Suryaa.co.in

Andhra Pradesh

దుమ్మురేపిన లోకేష్ శంఖారావం

– యువనేత పర్యటనతో పార్టీ కార్యకర్తల్లో జోష్
– మలివిడత 10 నియోజకవర్గాల్లో సాగిన యాత్ర

(కృష్ణారావు)

అనంతపురం: జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని ధీటుగా ఎదుర్కొని రాబోయే ఎన్నికల్లో విజయఢంకా మోగించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన శంఖారావం మలివిడత యాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ కేడర్ లో జోష్ నింపింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన హిందూపురం నుంచి ప్రారంభమైన శంఖారావం యాత్ర 4రోజులపాటు 10 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ తాడిపత్రితో ముగిసింది. గత ఏడాది నిర్వహించిన యువగళం పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాలకు ప్రాధాన్యతనిస్తూ శంఖారావం యాత్ర కొనసాగింది.

శంఖారావం యాత్ర కొనసాగుతున్న సమయంలోనే బిజెపితో కూడా పొత్తు ఖరారు కావడంతో కేడర్ లో నూతనోత్సాహాన్ని నింపింది. శంఖారావం యాత్రలో పార్టీ కేడర్ ను ఎన్నికలకు సమాయాత్తం చేయడంతోపాటు బాబు సూపర్ -6 కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై లోకేష్ దిశానిర్దేశం చేశారు. గతంలో చేపట్టిన బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం అమలులో మెరుగైన పనితీరు కనబర్చిన కార్యకర్తలకు శంఖారావం సందర్భంగా ప్రశంసాపత్రాలు అందజేసి, ఉత్తమ కార్యకర్తలకు ఎన్నికల తర్వాత తగిన గుర్తింపునిస్తామని హామీ ఇచ్చారు.

అధికారపార్టీ తప్పుడు కేసులకు భయపడాల్సిన పనిలేదని, ఎన్నికల కదనరంగంలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు గత అయిదేళ్లుగా తాము పడిన ఇబ్బందులను యువనేతకు చెప్పుకున్నారు. మరో రెండునెలల్లో రాబోయే ప్రజాప్రభుత్వంలో పార్టీ కేడర్ ను వేధించిన ఏ ఒక్కరినీ వదిలేదని చెప్పడంతోపాటు ఆయా నియోజకవర్గాల్లో ఇబ్బందిపెట్టిన వారి పేర్లను రెడ్ బుక్ లో రాశారు. కార్యకర్తలు పార్టీ కార్యాలయాల చుట్టూ, తనచుట్టూ కాకుండా ప్రజలవద్దకు వెళ్లాలని, అటువంటి వారిని తానే వెదుక్కుంటూ వస్తానంటూ కేడర్ లో ఆత్మస్థయిర్యం నింపారు.

రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు

అధికారపార్టీ అరాచకాలు, అవినీతిని ఎండగడుతూ వాడివేడి వాగ్భాణాలతో యువనేత చేస్తున్న ప్రసంగాలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంటే… పార్టీ కేడర్ కు సరికొత్త ఊపునిస్తున్నాయి. శంఖారావం యాత్ర సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీనేతల మధ్య ఉన్న విభేదాలపై కూడా యువనేత దృష్టిసారించారు. వివిధరకాల సమీకరణల కారణంగా సీటురానంత మాత్రాన నిరుత్సాహ పడాల్సిన పనిలేదని, పార్టీ కోసం కష్టపడితే ఎన్నికల తర్వాత సముచితమైన ప్రాధాన్యతనిస్తామని చెప్పి కార్యోన్ముఖులను చేశారు.

శంఖారావం, యువగళం ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గుంతకల్లు మినహా అన్ని నియోజకవర్గాల ప్రజలు, కార్యకర్తలను యువనేత లోకేష్ కలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి విజయదుంధుబి మోగించాక ఉమ్మడి అనంతపురంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో సాగు, తాగునీటి సమస్య పరిష్కారం, పరిశ్రమలు రప్పించి యువతకు ఉపాధి కల్పించడం వంటి హామీలతో యువనేత లోకేష్ ప్రజలకు అండగా నిలుస్తామన్న భరోసా కలిగించారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో రెండువిడతల్లో శంఖారావం యాత్ర మొత్తం 14రోజులపాటు 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగింది. శంఖారావం కేవలం పార్టీ కేడర్ కు సంబంధించిన కార్యక్రమమైనప్పటికీ ప్రతిరోజూ ఆయా సభల వద్ద వైసిపి బాధిత ప్రజలు పెద్దఎత్తున యువనేతను కలుసుకొని సమస్యలు చెప్పుకోవడం, యువనేతపై ప్రజల్లో నెలకొన్న నమ్మకానికి అద్దంపడుతోంది.

 

LEAVE A RESPONSE