Suryaa.co.in

Andhra Pradesh

కాంగ్రెస్, వైసీపీ మధ్య రహస్య స్నేహం

పల్నాడు జిల్లా, చిలకలూరిపేటలోని బొప్పూడి ప్రజాగళం బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ 

భారత్ మాతాకీ జై… నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. మీ అభిమానానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ భారీగా తరలి వచ్చిన జనసందోహాన్ని చూసి ఉత్సాహవంతంగా ప్రసంగించారు. ఎన్డీయేకి ఓటు వేయాలి… ఎన్డీయే లోక్ సభ సీట్లు 400 దాటాలి అని తెలుగులో పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి సాధ్యమని అన్నారు.

కేంద్రంలో తమ విజయంపై ఎలాంటి సందేహాలు లేవని, ఈసారి 400 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్నామని తెలిపారు. ఏపీలోనూ టీడీపీ, జనసేన కలిసి రావడంతో ఎన్డీయే కూటమి రాష్ట్రంలోనూ విజయభేరి మోగిస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

కోటప్పకొండ సాక్షిగా…

నిన్న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆ తర్వాత నేను పాల్గొంటున్న తొలి సభ ఇదే. ఇక్కడి కోటప్పకొండ త్రికూటేశ్వరస్వామి ఆశీస్సులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీస్సులు లభిస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఈ త్రిమూర్తుల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి మనం అధికారంలోకి వస్తాం. మరోసారి దృఢతరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని హస్తగతం చేసుకోబోతున్నాం. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాలు ఎన్డీయే కూటమికి 400 పైచిలుకు సీట్లను ఇవ్వబోతున్నాయి. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలంటే ఎన్డీయేకి 400కి పైగా సీట్లు అందించాలి. అందుకు మీరందరూ కష్టించి కృషి చేయాలి. ఎన్డీయే లక్ష్యం వికసిత భారత్, ఎన్డీయే లక్ష్యం వికసిత ఆంధ్రప్రదేశ్. డబుల్ ఇంజిన్ సర్కారుతో తప్పకుండా అభివృద్ధి సాధ్యమవుతుంది.

ఏపీలో ఎన్డీయే కూటమి గెలిస్తే ఎలా ఉంటుందో చూడండి

ఎన్డీయే కూటమిలో చేరేందుకు వస్తున్న భాగస్వాములతో కూటమి బలపడుతుంది. అది చంద్రబాబు కావొచ్చు, పవన్ కల్యాణ్ కావొచ్చు… వారి భాగస్వామ్యం విలువైనది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందో చూసుకోండి. కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం సేవా నిరతితో దేశంలోని అందరికీ సేవలు అందించడంలో నిమగ్నమయి ఉంది. పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వం.

దేశ జనాభాలోని 30 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకువచ్చిన ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వం. ఇవాళ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు ఇచ్చాం. ఇక్కడి పల్నాడు ప్రాంతంలోనే 5 వేల పక్కా గృహాల నిర్మాణం జరిగింది. పేదలకు మంచి నీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఒక కోటి కుటుంబాలకు ఉచితంగా కుళాయి కనెక్షన్లు ఇచ్చాం.

ఆయుష్మాన్ భారత్ కింద పేదల కోసం 1.25 కోట్ల మందికి ఉచితంగా వైద్య సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఏపీలో ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.700 కోట్లు ఇచ్చాం. అవి ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి పెద్ద పీట వేసే కార్యక్రమాలు. ఈ అభివృద్ధిని నిర్విఘ్నంగా జరుపుకోవాలంటే ఎన్డీయే కూటమి తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి.

చంద్రబాబు, పవన్ ఇద్దరూ ప్రజల కోసం పోరాడుతున్నారు

ప్రాంతీయపరమైన ఆశలు, జాతీయ ప్రయోజనాలు అన్నింటినీ నెరవేరుస్తాం. ఎన్డీయేలోని ప్రతి సభ్యుడు ప్రజాసేవకే అంకితం. భాగస్వామ్య పార్టీలన్నింటిని కలుపుకుని వెళ్లడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. ఏపీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఏపీని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాం. తిరుపతిలో ఐఐటీ, ఐసర్ నిర్మించాం. విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ నెలకొల్పాం. విజయనగరం జిల్లాలో గిరిజన వర్శిటీ ఏర్పాటు చేశాం.

వాళ్లు వాడుకుని పారేస్తారు

ఇప్పుడు మన ముందుకు ఇండియా కూటమి వచ్చింది. ఆ కూటమిలోని వారందరూ ఒకరినొకరు ఉపయోగించుకుని కేవలం అంతవరకు పరిమితం చేస్తారు. వాళ్లది యూజ్ అండ్ త్రో పద్ధతి. వాడుకుని పారేస్తుంటారు.

ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక విజన్ అంటూ లేదు. వారి భావజాలంపై ఒకసారి దృష్టి మరల్చండి. కేరళలో వామపక్షాలు కావొచ్చు, కాంగ్రెస్ కానివ్వండి… ఒకరినొకరు తిట్టి పోసుకుంటారు. పశ్చిమ బెంగాల్ లోనూ అంతే. తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఒకరినొకరు దూషించుకుంటారు. పంజాబ్ లోనూ పరిస్థితి ఇదే తీరుగా ఉంటుంది. కాంగ్రెస్, ఆప్ ఒకరినొకరు తిట్టుకోవడమే పని. సొంత లాభం తప్ప, వారి దృష్టిలో దేశ ప్రయోజనాలకు ఏమాత్రం విలువ లేదు.

ఎన్టీఆర్… తెలుగుజాతి కీర్తిపతాక

రామాలయం ప్రారంభం రోజున మీరు ఇంటింటా రాముడ్ని స్వాగతించారు. తెలుగులో ఎన్టీఆర్ గారు శ్రీరాముడు, శ్రీకృష్ణుడి పాత్రలకు తన నటనతో జీవం పోశారు. నటించడం అనడం కంటే ఆ పాత్రల్లో ఆయన జీవించారు అంటే సబబుగా ఉంటుంది. కాంగ్రెస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు ఎన్టీఆర్ ఆపన్న హస్తం అందించారు. పేదలకు, రైతులకు అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి.

కాంగ్రెస్ దెబ్బతీసిన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్. తెలుగు ప్రజలకు కాంగ్రెస్ చేసిన అవమానం నుంచే టీడీపీ పుట్టింది. తెలుగుజాతి పౌరుషం ఏంటో చూపించి కాంగ్రెస్ ను మట్టికరిపించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల వేళ వెండి నాణేన్ని కూడా తీసుకువచ్చాం.

ఇక, మరొక ఉన్నతమైన వ్యక్తి పీవీ నరసింహారావు. ఆయన తెలుగుజాతి ముద్దుబిడ్డ. ఆయన ఘనతను ఎన్డీయే ప్రభుత్వం గురించి భారతరత్న ప్రకటించింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎంత అవమానించిందో అందరికీ తెలుసు.

ఏపీ మంత్రులు ఒకరిని మించిన వాళ్లు మరొకరు

ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు సంకల్పాలు తీసుకున్నారని భావిస్తున్నా. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించాలన్నది ఒక సంకల్పం… అవినీతిలో కూరుకుపోయిన ఇక్కడి ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి పెకలించి వేయాలని ఇక్కడి ప్రజలు భావిస్తున్నట్టు నాకు అర్థమవుతోంది. ఈ రాష్ట్రంలోని మంత్రులు సవ్యమైన పరిపాలన అందించడం కంటే కూడా, ఒకరిని మించి మరొకరు అవినీతి చేయడంపైనే దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ ఐదేళ్లలో ఏపీ అభివృద్ధి సంపూర్ణంగా కుంటుపడింది అని నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఓటు చీలకుండా చూడండి

ఏపీ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఎన్డీయేకి ఓటు వేయాలి. ఏపీ ప్రజలు ఒకటి గమనించాలి. ఇక్కడ జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరు వేరు కాదు. ఈ రెండు పార్టీలు కూడా ఒకే ఒరలో ఉన్న కత్తులు. ఈ రెండు పార్టీల నాయకత్వం ఒకే కుటుంబం నుంచి వచ్చిన విషయాన్ని గమనించాలి. వైసీపీపై ప్రజల్లో ఏదైనా వ్యతిరేకత ఉంటే దాన్ని నెమ్మదిగా కాంగ్రెస్ వైపు మళ్లించడానికి చూస్తున్నారు. అందుకే మీరు ఈ ఎన్నికల్లో తెలివిగా వ్యవహరించి ఓటు చీలకుండా చూడాలి. మీ ఓటును ఎన్డీయే కూటమికే వేయాలి.

ఎన్డీయే కూటమి అధికారంలో ఉంటే రాబోయే ఐదేళ్లలో పేదల అభ్యున్నతిని చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చే ప్రభుత్వాన్ని మీరు చూడబోతున్నారు. ఎన్డీయే కూటమికి వేసే ఓటుతో… రాబోయే ఐదేళ్లలో ఏపీకి అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం మీరు పునాదులు వేస్తారు. రాబోయే ఐదేళ్లలో పోర్టుల అభివృద్ధి మాత్రమే కాదు, నీలి విప్లవానికి కూడా మీరు ఎన్డీయేకి వేసే మీ ఓటుతో పునాదులు వేస్తారు” అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ సభకు వచ్చిన వారి మొబైల్ ఫోన్ లైట్లు ఆన్ చేయించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వెలుగులు నింపండి… ఢిల్లీకి కూడా సందేశం పంపండి… ఏపీలోని ఇంటింటికీ సందేశం పంపండి అని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE