– ఆదినారాయణరెడ్డి
ఏపీలో పొత్తులు, జాబితా రూపకల్పనపై బీజేపీ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలు, జిల్లా కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ సహ సంఘటన్ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ హాజరయ్యారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో శివప్రకాశ్ వరుస సమావేశాలు నిర్వహించారు.
తిరుపతి, హిందూపురం, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో సీఎం రమేశ్, ఆదినారాయణరెడ్డి, విష్ణుకుమార్ వంటి బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు కూడా పాల్గొన్నారు. పురందేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి, సత్యకుమార్ వంటి అగ్రనేతలు శివప్రకాశ్ తో విడివిడిగా సమావేశమయ్యారు.
ఈ సమావేశం అనంతరం ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ, ఏపీలో పొత్తులను బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. పొత్తులతో వెళ్లేందుకైనా సిద్ధం… ఒంటరిగా పోటీ చేసేందుకైనా సిద్ధం అని వ్యాఖ్యానించారు.
టీడీపీ-జనసేన 99 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించాయని, ఇంకా ప్రకటించాల్సిన స్థానాలు చాలా ఉన్నాయని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో తాను జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తానని చెప్పానని ఆదినారాయణరెడ్డి తెలిపారు.