ఈ క్రతువంత చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించిన బీటెక్ రవితో సునీత రాజశేఖర్ రెడ్డి దంపతులు సన్నిహితంగా ఉంటున్నారని సాక్షి దినపత్రిక కథనంలో పేర్కొన్నారు. వైయస్ వివేకానంద రెడ్డిని ఓడించింది వైఎస్ అవినాష్ రెడ్డి మనుషులు. తమకు రాజకీయంగా వైఎస్ వివేకానంద రెడ్డి అడ్డంకిగా మారుతారనే ఉద్దేశంతో ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా ఓడించారు.

ఎమ్మెల్సీ స్థానాన్ని శివ శంకర్ రెడ్డి ఆశించారు. ఒకవేళ ఆయన పోటీ చేసి ఉంటే గెలిచి ఉండేవారేమో?!. శివశంకర్ రెడ్డి ఆశించిన ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్ వివేకానంద రెడ్డి పోటీ చేయడం వల్లే ఆయన్ని ఉద్దేశపూర్వకంగానే ఓడించారు. ఎన్నికలన్న తర్వాత పోటీ చేసిన వారిలో ఎవరో ఒకరు గెలుపొందడం సహజమే. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది మీరైతే, హత్యా నేరాన్ని బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి పైకి నెట్టాలని చూశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును 8 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వమే విచారించింది. 8 నెలల సమయంలో ఈ హత్య నేరాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు ఎందుకు ప్రయత్నించలేదు. అసలు విచారణలో ఏమైనా సాధించారా?!.

విచారణ అధికారిగా వ్యవహరించిన అభిషేక్ మహంతి, రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులను తట్టుకోలేక, ఇక ఇక్కడ నేను ఉండలేనని తెలంగాణ క్యాడర్ కు వెళ్లిపోయారు. స్వయంగా అప్పటి డీజీపీ ఈ కేసును పరిశీలించమని ఒత్తిడి చేయడం వేస్ట్ అంటూ స్వయంగా సునీతతో అన్నారని ఆమె మీడియాకు చెప్పారు. హత్య కేసులో అభం శుభం తెలియని బీటెక్ రవిని ఇరికించాలని చూడడమే కాకుండా, ఈ హత్యను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేయించారని కట్టు కథలను ప్రచారం చేశారు.

ఒకవైపు హెలికాప్టర్ అందుబాటులో ఉన్నప్పటికీ, పులివెందులకు కారులో షికారుకు వెళ్లినట్లుగా జగన్మోహన్ రెడ్డి దంపతులు వెళ్లి, వైఎస్ వివేకానంద రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించిన అనంతరం… వైయస్ జగన్మోహన్ రెడ్డి హత్య జరిగిన విధానాన్ని కళ్లకు కట్టినట్లు వివరించడం పరిశీలిస్తే, లాకప్ లో నన్ను చిత్రహింసలు పెడుతుంటే చూసినట్లుగానే, చూశారేమోనని అనిపిస్తుంది. ఈ కేసును సిబిఐకి అప్పగించిన తర్వాత ఎంతగా మేనేజ్ చేయాలని చూసినా, రాంసింగ్ అనే నిజాయితీపరుడైన అధికారి హత్య వివరాలన్నీ కూలంకషంగా తన నివేదికలో పేర్కొన్నారు..

గూగుల్ టేక్ అవుట్ లో చూపించిన దానికి, అవినాష్ రెడ్డి ఇంటికి 750 మీటర్ల దూరం ఉన్నట్లు సాక్షి దినపత్రిక కథనంలో పేర్కొనడం పరిశీలిస్తే ఇంకా ప్రజలను వెర్రి వెంగలప్పలని అనుకుంటున్నారా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఈరోజు గూగుల్ మ్యాప్స్ ను ప్రజలు ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ఎవరి ఇంటికి వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్స్ నేరుగా తీసుకువెళ్తున్నాయి. ఇక గూగుల్ టేక్ అవుట్ అయితే మరింత ఆక్యురెసిగా, పిన్ పాయింట్ చూపిస్తుంది.

వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు రాత్రి మూడున్నర , 3:45 గంటలకు ఎవరు ఫోన్ ఎత్తారో, అజయ్ కల్లం చెప్పింది రికార్డు కూడా చేశారు. అటువంటప్పుడు గూగుల్ టేక్ అవుట్ 750 మీటర్ల దూరాన్ని చూపించిందన్నట్లుగా పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అజయ్ కల్లం చెప్పిన రికార్డు వాయిస్ ను సిబిఐ అధికారులు కోర్టులో కూడా సమర్పించారు. అయినా జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితో అజయ్ కల్లం తన స్టేట్మెంట్ ను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. ఈ మేరకు పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయినా ఆ కేసు విచారణకు రాకుండా వాయిదా మీద వాయిదా పడుతూ వస్తోంది. అయినా విచారణ చేపట్టాలని కేసు వేసిన వారు కోరకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఇప్పటికే ఈ హత్య కేసు విచారణలో సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. సాక్షిలో అడ్డగోలు కథనాలను రాసుకుంటే, సిబిఐ చార్జిషీట్లో నమోదు చేసిన వాస్తవాలు తప్పవుతాయా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. సాక్షి దినపత్రిక కథనాన్ని చదివేసి సునీత రాజశేఖర్ రెడ్డి దంపతులపై ద్వేషం పెంచుకోవాలా?, వాళ్ల తండ్రిని చంపుకొని మీరు వేసే నిందలను వారు భరించాలా??, మీకు సంబంధించిన వ్యక్తులకే ఈ హత్య కేసుతో సంబంధం ఉన్నప్పటికీ, వారిని మాత్రం వదిలివేయాలా?అంటూ నిలదీశారు.

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి చావు బ్రతుకుల్లో ఉంటే ఆమెను కర్నూలు ఆసుపత్రిలో చికిత్స కోసం పెడతారా?, మీ మంత్రులు ఎవరికైనా చిన్న సమస్య వచ్చినా హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతారా? అంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు, అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి వచ్చిన సిబిఐ అధికారులను అప్పటి జిల్లా ఎస్పీ వారిని కదలకుండా కట్టడి చేస్తారా? అక్కడే అర్థం కాలేదా మీ డ్రామాలు… అయినా ప్రజలను ఇంకా వెర్రి వెంగళప్పలని అనుకుంటున్నారా?, ఒక్కసారి నమ్మారని ప్రజలు, మీరు ఏది చెప్పినా పదేపదే నమ్ముతారనుకోవడం అవివేకమే అవుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

LEAVE A RESPONSE