-నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా?
-ఈ పాపాలకు మామా అల్లుళ్లు కారణం కాదా?
-అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
గోదావరి ప్రాజెక్టులపై రిటైర్డ్ ఇంజనీర్లతో ఆనాటి సీఎం కేసీఆర్, ఆనాటి మంత్రి హరీష్ రావు ఒక కమిటీ వేశారు. ఐదుగురు సభ్యుల కమిటీ 14పేజీల నివేదిక ఇచ్చింది. జరిగిన తప్పులకు క్షమాపణలు చెప్పి సహకరిస్తే హరీష్ కు గౌరవం ఉండేది. కానీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు.
మాట్లాడితే గతంలో గతంలో అని మాట్లాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన విషయాలను మీకు గుర్తు చేస్తున్నా. ప్రాణహిత చేవెళ్లకు అడ్డంకులను తొలగించేందుకు మహారాష్ట్ర సీఎంతో , ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ఏపీ సీఎం చర్చించారు. 2012 లో స్టాండింగ్, కో-ఆర్డినేషన్ కమిటీలను వేశారు. ఆనాడు ప్రాణహిత వల్ల మహారాష్ట్రలో ముంపుకు గురయ్యేది 1850 ఎకరాల పట్టా భూములు మాత్రమే.
మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించాలని పుర్రెలో పురుగు పుట్టిందే కేసీఆర్ కు. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ కు ఏ దేవుడు కలలోకి వచ్చి చెప్పారో తెలియదు…ఆయనే ఇంజనీర్లకు సలహా ఇచ్చారు. తుమ్మిడిహెట్టి దగ్గరే ప్రాజెక్టు నిర్మించాలని వారు నియమించిన ఇంజనీర్ల కమిటీ స్పష్టం చేసింది. మేడిగడ్డ వద్ద నిర్మిస్తే నిరుపయోగమని ఐదుగురు ఇంజనీర్ల కమిటీ తేల్చేసింది.. ఈ నివేదికను తొక్కిపెట్టి మామా అల్ల్లుళ్లు ప్రాజెక్టు నిర్మించారు.
ఇదే విషయాన్ని తొమ్మిదేళ్ల క్రితం మేడిగడ్డ మేడిపండేనా అని మీ మిత్రుడి పత్రిక సాక్షిలో రాశారు. తెలంగాణ ఖాజానాను కొల్లగొట్టేందుకు ఇంత దుర్మార్గానికి తెగపడ్డారు. కేసీఆర్ , హరీష్ కలిసి రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారో వాళ్లు తెలుసుకోవాలి. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు… కాళేశ్వరం తెలంగాణకు ఒక కళంకంగా మిగిలిపోయింది.. క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా?
ప్రాజెక్టులు పగిలిపోతుంటే క్షమాపణలు చెప్పకుండా.. ఇంకా వాదిస్తారా? హరీష్ రావును నేను నిలదిస్తున్నా.. ఈ దుర్మార్గాలకు కారణం మీరు.. ఈ పాపాలకు మామా అల్లుళ్లు కారణం కాదా? ఇలాంటి పరిస్థితుల్లో మొండి వాదనలు… తొండి వాదనలు వద్దు హరీష్. మీరు నియమించిన అధికారుల నివేదికనే మీరు తప్పు పడతారా? చేవెళ్లలో ప్రాజెక్టు ఆపితే ఆనాడు ధర్నా చేసిన మా అక్క ఇప్పుడు వారి పక్కనే ఉంది.
ఆనాడు దీక్షలు, ధర్నాలు చేసిన సబితక్క.. ఈనాడు హరీష్ రావు ని సమర్ధిస్తున్నారా జరిగిన తప్పులకు క్షమాపణ హరీష్ చెప్పి… సిట్టింగ్ జడ్జి విచారణకు వచ్చినపుడు ఎవరి ఒత్తిడితో ఇలా చేశారో కన్ఫెక్షన్ స్టేట్ మెంట్ ఇచ్చి ఒప్పుకోవాలి.
అసెంబ్లీ వేదికగా మాజీముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
40 ఏళ్లు రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో తన పాత్ర పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను సమర్ధవంతంగా పోషించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా.